Car Makers Viral Stunt: స్టంట్ పాడు కాను.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:19 AM
ఎంతో చరిత్ర కలిగిన స్వర్గపు మెట్లపై ఓ కంపెనీ చేసిన కారు స్టంట్ ఘోరంగా ఫెయిల్ అయింది. కారు ప్రమాదానికి గురైంది. కొంచెం ఉంటే కారు డ్రైవర్ ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి.
చైనాకు చెందిన ఓ ప్రముఖ కార్ల కంపెనీ చేసిన మార్కెటింగ్ స్టంట్ ఘోరంగా ఫెయిల్ అయింది. మెట్ల మార్గంపై ఆ కంపెనీకి చెందిన కారు ప్రమాదానికి గురైంది. కొంచెం ఉంటే లోయలో పడిపోయేది. అదృష్టం బాగుండి కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకూ ఏం జరిగిందంటే.. చైనాకు చెందిన చెరీ ఆటోమొబైల్స్ కంపెనీ ది ఫెంగ్యూన్ ఎక్స్3ఎల్ పేరుతో ఓ కొత్త కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. కారు ప్రమోషన్ కోసం వినూత్న పనికి పూనుకుంది. రేంజ్ రోవర్ కంపెనీ చేసినట్లు ప్రమోషన్ చేయాలనుకుంది.
రేంజ్ రోవర్ తమ కంపెనీ కారు ప్రమోషన్ కోసం చైనా, టియాన్‌మెన్ పర్వతంపై ఉన్న ‘హెవెన్ స్టెయిర్‌కేస్ (స్వర్గపు మెట్లపై) కారును ఎక్కించింది. రేంజ్ రోవర్ కారు మెట్లపై సర్రున పైకి ఎక్కేసింది. అయితే, ది ఫెంగ్యూన్ కారు మాత్రం మెట్లపైకి ఎక్కలేకపోయింది. ఘోరంగా ఫెయిల్ అయింది. కొన్ని మెట్లు ఎక్కగానే బ్యాలెన్స్ కోల్పోయింది. వేగంగా వెనక్కు దూసుకువచ్చింది. కొంచెం ఉంటే మెట్లపై నుంచి లోయలోకి పడి పోయేది. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆ ప్రాంతం బాగా ధ్వంసం అయింది.
ఇక, ఈ సంఘటనపై చెరీ కంపెనీ స్పందించింది. ప్రజలకు క్షమాపణ చెప్పింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. పాడైన మెట్ల ప్రాంతాన్ని అతి త్వరలో బాగు చేయిస్తామని చెప్పింది. నష్ట పరిహారం కూడా కట్టిస్తామని అంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఎంతో చరిత్ర కలిగిన ఆ మెట్లను పాడు చేశారు. మీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఒక్కసారి ఎంవోయూ జరిగితే..ఆ పరిశ్రమ ఇక మాదే