Diwali 2025 Green Crackers: నకిలీ బాణాసంచాను ఇలా గుర్తించండి..
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:11 PM
Diwali 2025: మన దేశంలో అతిపెద్ద పండుగల్లో దీపావళి కీలకమైంది. అక్టోబర్ 20వ తేదీన దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకోనున్నారు ప్రజలు. అయితే, పండుగ వాతావరణం ఇప్పటినుంచే కనిపిస్తోంది. మార్కెట్లన్నీ సందడిగా ఉన్నాయి. ప్రజలు పండుగకు..
Diwali 2025: మన దేశంలో అతిపెద్ద పండుగల్లో దీపావళి కీలకమైంది. అక్టోబర్ 20వ తేదీన దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకోనున్నారు ప్రజలు. అయితే, పండుగ వాతావరణం ఇప్పటినుంచే కనిపిస్తోంది. మార్కెట్లన్నీ సందడిగా ఉన్నాయి. ప్రజలు పండుగకు అవసరమైన వస్తువులన్నీ ఇప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీపావళి రోజున లక్ష్మీ పూజ, దీపాలు వెలిగించడం చేస్తారు. ఇక పిల్లలు అయితే క్రాకర్స్‌తో రచ్చ రచ్చ చేస్తారు. పూజకు సంబంధించిన విషయాలు పక్కనపెడితే.. ప్రతి ఏటా క్రాకర్స్/బాణాసంచాకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. ముఖ్యంగా పర్యావరణం విషయంలో క్రాకర్స్ అంశం వివాదాస్పదంగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలోనే.. పర్యావరణ హితం కోసం ప్రజలు గ్రీన్ క్రాకర్స్ కాల్చాలంటూ ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. న్యాయస్థానాలు సైతం ఇదే విషయంలో తీర్పునిచ్చాయి. అనేక నగరాల్లో సాధారణ క్రాకర్స్ కాల్చడాన్ని నిషేధించారు కూడా. దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్స్ క్రాకర్స్ కాల్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా పరిమితంగానే అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు సైతం గ్రీన్ క్రాకర్స్‌ను వినియోగించేందుకే ఆసక్తి చూపుతున్నారు.
అయితే, గ్రీన్ క్రాకర్స్ పేరుతో వ్యాపారులు సాధారణ క్రాకర్స్ కూడా అమ్మేస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్, సాధారణ క్రాకర్స్ మధ్య తేడా తెలియని జనాలు.. అధిక ధరలతో కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. అసలు గ్రీన్ క్రాకర్స్‌ని ఎలా గుర్తించాలి.. గ్రీన్ క్రాకర్స్, సాధారణ క్రాకర్స్ మధ్య తేడా ఏంటి? నకిలీ క్రాకర్స్‌ని ఎలా గుర్తించాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి..?
ఇవి సాధారణ క్రాకర్స్ కంటే తక్కువ శబ్దం, పొగను ఉత్పత్తి చేస్తాయి. ఈ గ్రీన్ క్రాకర్స్‌ను నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CSIR-NEERI) కనిపెట్టింది. గ్రీన్ క్రాకర్స్ 110-125 డెసిబెల్స్ శబ్దాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. సాధారణ క్రాకర్స్ అయితే 160 డెసిబెల్స్ కంటే ఎక్కువ స్థాయిలో శబ్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి.
గ్రీన్ క్రాకర్స్ ఎన్ని రకాలు?
గ్రీన్ క్రాకర్స్ 3 రకాలు ఉన్నాయి. స్వాస్, సఫల్, స్టార్. స్వాస్ క్రాకర్స్ దుమ్మును పీల్చుకునే సన్నని నీటి బిందువులను విడుదల చేస్తుంది. సఫల్ క్రాకర్స్‌లో సురక్షితమైన మొత్తంలో అల్యూమినియం ఉంటుంది. ఇది శబ్దాన్ని తగ్గిస్తుంది. స్టా్ర్ క్రాకర్స్‌లో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉండదు. తక్కువ పొగను విడుదల చేస్తుంది.
నకిలీని ఎలా గుర్తించాలి..?
ఈ దీపావళికి మీరు కూడా క్రాకర్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, నకిలీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లైసెన్స్ లేని దుకాణాలు గ్రీన్ క్రాకర్స్ అమ్మడానికి అనుమతి లేదు. పైగా వీరు నకిలీ గ్రీన్ క్రాకర్స్ అమ్మే అవకాశం ఉంటుంది. లైసెన్స్ పొందిన షాప్‌ల వద్దే అసలైన గ్రీన్ క్రాకర్స్ లభిస్తాయి. అలాంటి షాపుల వద్దే గ్రీన్స్ క్రాకర్స్ కొనుగోలు చేయండి. అయితే, మీరు ఎక్కడ క్రాకర్స్ కొన్నప్పటికీ.. అవి నిజమైనవా? నకిలీవా? అని గుర్తించేందుకు ఓ మార్గం ఉంది. ప్రతి బాణాసంచా బాక్స్‌పై ఒక QR కోడ్ ఉంటుంది. దీని ఆధారంగా నకిలీనా.. నిజమైనదా గుర్తించవచ్చు. NEERI యాప్‌ని ఉపయోగించి.. ఈ కోడ్‌ను స్కాన్ చేయాలి. దీంతో ఆ క్రాకర్స్ ఒరిజినలా.. నకిలీవా అని తేలిపోతుంది.
Also Read:
ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. డీజీపీ కీలక ఆదేశాలు
1638 క్రెడిట్ కార్డులు.. ఎలా వాడుతున్నాడంటే..