Share News

Daughter And Fathers Bond: తండ్రి అంటే పిచ్చి ప్రేమ.. ఆయన కోసం..

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:22 PM

స్వర్ణకు తండ్రి అంటే ప్రాణం. అలాంటి తండ్రి మూడు నెలల క్రితం ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో స్వర్ణ తట్టుకోలేకపోయింది.

Daughter And Fathers Bond: తండ్రి అంటే పిచ్చి ప్రేమ.. ఆయన కోసం..
Daughter And Fathers Bond

ఎక్కువ శాతం మంది పెళ్లికాని ఆడపిల్లలకు తల్లి మీద కంటే తండ్రి మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే సోషల్ మీడియా ఖాతాల్లో ‘డాడీస్ లిటిల్ ప్రిన్సెస్’ అని పెట్టుకుంటూ ఉంటారు. తండ్రి మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. అయితే, కర్ణాటకకు చెందిన ఓ యువతి తండ్రి మీద ఉన్న ప్రేమతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది. తండ్రి చనిపోయిన మూడు నెలలకే ఆత్మహత్య చేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చిక్కబళ్లాపూర్‌లోని గౌరీ బిద్నూర్‌కు చెందిన 22 ఏళ్ల స్వర్ణ బెంగళూరులోని మహారాణి కాలేజీలో ఎమ్ఎస్‌సీ చదువుతోంది.


స్వర్ణకు తండ్రి అంటే ప్రాణం. అలాంటి తండ్రి మూడు నెలల క్రితం ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో స్వర్ణ తట్టుకోలేకపోయింది. తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. రెండు రోజుల క్రితం హాస్టల్ గదిలో ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హాస్టల్ సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.


చిక్కబళ్లాపూర్ జిల్లా ఆస్పత్రి వైద్యులు ఆమెను రక్షించడానికి చాలా ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న (శనివారం) స్వర్ణ ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ చనిపోయింది. కూతురి మృతితో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. నాలుగు నెలల్లో భర్త, కూతుర్ని పోగొట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. స్వర్ణ సోదరుడి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక, ఈ సంఘటనపై బెంగళూరు హైగ్రౌండ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

ఆపరేషన్ బ్లూస్టార్ పెద్ద పొరపాటు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నిలిచిపోనున్న వాటర్ సప్లై..

Updated Date - Oct 12 , 2025 | 03:25 PM