వ్యోమగాముల నిశ్శబ్ద నేస్తాలు
ABN , Publish Date - Jul 13 , 2025 | 10:08 AM
భారతీయ వ్యోమగామి శుభాంషు శుక్లా అంతరిక్షంలోకి వెళ్తూ ఒక హంస బొమ్మను తీసుకెళ్లడం చూసే ఉంటారు. వ్యోమగాములు అంతరిక్షంలోకి తమతో పాటు పిల్లలు ఆడుకునే బొమ్మల్ని, అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన యానిమేటెడ్ టాయ్స్‌ని పట్టుకెళుతుంటారు.
భారతీయ వ్యోమగామి శుభాంషు శుక్లా అంతరిక్షంలోకి వెళ్తూ ఒక హంస బొమ్మను తీసుకెళ్లడం చూసే ఉంటారు. వ్యోమగాములు అంతరిక్షంలోకి తమతో పాటు పిల్లలు ఆడుకునే బొమ్మల్ని, అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన యానిమేటెడ్ టాయ్స్‌ని పట్టుకెళుతుంటారు. ఇలా ఎందుకు? వాటి ద్వారా వ్యోమగాములకు కలిగే ప్రయోజనం ఏమిటి?
- భారతీయ వ్యోమగామి శుభాంషు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రత్యక్షంగా ముచ్చటించే సమయంలో తన పక్కన తేలియాడుతున్న ఒక తెల్లటి హంస బొమ్మను పరిచయం చేశారు. దానిపేరు ‘జాయ్’ అని చెప్పారు. ‘జాయ్’ అలంకార వస్తువు కాదు. జ్ఞానానికి ప్రతీక. సాంస్కృతిక చిహ్నం అని చెప్పుకొచ్చారు. ఆ హంసను ఎంపిక చేసింది శుభాంషు శుక్లా ఆరేళ్ల కొడుకు.
- వ్యోమగాములు బొమ్మలను అంతరిక్షంలోకి తీసుకెళ్లడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంప్రదాయం దశాబ్దాల క్రితమే మొదలైంది. 1961లో మొదటిసారి యూరీగగారిన్ తన వెంట ఒక చిన్న బొమ్మను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.
- 1985లో నాసా స్పేస్‌షటిల్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎస్‌టీఎస్-51-డి పేరుతో పంపిన స్పేస్ షటిల్ ఫ్లయిట్‌లో మైక్రోగ్రావిటీ ప్రభావాన్ని ప్రదర్శించేందుకు 11 టాయ్స్‌ను పంపించారు. ఈ ప్రయోగాలు అంతరిక్ష భౌతికశాస్త్రాన్ని వివరించడానికి శక్తిమంతమైన టూల్స్‌గా ఉపయోగపడ్డాయి.
- అంతరిక్షనౌక సూక్ష్మగురుత్వాకర్షణ శక్తిలోకి ప్రవేశించిన విషయాన్ని ప్రదర్శించ డానికి టాయ్స్‌ని తీసుకెళతారు. జీరో-జి ఇండికేటర్స్‌గా ఈ టాయ్స్ పనిచేస్తున్నాయి.

- సున్నా గురుత్వాకర్షణ శక్తి ప్రారంభమైన వెంటనే టాయ్స్ తేలడం ప్రారంభిస్తాయి. అంతరిక్షనౌక కక్ష్యలోకి చేరుకుందనే సూచనను తెలియజేస్తాయి. ఈసారి ఆ పనిని ‘జాయ్’ చేసింది.
-2008లో ఫిక్షనల్ క్యారెక్టర్ అయినటువంటి ‘బజ్ లైట్‌ఇయర్’ను అంతరిక్ష కేంద్రంలోకి పంపించారు. ఆ తరువాత ఫిక్షనల్ స్నోమ్యాన్ క్యారెక్టర్ ‘ఒలాఫ్ (ఫ్రోజెన్), రెడ్ (యాంగ్రీబర్డ్స్), గ్రోగు (బేబీ యోధ) బొమ్మలు అభిమానుల్లో స్ఫూర్తినింపేందుకు వ్యోమ గాములతో అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లాయి.
- 2013లో కారెన్ నైబర్గ్ అనే వ్యోమగామి తన కుమారుని కోరిక మేరకు ఆలివ్ డైనోసార్‌ని తన వెంట అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఎక్కువసార్లు వ్యోమగాములు వారి పిల్లలు ఎంపిక చేసిన టాయ్స్‌ని వెంట తీసుకెళ్లారు. ‘స్పేస్ ఎక్స్’కు చెందిన క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఒక వ్యోమగామి తన కూతురు ఇచ్చిన ‘ట్రెమర్’ అనే డైనోసార్ బొమ్మను తీసుకెళ్లారు. మరోసారి టిమ్ పీక్ అనే వ్యోమగామి ‘మిస్ మౌజ్’ బొమ్మను పట్టుకెళ్లారు.
- టాయ్స్ వ్యోమగాములకు నిశ్శబ్ద నేస్తాలుగా ఉంటున్నాయి. మిషన్ పూర్తయ్యాక ఆ టాయ్స్ మ్యూజియం లోకి చేరతాయి. మరికొన్ని వ్యోమగాముల కుటుంబాల్లోకి చేరి పోతాయి. ఇవి సైన్స్, భావోద్వేగాలకు మధ్య సంబంధాలకు సూచికగా ఉంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు
Read Latest Telangana News and National News