Share News

Colored stone lakes: పర్యాటకుల స్వర్గధామం రంగురాళ్ల సరస్సులు..

ABN , Publish Date - Dec 14 , 2025 | 08:31 AM

ఈ సరస్సుల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఎంత స్వచ్ఛంగా అంటే... సరస్సుల్లోని 30 అడుగుల లోతులో ఉన్న రాళ్లను కూడా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ ఉండే తక్కువ ఉష్ణోగ్రతలు సరస్సులో నాచు పెరగడాన్ని నిరోధిస్తాయి.

Colored stone lakes: పర్యాటకుల స్వర్గధామం రంగురాళ్ల సరస్సులు..

చుట్టూ కొండలు, ఏపుగా పెరిగిన చెట్లు... మధ్య మధ్యలో స్వచ్ఛమైన సరస్సులు... వాటిలో సప్తవర్ణాల రాళ్లు.. వెరసి పర్యాటకులకు స్వర్గధామంగా ఉంటుందా పార్కు. ఎవరో ఓపికగా పేర్చినట్టుగా... రకరకాల రంగురాళ్లతో కనువిందు చేసే ఆ సరస్సులు ఎక్కడ ఉన్నాయంటే....

కెనడాతో సరిహద్దును కలిగి ఉన్న అమెరికాలోని మోంటానాలో ‘గ్లేసియర్‌ నేషనల్‌ పార్కు’ ఉంది. ఈ పార్కును ‘సరస్సుల నిలయం’ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ పార్కులో చిన్నాచితకా 700కు పైగా సరస్సులు ఉన్నట్టు అంచనా. విశేషమేమిటంటే... వీటిలో 131 సరస్సులకు పేర్లు ఉన్నాయి. సుమారు 200 సరస్సులు ఐదెకరాలలో విస్తరించి ఉండగా, డజనుకు పైగా సరస్సులు అత్యంత విశాలమైనవిగా ప్రసిద్ధ చెందాయి.


ఈ సరస్సుల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఎంత స్వచ్ఛంగా అంటే... సరస్సుల్లోని 30 అడుగుల లోతులో ఉన్న రాళ్లను కూడా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ ఉండే తక్కువ ఉష్ణోగ్రతలు సరస్సులో నాచు పెరగడాన్ని నిరోధిస్తాయి. కాబట్టి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. ఈ సరస్సులకు సంబంధించి మరికొన్ని అంశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అవే రంగు రాళ్లు. సరస్సుల లోపల రాళ్లు ఉండటం సాధారణమే. కానీ ఇక్కడి సరస్సులో మాత్రం అనేక రంగుల రాళ్లు కనిపిస్తాయి. అవి కూడా పొందికగా ఎవరో పేర్చినట్టుగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ రాళ్లు ముదురు ఎరుపు, ఆకుపచ్చ, నీలం, మెరూన్‌ రంగుల్లో ఉంటాయి. ప్రధానంగా పార్కులోని ‘మెక్‌డొనాల్డ్‌ లేక్‌’లో ఈ తరహా రాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సరస్సు 6,823 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అక్కడున్న సరస్సులలో అత్యంత పొడవైన సరస్సు ఇదే. సుమారు 15 కి.మీ పొడవుంటుంది. లోతైన సరస్సు కూడా ఇదే. సుమారు 450 అడుగుల లోతు ఉంటుంది.


book3.jpg

విస్తృత అధ్యయనాలు ...

‘మెక్‌డొనాల్డ్‌ లేక్‌’లో రంగురంగుల రాళ్లు ఏర్పడటానికి గల కారణాలపై పరిశోధకులు విస్తృత అధ్యయనాలు చేశారు. చివరకు రాళ్ల రంగుకు కారణం ఐరన్‌ ఉండటం లేక లోపించడం అని తేల్చారు. ఇనుము, ఆక్సిజన్‌తో కలిసి ఎరుపు రంగులోకి మారుతుంది. లోతైన ప్రదేశాల్లో తక్కువ ఆక్సిజన్‌ వల్ల నీలంరంగు వస్తుంది. ఎరుపు రంగు రాళ్లతో పోల్చితే ఆకుపచ్చ రాళ్లు లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఏర్పడటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఎరుపు రంగు రాళ్లు తక్కువ లోతులో ఏర్పడితే, ముదురు ఆకుపచ్చ రంగు రాళ్లు లోతైన ప్రదేశంలో ఉంటాయి. క్లోరైట్‌ వంటి కొన్ని మినరల్స్‌ కూడా ఆయా రంగులకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.


‘గ్లేసియర్‌ నేషనల్‌ పార్కు’లో మెక్‌డోనాల్డ్‌ లేక్‌తో పాటు మరికొన్ని సరస్సుల్లో కూడా ఈ రంగురంగుల రాళ్లు కనిపిస్తాయి. విచిత్రంగా ఒక్కో సరస్సులో ఒక్కో రంగు రాళ్లు చూడొచ్చు. ఆకుపచ్చ రాళ్లు ‘ఒటొకోమి లేక్‌’లో ఎక్కువగా కనిపిస్తాయి. ట్రౌట్‌ లేక్‌లో ఎరుపు, ఆకుపచ్చ రాళ్లు కనువిందు చేస్తాయి. ఈ రాళ్లన్నీ నునుపుగా ఉంటాయి. ఇవన్నీ ఇటీవల ఏర్పడి నవి కాదని, శతాబ్దాల కాలంగా మార్పులు చెందుతూ వచ్చాయని పరిశోధకులు చెబుతారు. సరస్సుల్లోని రాళ్లను పర్యాటకులను ముట్టుకోనివ్వరు. వాటిని ‘జియాలాజికల్‌ వండర్‌’గా గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుం టున్నారు. పర్యాటకులు కాస్త దూరం నుంచే చూస్తూ, వాటిని కెమెరాల్లో బంధిస్తుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇండియా కూటమిని ఏకం చేస్తాం

మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నా గృహ రుణం రావటం లేదా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2025 | 08:31 AM