High Court Serious on Cops: బాబోయ్.. అసలు వీళ్లు పోలీసులేనా?.. విద్యార్థిని కిడ్నాప్ చేసి..
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:41 PM
పోలీసులు సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజల జీవితాలను, ఆస్తులను రక్షణ కల్పిస్తుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థను తల దించుకునేలా చేశారు మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్ జిల్లా మల్హార్‌గఢ్ పోలీసులు.
మధ్యప్రదేశ్: మాండ్సౌర్ జిల్లా మల్హార్‌గఢ్ పోలీస్ స్టేషన్ ని గత నెల దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్లలో ఒకటిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్ పేరు దేశ వ్యాప్తంగా తెగ ట్రెండ్ అయ్యింది. అలాంటి పోలీసులు దారుణమైన నేరానికి పాల్పడటం సంచలనంగా మారింది. కదులుతున్న బస్సు నుంచి అపహరించి ఓ స్టూడెంట్ ని కిడ్నాప్ చేసి డ్రగ్స్ కేసులో ఫేక్ ఆధారాలతో జైలుకు పంపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మధ్యప్రదేశ్ పోలీసు వ్యవస్థను కుదిపేస్తుంది. అసలేం జరిగింది.. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇంత దారుణానికి ఎలా తెగబడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల భారతదేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో ఒకటిగా నిలిచింది మధ్యప్రదేశ్‌లోని మల్హర్‌గఢ్ పోలీస్ స్టేషన్. అలాంటిది ఓ అమాయక విద్యార్థిని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇరికించినట్లు ఆధారాలను హైకోర్టు బయటపెట్టడంతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 29న 12వ తరగతి చదువుతున్న మల్హడ్ కి చెందిన 18 ఏళ్ల సోహన్ ని కొంతమంది పోలీసులు కదులుతున్న బస్సును ఆపి కిడ్నాప్ చేశారు. కొన్ని గంటల తర్వాత పోలీసులు సోహన్ వద్ద 2.7 కిలోల నల్లమందు పట్టుబడిందని ప్రకటించి, మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత అతన్ని జైలుకు తరలించారు. ఈ కేసు వ్యవహారం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. కానీ.. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయి. పోలీసులు అతని వద్ద ఎలాంటి నల్లమందు స్వాధీనం చేసుకున్నట్లు చూపించలేదు.. వారంతా సాధారణ దుస్తులు ధరించి ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తమ కుమారుడిని పోలీసులు అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని సోహన్ కుటుంబసభ్యులు ఆరోపించారు. డిసెంబర్ 5న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌కు వెళ్లి అక్రమ అపహరణ, తప్పుడు అరెస్టు, సాక్ష్యాలను తారుమారు చేశారని ఫిర్యాదు చేశారు. మంగళవారం విచారణ సందర్భంగా మాండ్‌సౌర్ పోలీసు సూపరింటెండెంట్ వినోద్ కుమార్ మీనా వ్యక్తిగత హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు అన్ని ఆధారాలను పరిశీలించి.. పోలీస్ నివేదిక (FIR)లో చూపిన అరెస్టు వీడియో, వారు చెప్పిన కారణాలు తేడా ఉంటంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్హర్‌గఢ్ పోలీసులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని ఎస్పీ మీనా కోర్టులో అంగీకరించారు. ఈ మొత్తం ఆపరేషన్‌కు మల్హర్‌గఢ్‌కు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ నాయకత్వం వహించాడని.. ఆరుగురు మల్హర్‌గఢ్ పోలీసులను సస్పెండ్ చేశానని, శాఖాపరమైన విచారణకు ఆదేశించానని మీనా కోర్టుకు తెలిపారు. ఆధారాలను పరిశీలించిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Viral Breakup at Gujarat: ఉల్లి తెచ్చిన లొల్లి.. 23 ఏళ్ల వివాహ బంధానికి తెర.!
Geyser hack: గీజర్ కంపెనీల సేల్స్‌కు పెద్ద దెబ్బ.. వేడి నీటి కోసం ఎలాంటి ట్రిక్ కనిపెట్టాడో చూడండి..