Japan Astronaut Scam: వృద్ధురాలిపై ప్రేమ వల.. అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రొనాట్‌నంటూ నాటకమాడి..
ABN , Publish Date - Sep 05 , 2025 | 08:50 PM
జపాన్‌లో తాజాగా వింత స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రొనాట్ అని చెప్పుకుని వృద్ధురాలిని నమ్మించిన ఓ నేరగాడు ఆమె కష్టార్జితాన్ని దోచుకున్నాడు. అంతరిక్షంలో చిక్కుకుపోయానని చెప్పి ఆమె నుంచి ఏకంగా రూ.6 లక్షలను రాబట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో తాజాగా వింత మోసం వెలుగులోకి వచ్చింది. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగామినంటూ ఓ నేరగాడు 80 ఏళ్ల వృద్ధురాలిని మోసగించి ఏకంగా ఒక మిలియన్ యెన్‌లను దోచుకున్నాడు. ఈ వింత కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు తాజాగా మీడియాకు వెల్లడించారు (Japan romance scam astronaut).
హొక్కాయిడో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒంటరిగా ఉంటున్న ఆ వృద్ధురాలికి గత జులైలో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను వ్యోమగామినని చెప్పుకుని స్నేహం మొదలెట్టాడు. వృద్ధురాలు అతడి మాటలను నమ్మేసింది. తనకు తెలియకుండానే ఓ భావోద్వేగభరిత బంధాన్ని ఏర్పరుచుకుంది (Hokkaido social media fraud).
ఈ క్రమంలో ఓ రోజు నిందితుడు వృద్ధురాలికి ఫోన్ చేసి తాను అంతరిక్షంలో ఓ వ్యోమనౌకలో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. దాడి జరుగుతోందని, ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయని ఆమెను నమ్మించాడు. ఆక్సిజన్ కొనుక్కోవాలని అన్నాడు. ఇలా రకరకాల కట్టుకథలతో ఆమెను నమ్మించి చివరకు ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. ఇలా డబ్బు పోగొట్టుకున్నాక వృద్ధురాలికి జరిగిన మోసం తెలిసి లబోదిబోమని నెత్తిబాదుకున్నారు (stuck in space scam Japan).
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. వృద్ధురాలి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు రొమాంటిక్ స్కామ్‌కు తెరతీసి ఉంటాడని చెబుతున్నారు. ‘మీకు సోషల్ మీడియాలో ఎవరైనా పరిచయమై డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని ఓ అధికారి పేర్కొన్నారు.
జపాన్‌లో ఒంటరి వృద్ధులను టార్గెట్ చేసే మోసాలు పెరిగిపోతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. కొందరు నేరగాళ్లు దూరపు బంధువుల్లా నటిస్తూ వృద్ధుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేక బాధితులు తాము జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును కోల్పోతున్నారని తెలిపారు.
ఇవీ చదవండి:
గూగుల్ మ్యాప్స్ బృందాన్ని చితక్కొట్టిన గ్రామస్థులు.. సర్వే కోసం వెళితే..
ఓపెన్‌ఏఐలో భారతీయ యువకుడికి ఊహించని ఆఫర్.. నెలకు రూ.20 లక్షల శాలరీ