Share News

Pet Lion Escape: పాక్‌లో దారుణం.. బోను లోంచి తప్పించుకున్న పెంపుడు సింహం.. చిన్నారులపై దాడి

ABN , Publish Date - Jul 04 , 2025 | 09:54 PM

పాక్‌లో ఇటీవల ఓ పెంపుడు సింహం కలకలం సృష్టించింది. బోనులోంచి తప్పించుకుని బయటకొచ్చిన సింహం వీధిలోని వారిపై దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Pet Lion Escape: పాక్‌లో దారుణం.. బోను లోంచి తప్పించుకున్న పెంపుడు సింహం.. చిన్నారులపై దాడి
Pet Lion Attack Lahore

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌లో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బోను లోంచి తప్పించుకున్న ఓ పెంపుడు సింహం వీధిలోని వారిపై దాడి చేసింది. ఇంత దారుణం జరుగుతున్నా సింహం యజమానులు మాత్రం చోద్యం చూశారని బాధితులు ఆరోపించారు. పాక్‌లోని లాహోర్‌లో ఈ దారుణం జరిగింది (Pet Lion Attack Lahore).

స్థానిక మీడియా కథనాల ప్రకారం, లాహోర్‌లోని ఓ ఇంట్లో పెంపుడు సింహం ఉంది. గురువారం రాత్రి బోను లోంచి తప్పించుకున్న సింహం గోడ దూకి వీధిలోని వారిపై దాడికి దిగింది. అటుగా వెళుతున్న ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలపై దాడి చేసి పంజాతో రక్కింది. తొలుత మహిళను కిందకు పడదోసిన సింహం ఆ తరువాత ఆమె కుమారుడు (7), కుమార్తెపై (5) దాడి చేసింది. చిన్నారుల చేతులు, ముఖంపై రక్కింది. ఈ లోపు సింహాన్ని పెంచుకుంటున్న వ్యక్తులు బయటకు వచ్చారు.


అయితే, వారు బయటకు వచ్చి సింహం దాడిని చోద్యం చూస్తున్నట్టు ఆశ్చర్యపోయారని బాధితురాలి భర్త వాపోయారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి అపాయం లేదని తేలింది. ఇక బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు దాఖలు చేసిన స్థానిక పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఘటన జరిగిన 12 గంటలలోపే నిందితులను అదుపులోకి తీసుకున్నామని స్థానిక డీఐజీ వెల్లడించారు. సింహాన్ని కూడా జాతీయ పార్కుకు తరలించినట్టు వెల్లడించారు. జంతువు ఆరోగ్యం కూడా బాగానే ఉందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.


పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సింహాలను పెంచుకునేందుకు స్థానిక చట్టాలు అనుమతిస్తాయి. ఇలాంటి ప్రమాదకరమైన జంతువులను పెంచుకోవడాన్ని అక్కడి వారు స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అయితే, గతేడాది ఓ పెంపుడు సింహం ఇలాగే తప్పించుకుని స్థానికులకు చుక్కలు చూపించింది. దీంతో అధికారులు దాన్ని కాల్చి చంపాల్సి వచ్చింది. ఆ తరువాత స్థానిక ప్రభుత్వం అక్కడి చట్టాలను కఠినతరం చేసింది. సింహాలను పెంచుకునే వారికి కనీసం 10 ఎకరాల సొంత భూమి ఉండాలని పేర్కొంది. వీటిని విక్రయించే వారు తమ పేరును ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది. భారీగా రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా విధించింది.


ఇవీ చదవండి:

పనిమనిషి కుటుంబ ఆదాయం నెలకు రూ.1.3 లక్షల.. నెటిజన్ పోస్టు వైరల్

అమెరికన్లు మరీ ఇలాంటోళ్లని అనుకోలేదు.. ఎన్నారైకి దిమ్మతిరిగే షాక్

Read Latest and Viral News

Updated Date - Jul 04 , 2025 | 10:07 PM