Jaipur Phone Loss: మన జీవితాలు ఇక మారవేమో.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:33 PM
రోడ్డుపై పోటెత్తుతున్న వరద నీటిలో ఫోన్ కొట్టుకుపోవడంతో ఓ యువకుడు కన్నీటి పర్యంతమైన వీడియో ప్రస్తుతం నెటిజన్లను కదిలిస్తోంది. మౌలిక వసతులు సరిగా లేకపోవడమే ఇందుకు కారణమని నెటిజన్లు ప్రభుత్వాలపై మండిపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా సామాన్యుల జీవితాలు మాత్రం పాతాళంలోనే ఉంటున్నాయి. మౌలిక వసతుల లేమి, కాలుష్యం, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి, నిరక్ష్యం వెరసి పేదలు, సామాన్యుల బతుకులు నిత్యం నరకంగా మారాయి. ముఖ్యంగా నగర జీవుల కష్టాలకు అంతే లేకుండా పోతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను కదిలిస్తోంది.
జైపూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఇటీవల అక్కడ కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో హల్దార్ అనే ఓ యువకుడు వరద నీటిలో తన ఫోన్ పోగొట్టుకుని చివరకు కన్నీటిపర్యంతమయ్యాడు. రోడ్డుపైనే కూలబడి ముఖాన్ని చేతుల్లో దాచుకుని దుఃఖించాడు. రామ్‌నివాస్ ప్రాంతంలో వరద నీరు పోటెత్తుతున్న రోడ్డు మీద వెళుతుండగా అతడి స్కూటీ అదుపు తప్పడంతో కింద పడిపోయాడు.
దీంతో అతడి ఫోన్ నీళ్లల్లో పడిపోయింది. వెంటనే అతడు వాహనాన్ని పక్కన నిలిపి ఫోన్ కోసం వెతకడం ప్రారంభించాడు. నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా కూడా ఓపిగ్గా ఫోన్ దొరుకుతుందేమోనని ఆశగా వెతికాడు. క్షణాలు గడిచే కొద్దీ ఆశలు ఆవిరయ్యాయి. ఫోన్ ఇక దొరకదన్న విషయం నిర్ధారణ అయ్యింది. దీంతో, అతడు తట్టుకోలేక రోడ్డుమీదే కన్నీటి పర్యంతమయ్యాడు. ముఖాన్ని చేతుల్లో దాచుకుని దుఃఖించాడు.
ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నగరాల్లో మౌలిక వసతుల లేమీ ఈ దుస్థితికి కారణమని మండిపడ్డారు. ‘ఓ దేశంగా మనం నిత్యం విఫలమవుతూనే ఉన్నాము. వానా కాలంలో రోడ్లపై పోటెత్తే వరద. పనిచేయని డ్రెయినేజీ వ్యవస్థ. చలికాలంలో పొగ మంచు. ఇక ఏడాదంతా విద్యుత్ సరఫరాలో అంతరాయం, డ్రెయినేజీ సమస్యలు. విచారకరమైన విషయం ఏమిటంటే మనం ఈ పరిస్థితులకు తలవంచాము. ఇది సాధారణ విషయం అన్నట్టుగా అలవాటు పడిపోయాము’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.
‘విలువైన వస్తువు ఏదయినా కోల్పోతే ఎంత బాధ కలుగుతుందో మాటల్లో చెప్పలేము. అవనీతిమయ రాజకీయాలు, బలహీన వ్యవస్థలకు సామాన్యుల వెతలు ఎన్నటికీ పట్టవు’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. భారత్‌లో సామాన్యుల జీవితాలు ఎప్పటికీ మారవని కొందరు నిర్వేదం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల అభిప్రాయాల మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది. గుండెల్ని పిండేసే ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
ఈ కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా వైరల్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ఇలాంటి మోసం మీరెక్కడా చూసుండరు.. దుస్తుల షాపులోకి దూరిన దొంగ..