Share News

కారులో ఖండాలు దాటి...

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:17 PM

కారులో లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లాలనుకుంటే... చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకో, పొరుగు రాష్ట్రాలకో వెళ్తుంటారు. కానీ కౌశిక్‌ రాయ్‌, దేబాంజలి జంట మాత్రం... అలా సరదాగా కారులో దేశాలు, ఖండాలు దాటి వెళ్తారు. ఇప్పటికే 50కి పైగా దేశాలు చుట్టొచ్చిన వీళ్లు.. మరో ముందడుగు వేసి.. కోల్‌కతా టూ లండన్‌ చరిత్రాత్మక రోడ్డు ట్రిప్‌నకు సిద్ధమయ్యారు.

కారులో ఖండాలు దాటి...

కారులో లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లాలనుకుంటే... చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకో, పొరుగు రాష్ట్రాలకో వెళ్తుంటారు. కానీ కౌశిక్‌ రాయ్‌, దేబాంజలి జంట మాత్రం... అలా సరదాగా కారులో దేశాలు, ఖండాలు దాటి వెళ్తారు. ఇప్పటికే 50కి పైగా దేశాలు చుట్టొచ్చిన వీళ్లు.. మరో ముందడుగు వేసి.. కోల్‌కతా టూ లండన్‌ చరిత్రాత్మక రోడ్డు ట్రిప్‌నకు సిద్ధమయ్యారు.

ఈ క్రేజీ కపుల్‌ విశేషాలే ఇవి...

పశ్చిమ బెంగాల్‌లోని చందన్నగర్‌కు చెందిన కౌశిక్‌రాయ్‌, దేబాంజలీలకు కారులో లాంగ్‌ టూర్‌లకు వెళ్లడమంటే సరదా. వృత్తిరీత్యా దేబాంజలి డాక్టర్‌కాగా, కౌశిక్‌ రాయ్‌ వ్యాపారవేత్త. ప్రయాణాల మీద ఆసక్తే వీరిద్దర్నీ ఒకటి చేసిందని చెప్పాలి. మొదట్లో వారాంతాల్లో మాత్రమే ట్రిప్‌లు వేసేవాళ్లు. అలా దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల్ని ఒక్కొక్కటిగా చుట్టొచ్చారు. ఆ క్రమంలో వారికి ట్రావెలింగ్‌పై మరింత మక్కువ, లోతైన అవగాహన ఏర్పడింది. ఆ ఇష్టమే వారిలో ప్రపంచాన్ని చుట్టేయాలనే కోరిక కలిగేలా చేసింది.


book8.2.jpg

ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో...

‘‘మావారి ఫ్రెండ్‌ ఒకసారి ఫోన్‌ చేసి ‘నేను, నా భార్య ప్రాగ్‌ (చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని) నుంచి మిమ్మల్ని కలవడానికి స్కూటర్‌పై వస్తున్నాం’ అన్నారు. ఆ మాట వినగానే నాకు ఆశ్చర్యమేసింది. మేమెందుకు అలా స్కూటర్‌ లేదా కారులో దేశాలన్నీ చుట్టేయకూడదూ అనిపించింది. వెంటనే నా ఆలోచనను మావారితో పంచుకుంటే, ఆయన కూడా ఓకే అన్నారు’’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు దేబాంజలి. ట్రావెలింగ్‌ కోసం ఒక టయోటా కారు కొని, దాన్నే గదిగా మార్చేసుకున్నారు. అందులో పోర్టబుల్‌ పవర్‌స్టేషన్‌, కిచెన్‌ సామాగ్రి, బాత్‌రూమ్‌ టెంట్‌... ఇలా అన్నీ సమకూర్చుకున్నారు.


2018 చివర్లో మొదటి అంతర్జాతీయ రోడ్డు యాత్రకు స్వీకారం చుట్టారు. తమ ఇద్దరు కూతుళ్లతో కలసి ఇంటి నుంచి బయలుదేరి... 36 దేశాల గుండా 7 నెలలపాటు ప్రయాణించి... 2019లో ఇరాన్‌ చేరుకున్నారు. రోజూ 400 నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణిస్తూ, మధ్యమధ్యలో ఆహ్లాదంగా ఉన్న ప్రదేశాల్లో క్యాంప్‌ వేసుకుంటూ ముందుకు సాగారు. దారి పొడవునా ప్రకృతిని ఆస్వాదిం చడంతో పాటు, స్థానిక సంస్కృతీ సంప్రదా యాలనూ తెలుసుకుంటూ సాహసయాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. దాని స్ఫూర్తితో మూడేళ్ల వ్యవధిలోనే రెండో ట్రిప్‌ వేశారు.


ఈసారి (2021లో) న్యూఢిల్లీ నుంచి బయలుదేరి యూరప్‌ ఖండంలోని సైబీరియా చేరుకున్నారు. అయితే ఓవైపు ట్రావెలింగ్‌ చేస్తూ, మరోవైపు ఉద్యోగం, బిజినెస్‌ చూసుకోవడం కుదరదని భావించారు. దాంతో వృత్తి జీవితానికి స్వస్తి పలికి, ప్రకృతిని ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇప్పటిదాకా 50కి పైగా దేశాలు చుట్టేశారు. తమ టూర్లకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు. ‘‘సుదీర్ఘకాలం ప్రయాణాలంటే... కొత్త అనుభవంతో పాటు అనేక సవాళ్లూ ఉంటాయి. వాటన్నింటిని తట్టుకుని ముందుకు సాగితేనే అసలైనా మజా వస్తుంది’’ అంటోందీ ట్రావెల్‌ జంట.


అలనాటి బస్సు యాత్ర స్ఫూర్తితో...

book8.3.jpg

ముచ్చటగా మూడోసారి ‘కోల్‌కతా టూ లండన్‌’ ఐకానిక్‌ రోడ్‌ ట్రిప్‌నకు సిద్ధమయ్యారు. ఈ సుదీర్ఘ యాత్ర కోల్‌కతాలో ప్రారంభమై 18 వేల కిలోమీటర్లు... రెండు ఖండాల్లోని (ఆసియా, యూరప్‌) 23 దేశాల గుండా సాగి చివరికి లండన్‌ చేరుకుంటుంది. ఈసారి మొత్తం 15 మంది ప్రయాణికులతో 4 కార్లలో ఈ రోడ్డు యాత్రకు ప్లాన్‌ చేశారు. సాధారణంగా ఆ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే యాభై రోజులకు తక్కువే పడుతుంది. కానీ మార్గ మధ్యలోని దేశాల్లో కార్లు ఆపి పర్యాటక ప్రాంతాల్ని చూపించనున్నారు. అందుకే లండన్‌కు చేరుకోవడానికి 63 రోజులు పడుతుందట.


ఈ ఎగ్జయిటింగ్‌ యాత్రకు ఒక్కొక్కరికి 13 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ యాత్రకు స్ఫూర్తి మాత్రం... 1957లో కోల్‌కతా నుంచి లండన్‌ మధ్య నడిచిన బస్సు యాత్ర. ఆ బస్సు సర్వీసును అప్పట్లో ఒక బ్రిటీష్‌ కంపెనీ నడిపింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతకాలానికి ఆ సర్వీసును ఆపేశారు. అప్పట్లో బస్సు టికెట్‌ రూ. 13,600 ఉండేదట. తిరిగి ఇన్నేళ్లకు ఈ జంట పుణ్యమా అని తిరిగి అదే దారిలో టూరు మొదలవుతోంది. ఏదేమైనా ప్రపంచాన్ని అన్వేషిస్తూ.. అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటున్న ఈ జంటకు జేజేలు చెప్పాల్సిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ లక్ష దాటేసిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆధార్‌లో సమూల మార్పులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 12:21 PM