H-1b Visa: హెచ్-1బీ వీసా వివాదాస్పదం.. భారత సంతతి ప్రొఫెసర్ కామెంట్స్ వైరల్
ABN , Publish Date - Nov 17 , 2025 | 07:49 PM
హెచ్-1బీ వీసా విధానంపై అమెరికాలోని ఓ భారత సంతతి ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. హెచ్-1బీ అనేది వలసల విధానం కాదని, ఉపాధి సంబంధిత వీసా అని ఆయన అన్నారు. ఆ మేరకు వీసా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు హెచ్-1బీ వీసా విధానాన్ని ఎంతగా వ్యతిరేకిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలి వరకూ ట్రంప్ కూడా ఈ వీసా విధానాన్ని వ్యతిరేకించినా ప్రస్తుతం కాస్త మెత్తబడ్డారు. అమెరికా వర్కర్లకు ట్రెయినింగ్ ఇచ్చేందుకు నిపుణులైన ఫారిన్ వర్కర్ల అవసరం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని హావర్డ్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి ప్రొఫెసర్ రానిల్ హీరా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి (H-1b Impact Ronil Hira Comments).
ఓ టీవీ షో ఇంటర్వ్యూలో రానిల్ హెచ్-1బీ వీసా వ్యవస్థపై పలు కీలక కామెంట్స్ చేశారు. ‘హెచ్-1బీపై అమెరికాకు వచ్చే వారిలో అధిక శాతం మందికి సాధారణ నైపుణ్యాలే ఉంటాయి. ఈ నైపుణ్యాలు అమెరికన్లకూ ఉన్నాయి. అయితే, హెచ్-1బీ వీసాదారులకు చట్టబద్ధంగానే తక్కువ జీతాలు ఇచ్చే వెసులుబాటు ఉండటంతో సంస్థలు వారిని ఎంచుకుంటున్నాయి. ఈ వీసా ఓ సంస్థ స్పాన్సర్‌షిప్‌పై ఆధారపడి ఉంటుంది కాబట్టి హెచ్-1బీ వీసాదారులను నియంత్రించడం కూడా సులువు. వీరు సంస్థకు కట్టుబడి ఉండక తప్పనిసరి పరిస్థితి. ఇది విదేశీ ఉద్యోగులకు కూడా నచ్చదు’ అని అన్నారు
హెచ్-1బీ అనేది వలసల విధానం కాదని, కార్మిక రంగ సంబంధిత విధానమని ఆయన వ్యాఖ్యానించారు. సాధారణ నైపుణ్యాలు ఉన్న వారు కాకుండా ప్రతిభావంతులు మాత్రమే ఈ వీసాతో అమెరికాకు వచ్చేలా మార్పులు చేయడమే ప్రభుత్వం ముందున్న సవాలు అని కామెంట్ చేశారు. ఈ వీసా ద్వారా వచ్చే వారికి మరిన్ని రక్షణలు అవసరమని కూడా కామెంట్ చేశారు. అమెరికా వర్కర్లు లేని సందర్భాల్లో మాత్రమే హెచ్-1బీ వీసాను వినియోగించుకునేలా మార్పులు రావాలని అన్నారు. దీంతో, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇవీ చదవండి:
దొంగ మనసు మార్చిన చిన్నారి.. చూసి తీరాల్సిన వీడియో!
వామ్మో.. ఎలాన్ మస్క్ ట్రోల్ చేస్తే దిమ్మతిరగాల్సిందే.. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓకు షాక్