Elderly Woman Weeps: రావి చెట్టు ముందు వెక్కి వెక్కి ఏడ్చిన మహిళ.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:13 PM
రావి చెట్టు, వృద్ధురాలి మధ్యలోకి ఇమ్రాన్ మేమాన్ అనే ల్యాండ్ డీలర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ రావి చెట్టు ఉన్న స్థలంపై కన్నుపడింది. ఎలాగైనా స్థలాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వృద్ధురాలు నేల కొరిగిన రావి చెట్టు మొదలు దగ్గర నిలబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎందుకు నేల కొరిగిన రావి చెట్టు దగ్గర ఏడుస్తోందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్, రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని సర్రగొండి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు గత 20 ఏళ్లుగా ఓ రావి చెట్టును పెంచుతోంది. పెంచటం అంటే నీళ్లు పోసి వదిలేయటం కాదు. ఆమె దాన్ని కన్న బిడ్డలా భావించేది. ఎంతో శ్రద్ధగా చెట్టుకు సేవలు చేసేది. ఆధ్యాత్మిక చింతనలో భాగంగా చెట్టుకు ప్రతీ రోజూ పూజలు కూడా చేసేది.
రావి చెట్టు, వృద్ధురాలి మధ్యలోకి ఇమ్రాన్ మేమాన్ అనే ల్యాండ్ డీలర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ రావి చెట్టు ఉన్న స్థలంపై కన్నుపడింది. ఎలాగైనా స్థలాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఇందుకు అడ్డుగా ఉన్న చెట్టు తొలగించాలని భావించాడు. ఇమ్రాన్ తన అనుచరుడైన ప్రకాశ్ కొసరేకు విషయం చెప్పాడు. చెట్టును నరికేయమని చెప్పాడు. ఇమ్రాన్ ఆదేశాలతో ప్రకాశ్ చెట్టును కొట్టడానికి సిద్ధమయ్యాడు. చెక్కలు కోసే మిషన్ తీసుకెళ్లి మొదలు వరకు నరికేశాడు. ఆ తర్వాత అక్కడినుంచి పారిపోయాడు.
నేరానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండటానికి చెక్కలు కోసే మిషిన్‌ను నదిలో పడేశాడు. ఇక, చెట్టును నరికేసిన సంఘటన వృద్ధురాలికి తెలిసింది. ఆమె బరువైన గుండెతో పరుగు, పరుగున అక్కడికి వెళ్లింది. చెట్టుపై పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. చుట్టూ ఉన్న జనం ఎంత ఓదార్చినా ఆమె ఏడుపు ఆపలేదు. మామూలు మనిషి అవ్వడానికి చాలా సమయం పట్టింది. ప్రమోద్ పాటిల్ అనే వ్యక్తి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇమ్రాన్, ప్రకాశ్‌లను అరెస్ట్ చేశారు. ఇద్దర్నీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి జుడీషియల్ కస్టడీ విధించింది.
ఇవి కూడా చదవండి
58 మంది పాక్ సైనికులు హతం.. 25 ఆర్మీ పోస్ట్‌లు స్వాధీనం: అఫ్గానిస్థాన్
తండ్రి అంటే పిచ్చి ప్రేమ.. ఆయన కోసం..