Hyderabad Bystander Stops Bikers: నడిరోడ్డుపై ఆకతాయిల ఆగడాలు.. నడిరోడ్డుపై అమ్మాయిలను వెంబడించి..
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:28 PM
కారులో కూర్చున్న అనికేత్ ఇదంతా చూశాడు. వీడియో సైతం తీశాడు. తర్వాత వారి దగ్గరకు వెళ్లి గట్టిగా అరిచాడు. వారు మొదట భయపడలేదు. అనికేత్ వీడియో తీస్తున్నాడని తెలిసి భయపడ్డారు.
ఓ ముగ్గురు ఆకతాయిలు నడిరోడ్డుపై రెచ్చిపోయారు. స్కూటీపై వెళుతున్న అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అనికేత్ శెట్టి అనే వ్యక్తి సోమవారం రాత్రి తన కారులో జూబ్లిహిల్స్‌లోని రోడ్డుపై వెళుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ ముగ్గురు యువకులు బైకుపై కారు ముందు వెళుతూ ఉన్నారు. ఆ కుర్రాళ్లు వారి ముందు స్కూటీపై వెళుతున్న అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించటం మొదలెట్టారు.
ఆ అమ్మాయిలను ఫాలో అవుతూ వెకిలిచేష్టలు మొదలెట్టారు. వెనకాల కూర్చున్న యువకుడు నెమలి పింఛంతో స్కూటీలో కూర్చున్న అమ్మాయిని తాకసాగాడు. కారులో కూర్చున్న అనికేత్ ఇదంతా చూశాడు. వీడియో సైతం తీశాడు. తర్వాత వారి దగ్గరకు వెళ్లి గట్టిగా అరిచాడు. వారు మొదట భయపడలేదు. అనికేత్ వీడియో తీస్తున్నాడని తెలిసి భయపడ్డారు. వెంటనే బైకును వేగంగా అక్కడినుంచి పోనిచ్చారు. క్షణాల్లో మటుమాయం అయ్యారు. అనికేత్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. వారి బైక్ నెంబర్ పెట్టి హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో ఇలాంటి వాళ్లు బాగా ఎక్కువైపోయారు. ఆడవాళ్లు రోడ్డు మీద వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది’.. ‘ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేయకూడదు. జైల్లో పడేయాలి’..‘అదేమీ అర్థరాత్రి కాదు.. అయినా కూడా అంత ధైర్యంగా అమ్మాయిలతో ఎలా తప్పుగా ప్రవర్తిస్తున్నారో. మరీ బరితెగించారు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల హతం.
మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిపోయి..