Elon Musk: ప్లీజ్.. కనీసం ముగ్గురు పిల్లల్ని కనండి.. జంటలకు మరోసారి మస్క్ రిక్వెస్ట్
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:22 PM
ప్రపంచంలో అనేక మంది పిల్లలు లేకుండా ఉన్నారని మస్క్ తెలిపారు. ఈ లోటును భర్తీ చేసేందుకు అదనంగా పిల్లల్ని కనాలని తల్లిదండ్రులకు మస్క్ తాజాగా సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: నానాటికీ పడిపోతున్న సంతానోత్పత్తి రేటుపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా కుప్పకూలిపోకుండా ఉండాలంటే జంటలు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని సూచించారు. సంతానం లేని వారు, ఒకే సంతానం ఉన్న వారి లోటును భర్తీ చేసేలా అదనంగా పిల్లల్ని కనాలని సూచించారు. వివిధ దేశాల్లో సంతానోత్పత్తి రేటు ఎంతలా తగ్గిపోతోందో గణాంకాలతో సహా వివరిస్తూ మరో వ్యాపారవేత్త మారియో నఫాల్ చేసిన పోస్టుకు మస్క్ ఈ మేరకు స్పందించారు (Elon Musk Birth Rate Warning).
జనాభా స్థిరంగా ఉండాలంటే ప్రతి మహిళకు సగటు సంతానం సంఖ్య 2.1గా ఉండాలన్న మునుపటి అంచనా ఇక ఎంతమాత్రం సరికాదని మారియో నఫాల్ పేర్కొన్నారు.
‘ఆ సగటు ప్రస్తుత పరిస్థితులకు సరిపోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనాభా స్థిరీకరణకు ప్రస్తుతం సగటు సంతానం సంఖ్య 2.7గా ఉండాలి. లేకపోతే మానవ జాతి అంతరించిపోవచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఒక్కో మహిళకున్న సగటు పిల్లల సంఖ్య 1.66. కొన్ని ధనిక దేశాల్లో ఇది మరింత తక్కువ. ఇటలీలో 1.29, జపాన్‌లో 1.30గా ఉంది. వీటితోపాటు పిల్లలు లేని జంటలు, ఆడపిల్లల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటే సగటు సంతానం సంఖ్య 2.7గా ఉండాలి’ అని నఫాల్ ట్వీట్ చేశారు. ఇదేమీ కొత్త కాదని, ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో చెబుతున్నదేనని అన్నారు. కానీ అమెరికన్లకు ఈ విషయం అసలేమాత్రం పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ జనాభా కుప్పకూలుతుందని ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. నానాటికీ పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. ఆర్థిక స్థిరత్వం, సాంకేతిక పురోగతి, సమాజ ఉనికికే గొడ్డలిపెట్టుగా మారుతోందని మస్క్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. రోమ్ సామ్రాజ్యంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రముఖ నాగరికతలన్నీ కుప్పకూలడానికి జనాభా తరుగుదల ప్రధాన కారణమని అన్నారు. దురదృష్టవశాత్తూ చరిత్రకారులు ఈ విషయంపై పెద్దగా దృష్టి సారించలేదని అన్నారు.
1963లో ప్రపంచంలో మహిళల సగటు సంతానం సంఖ్య 5.3గా ఉండేది. ప్రస్తుతం ఇది 2.5కు పడిపోయింది. ఇదే పరిస్థితి మరి కొంతకాలం కొనసాగితే కార్మికుల కొరత, ఆర్థిక మందగమనం వంటివి దాపురిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇంతలా నన్ను అవమానిస్తారా.. ఇంకెప్పుడూ ఇండియాకు రాను: నెదర్‌లాండ్స్ పౌరుడు
ఇన్సూరెన్స్ డబ్బు కోసం రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు.. ఇదేం తెలివి బ్రో..