Share News

Guwahati: అరుదైన ఒంటికొమ్ము ఖడ్గమృగాలను చూడాలని ఉందా.. అయితే..

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:19 AM

ఈశాన్య రాష్ట్రాల పర్యాటకంపై అధ్యయనంలో భాగంగా ‘పీఐబీ’ (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) కొందరు జర్నలిస్టులను అక్కడికి తీసుకెళ్లింది. ఆ బృందంలో నేనొకడ్ని. ఈ పార్కును ఏటా మే నుంచి అక్టోబర్‌ దాకా మూసివేస్తారు.

Guwahati: అరుదైన ఒంటికొమ్ము ఖడ్గమృగాలను చూడాలని ఉందా.. అయితే..

  • అరుదైన ఖడ్గమృగాలకు కేరాఫ్...

ప్రపంచంలోనే అత్యధిక ఖడ్గమృగాలున్న ప్రాంతం. ‘ప్రపంచ వారసత్వ ప్రాంతం’గా గుర్తింపు కూడా ఉంది. అరుదైన ఒంటికొమ్ము ఖడ్గమృగాలను చూడాలంటే... అసోమ్‌లోని ‘కాజీరంగా’ జాతీయ పార్కుకు వెళ్లాల్సిందే. ఆ విశేషాలే ఇవి...

అసోమ్‌లోని ‘కాజీరంగా’ జాతీయ పార్కుకు వెళ్లాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి అసోమ్‌ రాజధాని గువాహటి ఎయిర్‌పోర్టులో దిగి, అక్కడి నుంచి 204 కిలోమీటర్లు గువాహటి- జోర్హత్‌ జాతీయ రహదారిలో వెళ్లాలి. లేదంటే అసోమ్‌లోని మరో ఎయిర్‌పోర్ట్‌ జోర్హత్‌లో దిగి, సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. దట్టమైన అటవీ ప్రాంతం గుండా... అది కూడా యానిమల్‌ కారిడార్‌లో ప్రయాణిస్తూ జింకలు, ఏనుగులు, అడవి పందులు, వన్యప్రాణులను చూసుకుంటూ వెళ్లడం గొప్ప అనుభవం. దట్టమైన అడవిలో బ్రహ్మపుత్ర నదికి దక్షిణాన 1030 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘కాజీరంగా జాతీయ పార్కు’ ఉంటుంది. కిలోమీటర్ల మేర టైగర్‌ రిజర్వ్‌ కూడా ఉంది.


book6.jpg

ఈశాన్య రాష్ట్రాల పర్యాటకంపై అధ్యయనంలో భాగంగా ‘పీఐబీ’ (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) కొందరు జర్నలిస్టులను అక్కడికి తీసుకెళ్లింది. ఆ బృందంలో నేనొకడ్ని. ఈ పార్కును ఏటా మే నుంచి అక్టోబర్‌ దాకా మూసివేస్తారు. ఎందుకంటే వరదల సీజన్‌ కాబట్టి. ఆ సమయంలో పార్కును సందర్శించే అవకాశం ఉండదు. ఈ జాతీయ పార్కును సందర్శించాలంటే నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ సరైన సమయం.


2,613 ఖడ్గమృగాలు...

పార్కులో ఎలిఫెంట్‌ సఫారీలో భాగంగా... ఏనుగు మీద పార్కులో తిరగాలంటే కచ్చితంగా ఉదయం ఐదున్నర, ఆరున్నర, ఏడున్నర గంటలకు చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే జీపులో సఫారీకైతే... ఉదయం 8 నుంచి 10 గంటల దాకా... తిరిగి సాయంత్రం 2 నుంచి 4 గంటల దాకా ఉంటుంది. ఈ సమయంలో ఖడ్గమృగాలతో పాటు అరుదైన జింకల్ని చూసే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు (రైనోలు) ఉన్నది రెండుచోట్లే. అందులో ఒకటి ‘కాజీరంగా’ కాగా, రెండోది నేపాల్‌. అయితే అత్యధిక ఖడ్గమృగాలున్నది మాత్రం ఇక ్కడే. 2022 సర్వే ప్రకారం 2,613 ఖడ్గమృగాలు ఈ పార్కులో ఉన్నాయి. పార్కులో 60 శాతం దాకా గడ్డిభూములు ఉండటం వల్ల ఖడ్గ మృగాలు, ఏనుగులు, జింకలు, అడవి దున్నలు, అడవి పందులకు ఆవాసంగా మారింది.వీటితో పాటు 100కు పైగా పులులు, కింగ్‌కోబ్రా, బర్మిస్‌ పైథాన్‌ (కొండచిలువ) సహా 553 రకాల జీవజాతులున్నాయి. ‘అందుకే ఈ అరుదైన గడ్డి భూములను కాపాడటానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తోంద’ని అక్కడి డీఎఫ్‌వో అరుణ్‌ విఘ్నేష్‌ చెప్పారు.


book6.2.jpg

నిరంతర నిఘా...

వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి ఖడ్గమృగాలను కాపాడేందుకు అటవీ అధికారులు నిరంతరం నిఘా కాస్తుంటారు. ఖడ్గమృగాల కొమ్ములకు అంతర్జాతీయ మార్కెట్‌లో... అందులోనూ చైనా, జపాన్‌ వంటి దేశాల్లో చాలా క్రేజ్‌ ఉంది. అందుకే వీటిని కాపాడటానికి ‘అసోమ్‌ పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’కు (ఏపీపీఎఫ్‌) చెందిన సాయుఽధ బలగాలు ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌ (సెల్ఫ్‌లోడ్‌ రైఫిల్‌), 303 వంటి తుపాకులతో నిరంతరం కాపలా కాస్తున్నాయి. ఈ పార్కులో మొత్తం 250 క్యాంపులున్నాయి. ఈ క్యాంపుల్లో 1500 మంది భద్రతా సిబ్బంది కంటికి రెప్పలా ఖడ్గమృగాలను కాపాడుకునే పనిలో ఉంటారు. ‘కాజీరంగా’ను బ్రహ్మపుత్ర ఉపనది డిఫ్లూ రెండు భాగాలుగా విడగొడుతుంది.


book6.3.jpg

1905లో దీన్ని అభయారణ్యంగా ప్రకటించారు. మనకు స్వాతంత్య్రం రాక ముందు నుంచే అంటే... 1937 నుంచి పర్యాటకులను పార్కులో అనుమ తినిస్తున్నారు. 1950లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా, 1974లో జాతీయ పార్కుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1985లో ఈ అరుదైన పార్కును ‘యునెస్కో’ ‘ప్రపంచ చారిత్రక ప్రదేశం’గా గుర్తించింది. అంతేగాకుండా 2005లో ఏనుగుల రిజర్వ్‌గా, 2007లో టైగర్‌ రిజర్వ్‌గా ప్రకటించారు. 2022లో ‘జీరో పోచింగ్‌ ఇయర్‌’ (వేట జరగని ఏడాది)గా ప్రకటించారు. దీనిని జాతీయ పార్కుగా ప్రకటించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది ఉత్సవాలు కూడా జరిగాయి.


ఏటా సంఖ్య పెరుగుతోంది...

ఈ పార్కులో 1966లో 366 ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉంటే... ప్రస్తుతం 2022 గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 2,613కు చేరింది. ప్రతీ నాలుగేళ్లకోసారి గణాంకాలు నిర్వహిస్తారు. పార్కు రెండు భాగాలుగా ఉండటంతో... ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకొని, గణాంకాలు చేస్తుంటారు. సుశిక్షిత ఏనుగులపై కూర్చోని సిబ్బంది ఖడ్గమృగాల పాదముద్రల ఆధారంగా వాటి సంఖ్యను లెక్కిస్తారు. ప్రతీ ఏటా 40 దాకా ఖడ్గమృగాలు పెరుగుతుండటం విశేషం. ‘ఏటా సుమారు 10 ఖడ్గమృగాలు వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతూ వరదల్లో చిక్కుకుని ప్రాణాలు వదులుతుంటాయ’ని అధికారులు చెబుతున్నారు. ఒంటి కొమ్ము ఖడ్గమృగం 15-16 నెలల పాటు గర్భంతో ఉంటుంది. పుట్టిన రైనోల బరువు 65 కిలోల దాకా ఉంటుంది. పెద్దయ్యాక బరువు 4 వేల నుంచి 5 వేల కిలోల బరువుంటాయి. వీటి జీవనకాలం 35- 45 ఏళ్లు.


వేటగాళ్లు... కేరాఫ్‌ సుదర్శన్‌పూర్‌

అతి పెద్ద అటవీ ప్రాంతంలో సాయుధ దళాలు నిరంతరం నిఘా పెట్టినా సరే, దొంగచాటుగా స్మగ్లర్లు, వేటగాళ్లు పార్కులోకి ముఠాలుగా ప్రవేశిస్తూనే ఉంటారు. ‘కాజీరంగా పార్కులో ఖడ్గమృగాలను వేటాడటానికి మణిపూర్‌లోని సుదర్శన్‌పూర్‌ నుంచి కుకీ, నాగా తెగలకు చెందిన వేటగాళ్లు వస్తుంటార’ని అధికారులు చెప్పారు. ఏకే -47, 303 వంటి ఆయుధాలతో స్మగ్లర్లు గుంపులు గుంపులుగా పార్కులోకి ప్రవేశిస్తారు. ‘చైనా, జపాన్‌లో రైనోల ఒంటి కొమ్ములకు భారీగా డిమాండ్‌ ఉండటంతో వేటగాళ్లు ఆయుధాలతో తెగబడతార’ని అధికారులు చెబుతున్నారు.


దీనిని దృష్టిలో పెట్టుకునే నిఘాను పెంచడంతో 2022లో ఒక్క ఖడ్గమృగం కూడా వేటగాళ్ల బారిన పడలేదట. వేటగాళ్లను అడ్డుకోవడానికి అటవీ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. స్థానిక ప్రజల సహకారం కూడా వేట, స్మగ్లింగ్‌ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తుంది. స్మగ్లర్లకు సంబంధించిన కదలికల సమాచారాన్ని స్థానికులు అధికారులకు చేరవేస్తారు. దాంతో భద్రతా దళాలు అప్రమత్తమై వారి ఆట కట్టిస్తాయి. ఆవిధంగా ఇక్కడి అరుదైన జంతుజాలాన్ని కాపాడుతూ పార్కుకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నారు. ఏదేమైనా పర్యాటకులకు మాత్రం ‘కాజీరంగా’ అరుదైన అనుభవాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.

- డాక్టర్‌ సయ్యద్‌ మొహినుద్దీన్‌, హైదరాబాద్‌


ఈ వార్తలు కూడా చదవండి..

బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!

ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2025 | 11:19 AM