Drone chases the accused: వరుడిపై కత్తితో దాడి.. నిందితుడ్ని వెంటాడిన డ్రోన్!
ABN , Publish Date - Nov 13 , 2025 | 01:00 PM
పెళ్లి వేడుకలో వరుడిని కత్తితో పొడిచి పరారవుతున్న నిందితుణ్ని డ్రోన్ కెమెరా ద్వారా పట్టుకున్నారు పోలీసులు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో పెళ్లికొడుకుపై మరో వ్యక్తి కత్తితో దాడిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సదరు దృశ్యాలు డ్రోన్ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏం జరిగిందంటే?
ఓ వివాహ వేదికపై పెళ్లికి సిద్ధమైన సుజల్‌రామ్ సముద్ర అనే వరుడిపై జితేంద్ర అనే వ్యక్తి మూడుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తేరుకుని నిందితుణ్ని పట్టుకునేలోపే అతడు అప్పటికే బైక్‌పై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో పరారయ్యాడు. వెంటనే అక్కడి ఫొటోగ్రాఫర్ డ్రోన్ కెమెరాను నిందితుడివైపు మళ్లించాడు. ఆ డ్రోన్ అతణ్ని 2 కిలోమీటర్ల వరకూ వెంబడించింది. చివరకు.. ఆ ఫుటేజీ ఆధారంగానే పోలీసులు నిందితుణ్ని పట్టుకున్నారు.
అయితే.. డీజే డాన్స్ విషయంలో జరిగిన గొడవే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. డీజే పాటలకు స్టెప్పులేస్తున్న సమయంలో వరుడు నిందితులను పక్కకు తోయడంతో వారి మధ్య వివాదం తలెత్తగా.. ఆగ్రహానికి గురైన జితేంద్ర ఇలా దాడికి పాల్పడినట్టు సమాచారం. గాయపడిన వరుడు సుజల్‌రామ్ ప్రస్తుతం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇవీ చదవండి:
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్