Türkiye Luxury Yacht Sinks: టైటానిక్ సీన్ రిపీట్.. లగ్జరీ నౌక జలసమాధి.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 04 , 2025 | 06:17 PM
తుర్కియేలో ఓ లగ్జరీ నావ తన తొలి జర్నీలోనే జలసమాధి అయిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే, నెట్టింట మాత్రం ఈ ఉదంతంపై ఓ రేంజ్‌లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టైటానిక్ లగ్జరీ నౌక ఎలా సముద్రంలో మునిగిందో దాదాపు అందరికీ తెలుసు. ఇలాంటి ఘటన తాజాగా పునరావృతం అయ్యింది. కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఓ లగర్జీ నౌక సముద్రంలోకి ప్రవేశించిన కొద్ది సేపటికే జలసమాధి అయిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చిట్టచివరిగా నీటిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్న నౌక యజమాని వైనం అనేక మందిని కదిలిస్తోంది (Türkiye Luxury Yacht Sinks).
ఉత్తర తుర్కియేలోని జోంగుల్డాక్ తీరంలో ఈ ఘటన జరిగింది. మెడ్ యుల్మాజ్ షిప్‌యార్డ్‌లో ఈ నౌకను నిర్మించారు. దీని ఖరీదు ఏకంగా 1 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే అక్షరాలా రూ.8.74 కోట్లు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మంగళవారం ఈ లగ్జరీ నౌక తొలి ప్రయాణం మొదలెట్టింది. అయితే, సముద్రంలోకి దిగిన కొన్ని నిమిషాలకే ఎవ్వరూ ఊహించని విధంగా మునిగిపోయింది. నావలో ఉన్న కొద్ది మంది ప్రయాణికులు, సిబ్బంది నీటిలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.
తొలి జర్నీ మొదలైన కొన్ని నిమిషాలకే నౌక జలసమాధి కావడాన్ని దాని కెప్టెన్, యజమాని తట్టుకోలేకపోయాడు. అందరి కంటే చివరగా విషణ్ణ వదనంతో నీటిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ దృశ్యం జనాల్ని విపరీతంగా కదిలిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని నిర్వాహకులు తెలిపారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఈ ఉదంతంపై జనాలు నెట్టింట ఓ రేంజ్‌లో కామెంట్స్ పెట్టారు. కొందరు నౌక డిజైన్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. అలాంటి లగ్జరీ నౌక కేవలం మిలియన్ డాలర్లకు రూపొందించారంటే ఏదో తేడా కొడుతోందని కొందరు అన్నారు. నౌక అడుగు భాగం చాలా చిన్నగా ఉందని, ఇదే ప్రమాదానికి కారణమైన ఉండొచ్చని అన్నారు. మరికొందరు మాత్రం సెటైర్లు పేల్చారు. జెన్ జీ తరం యువత దీన్ని నిర్మించి ఉండొచ్చని సరదా వ్యాఖ్యలు చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
గూగుల్ మ్యాప్స్ బృందాన్ని చితక్కొట్టిన గ్రామస్థులు.. సర్వే కోసం వెళితే..
ఈ20 పెట్రోల్.. ఏయే దేశాల్లో ఈ తరహా పెట్రోల్‌ను వాడుతున్నారంటే..