Share News

ఇక్కడ.. ప్రతి చెట్టుకూ ‘ఆధార్‌’..

ABN , Publish Date - Sep 14 , 2025 | 09:21 AM

అదొక చిన్న గ్రామం. దూరం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లుంటుంది. గ్రామంలోకి అడుగిడితే రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ‘అదేం చెట్టు?’ అని అడగ్గానే గ్రామస్తులు... చెట్టుకు ఉన్న స్టిక్కర్‌ను ఫోన్‌లో స్కాన్‌ చేసి చూపిస్తారు.

ఇక్కడ.. ప్రతి చెట్టుకూ ‘ఆధార్‌’..

అదొక చిన్న గ్రామం. దూరం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లుంటుంది. గ్రామంలోకి అడుగిడితే రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ‘అదేం చెట్టు?’ అని అడగ్గానే గ్రామస్తులు... చెట్టుకు ఉన్న స్టిక్కర్‌ను ఫోన్‌లో స్కాన్‌ చేసి చూపిస్తారు. దాంతో చెట్టుపేరు సహా, దాని వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ‘మనందరికీ ఉన్నట్టే మా ఊరిలో ప్రతీ చెట్టుకు కూడా ఆధార్‌ ఉంది!’ అని చెబుతారు ‘ముఖరా (కె)’ గ్రామస్తులు. ఆ విశేషాలే ఇవి...

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాలు సాధారణంగా వానాకాలంలో మొదలవుతాయి. వివిధ ప్రభుత్వ పథకాలు, సిఎస్‌ఆర్‌ కార్యక్రమాల ద్వారా లక్షలాది మొక్కలు నాటినప్పటికీ, వాటిని రక్షించడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయి? ఎన్ని పోయాయో తెలుసుకోవడం అసాధ్యంగా మారింది.

ఈ సమస్యకు ఒక వినూత్న సాంకేతిక పరిష్కారం కనిపెట్టి తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ‘ముఖరా (కె)’ గ్రామస్తులు దేశానికి ఒక కొత్త మార్గం చూపిస్తున్నారు. ‘డిజిటల్‌ ట్రీ ఆధార్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి, ప్రతీ చెట్టును జియో- ట్యాగ్‌ చేసి, క్యూఆర్‌ కోడ్‌ కేటాయించడం ద్వారా సాంకేతికతను పర్యావరణ పరిరక్షణలో మిళితం చేశారు.


book5.2.jpg

స్కాన్‌ చేస్తే అన్ని వివరాలు...

‘‘ఆధార్‌ కార్డు ప్రభుత్వ పథకాలు పొందేందుకు గుర్తింపుగా ఉపయోగ పడుతుంది. అదే పద్ధతిలో ఇక్కడున్న చెట్ల పరిస్థితులను క్రమబద్ధంగా నమోదు చేసుకోవడమే ‘డిజిటల్‌ ట్రీ ఆధార్‌’ లక్ష్యం. ఈ పథకం కింద గ్రామంలోని ప్రతీ చెట్టును జియో- ట్యాగ్‌ చేసి, క్యూఆర్‌ కోడ్‌ కేటాయించాం. ఆ కోడ్‌ను మొబైల్‌ ఫోన్‌తో స్కాన్‌ చేస్తే, లొకేషన్‌, చెట్టు పేరు, శాస్త్రీయ పేరు, ఔషధ గుణాలు, ఆరోగ్యం, వయసు, రోజూ వదిలే ప్రాణ వాయువు? పెరుగుదల వంటి పూర్తి సమాచారం లభిస్తుంది. దీనివల్ల చెట్ల దీర్ఘకాలిక సంరక్షణ సాధ్య మవుతుంది. మనుషులకు ఆధార్‌ కార్డులు ఉన్నట్లే, ఇప్పుడు చెట్లకూ డిజిటల్‌ ఐడెంటిటీ లభించింది. ఇలా దేశంలోనే తొలిసారిగా చెట్లకు డిజిటల్‌ గుర్తింపు ఇచ్చిన గ్రామంగా గుర్తింపు పొందింది’’ అని చెప్పారు గ్రామ మాజీ సర్పంచ్‌ గాడ్గే మీనాక్షి.

ముఖరా (కె) గ్రామ జనాభా 1080. ఇప్పటివరకు ఈ గ్రామస్తులు పెంచిన చెట్ల సంఖ్య 1,05,624. అంటే ఒక్కొక్కరు సుమారుగా 100 చెట్లను పెంచినట్టు అంచనా.


book5.3.jpg

ఆకుల నుంచి ఆదాయంతో సోలార్‌ పవర్‌...

ఇక్కడి చెట్ల నుంచి రాలుతున్న ఆకులను వృథా చేయకుండా, వాటికి పశువుల వ్యర్ధాలను కూడా కలిపి వర్మికంపోస్ట్‌ తయారు చేస్తున్నారు. గత మూడేళ్లలో వర్మి కంపోస్ట్‌ అమ్మకాల ద్వారా సుమారు 14 లక్షల రూపాయల ఆదాయం ఈ గ్రామానికి వచ్చింది. అందులో నుంచి 6 లక్షల రూపాయలతో పంచాయితీ భవనంపై సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఉత్పత్తి అవుతున్న సోలార్‌ విద్యుత్తుని పంచాయితీ ఆఫీసు, వీధిదీపాలు, స్కూల్‌, అంగన్‌వాడీ, డిజిటల్‌ లైబ్రరీ, మందిరానికి వినియోగి స్తున్నారు.


book5.4.jpg

కేవలం డిజిటల్‌ ట్రీ విధానమే కాక, మియా వాకీ పద్ధతిలో ఊరి చుట్టూ దట్టమైన అడవిని సృష్టించారు. ఈ గ్రామంలో ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత కనిపిస్తాయి. ఇంకుడు గుంతల ద్వారా నీటిని ఒక పాత బావిలోకి మళ్లించి, ఆ నీళ్లను సేద్యానికి వాడుతున్నారు. ఈ గ్రామం పర్యావరణం, పచ్చదనం, పరిశుభ్రతల్లో చూపుతున్న చొరవకు ఇప్పటిదాకా జాతీయ స్ధాయిలో 6, రాష్ట్ర స్ధాయిలో 25 అవార్డులు అందుకుని, గ్రామీణాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా మారింది.

- శ్యాంమోహన్‌, 94405 95858

Updated Date - Sep 14 , 2025 | 09:25 AM