Share News

నగరాన్ని తలపించే డోమ్‌ రిసార్ట్‌..

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:37 PM

బెర్లిన్‌ నగరానికి 60 కి.మీ దూరంలో క్రాస్నిక్‌ మున్సిపాలిటీ పరిధిలో ‘ట్రాపికల్‌ ఐలాండ్స్‌ రిసార్టు’ ఉంది. ఆరుబయట కాకుండా... ఐరన్‌ డోమ్‌లో రిసార్టు ఉండటం విశేషం. 1181 అడుగుల పొడవు, 688 అడుగుల వెడల్పుతో డోమ్‌ అత్యంత విశాలంగా ఉంటుంది.

నగరాన్ని తలపించే డోమ్‌ రిసార్ట్‌..

ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే... అక్కడి రిసార్టులో స్విమ్మింగ్‌పూల్‌, కాటే జ్‌లు, రెస్టారెంట్లు ఉంటాయని తెలుసు. కానీ ఆ రిసార్టు ఆరుబయట ఉండదు... ఒక పెద్ద డోమ్‌ లోపల ఉంటుంది. అందులోకి అడుగుపెడితే... ఒక సరికొత్త లోకంలోకి ప్రవేశించినట్టు ఎవరైనా సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. ఇంజనీరింగ్‌ అద్భుతంగా పిలిచే, ప్రపంచంలోనే అతి పెద్ద ‘ఫ్రీ స్టాండింగ్‌ డోమ్‌ రిసార్టు’గా గుర్తింపు పొందింది. ఇంతకీ ప్రత్యేక రిసార్టు ఎక్కడుందంటే...

బెర్లిన్‌ నగరానికి 60 కి.మీ దూరంలో క్రాస్నిక్‌ మున్సిపాలిటీ పరిధిలో ‘ట్రాపికల్‌ ఐలాండ్స్‌ రిసార్టు’ ఉంది. ఆరుబయట కాకుండా... ఐరన్‌ డోమ్‌లో రిసార్టు ఉండటం విశేషం. 1181 అడుగుల పొడవు, 688 అడుగుల వెడల్పుతో డోమ్‌ అత్యంత విశాలంగా ఉంటుంది. దాని ఎత్తు 351 అడుగులు. అంటే డోమ్‌లో ఏకంగా ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’నే నిలబెట్టవచ్చు. అంత ఎత్తుతో ఉంటుంది. అంతెందుకు... ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ని రిసార్టులో పడుకోపెట్టొచ్చు.


ఈ భారీ డోమ్‌ నిర్మాణంలో సుమారు 14వేల టన్నుల స్టీల్‌ను ఉపయోగించారు. దీని పూర్తి వైశాల్యం 8 ఫుట్‌బాల్‌ స్టేడియాలతో సమానం. భూమిపై ఉన్న అతి పెద్ద నిర్మాణాల్లో ఇదొకటిగా గుర్తింపు పొందింది. ఎక్కడా సపోర్టు పిల్లర్స్‌ లేకుండా నిర్మించిన అతి పెద్ద హాలుగానూ దీనికి రికార్డు ఉంది. నిజానికి ఈ డోమ్‌ నిర్మాణం 2000 సంవత్సరంలో ఎయిర్‌షిప్‌ హ్యాంగర్‌గా మొదలైంది. కానీ అనుకున్నంత సులువుగా పూర్తికాలేదు. 2002లో నిర్మాణపు పనులు ప్రారంభించిన కంపెనీ దివాళా తీసింది. ఆ మరుసటి ఏడాది మలేసియాకు చెందిన ఇన్వెస్టర్‌ ఒకరు దీన్ని కొనుగోలు చేసి, ఛాలెంజ్‌గా తీసుకుని ‘ట్రాపికల్‌ ఐలాండ్స్‌ రిసార్టు’గా మార్చారు.


అతిపెద్ద రెయిన్‌ఫారెస్ట్‌...

డోమ్‌ రిసార్టు నిర్మాణంలాగే, ఇందులోని విశేషాలకూ కొదవ లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్‌ రెయిన్‌ఫారెస్ట్‌ ఉన్న రిసార్టుగా ఇది గుర్తింపు పొందింది. ఇందులో పెద్ద అడవినితలపించేలా రకరకాల చెట్లు 30 వేల వరకు ఉన్నాయి.వాటి మధ్యలో నుంచి ఒక కిలోమీటరు మేర రహదారి కూడా ఉంటుంది. ఆ దారి గుండా ప్రయాణిస్తూ అటవీ అందాలు వీక్షించవచ్చు. అక్కడక్కడా ఉన్న వంతెనలపై నుంచి చూస్తే రిసార్టు అందాలు కనువిందు చేస్తాయి.


book11.2.jpg

డోమ్‌కు ఒకవైపు కిటికీలు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. మొక్కలకు అవసరమైన సూర్యరశ్మి లభించడం కోసం ఈ ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ బీచ్‌ కూడా ఉండటం విశేషం. రిసార్టుకు వెళ్లిన సందర్శకులు కృత్రిమ బీచ్‌లో సేదతీర వచ్చు. ఇసుకలో ఆడుకోవచ్చు. కృత్రిమ సముద్రంలో ఈత కొట్టొచ్చు. రిసార్టులో ఎప్పుడూ 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా డిజైన్‌ చేశారు. 24 గంటలు, 365 రోజులూ సందర్శించవచ్చు. వంద కాదు, వేయి కాదు... ఏకంగా 8వేల మంది సందర్శకులు బస చేసే సదుపాయం ఇక్కడ ఉండటం విశేషం. మినీ గోల్ఫ్‌ కోర్స్‌, కావాల్సిన రుచులను అందించే రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్‌ సెంటర్లు ఉన్నాయి. బీచ్‌లో రాత్రివేళల్లో క్యాంపింగ్‌ సౌకర్యం ఉంది. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక స్విమ్మింగ్‌ పూల్‌, ప్లే ఏరియా ఉన్నాయి. రిలాక్సేషన్‌ కోసం అతి పెద్ద స్పా కేంద్రం ఉంది. భక్తుల కోసం అంకోర్‌ వాట్‌, బాలినీస్‌ టెంపుల్‌ గేట్‌, థాయ్‌ హౌజ్‌ వంటి నిర్మాణాలను ఇక్కడ చూడొచ్చు. అడుగడు గునా బుద్ధుని విగ్రహాలు కనిపిస్తాయి.


కృత్రిమ రిసార్టు అయినప్పటికీ లోపల పర్యావరణానికి పెద్ద పీట వేస్తుంటారు. నీటిని రీసైకిల్‌ చేసి ఉపయోగిస్తుంటారు. సహజసిద్ధమైన వెలుతురు పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రిసార్టులో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ సదుపాయం ఉంది. పార్కు అందాలు వీక్షించాలనుకునే సందర్శకులు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో ఎక్కి ఎంజాయ్‌ చేయొచ్చు. ఈ రిసార్టుని ఏటా పది లక్షల మందికి పైగా సందర్శిస్తున్నారు. మొత్తానికి ఒక పెద్ద నగరాన్ని తలపించే ఈ డోమ్‌ రిసార్ట్‌ సందర్శన పర్యాటకులకు కచ్చితంగా మరవలేని వింత అనుభవమే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 17 , 2025 | 12:37 PM