AP Government: ఒక్కసారి ఎంవోయూ జరిగితే..ఆ పరిశ్రమ ఇక మాదే
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:10 AM
పరిశ్రమ ఏర్పాటుకు ఒక్కసారి ఎంవోయూ జరిగితే.. ఆపై దానిని తమదిగానే భావించి ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
రియల్ టైమ్‌లో ప్రారంభింపజేస్తాం: చంద్రబాబు
పదేళ్లలో ట్రిలియన్ డాలర్లు తేవడమే లక్ష్యం
రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్ల ఉత్పత్తి
విశాఖ కొండపై అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్
సదస్సులో సీఎం ప్రారంభోపన్యాసం
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమ ఏర్పాటుకు ఒక్కసారి ఎంవోయూ జరిగితే.. ఆపై దానిని తమదిగానే భావించి ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దానిని రియల్ టైమ్‌లో ప్రారంభించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. గత 17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైన సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు-2025లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో మినరల్స్, మైనింగ్, పోర్టులు, లాజిస్టిక్, ఏరోస్పేస్, ఆక్వా, పునరుత్పాదక ఇంధనం.. ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎప్పుడూ నంబర్‌వన్‌గా ఉంటోందని, ఇప్పుడే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మారామన్నారు. ‘రాష్ట్రంలో స్పేస్, డ్రోన్, రోబోటిక్స్, డిఫెన్స్ ఉత్పత్తులు, క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చేస్తున్నాం. రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లను ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తాం’ అని తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
వేగంగా అనుమతులు..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చాం. అనుమతులు వేగంగా ఇస్తున్నాం. ఆర్సెలార్ మిట్టల్ రూ.1,35,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చింది. రికార్డు సమయంలో భూసేకరణ చేశాం. అదే సమయంలో పర్యావరణ అనుమతులూ ఇచ్చేశాం. మూడేళ్లలో ఆ పరిశ్రమ మొదటి దశ పూర్తి చేయబోతోంది. గూగుల్ విశాఖకు వచ్చింది. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ కి దగ్గర్లో స్పేస్‌సిటీ మొదలుపెట్టాం. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలో డ్రోన్‌సిటీ ప్రారంభించాం. ఆపరేషన్ సిందూర్‌లో వాడిన డ్రోన్ కర్నూలులో తయారుచేసిందని ఇటీవల ప్రధాని మోదీ చెప్పారు. రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీ/కారు తయారుచేయబోతున్నాం. ఏటీసీలాగా డీటీసీ పెట్టి నియంత్రించాలనేది ఆలోచన. జనవరి నాటికి దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఏపీలో అందుబాటులోకి వస్తుంది. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మారుస్తాం.
సంస్కరణలకు ఎప్పుడైనా సై..
గతంలో ఎవరైనా సంస్కరణల గురించి మాట్లాడితే ధనికులకు అండగా ఉన్నారంటూ ప్రచారం చేసేవారు. ఎన్నికల్లో ఓట్లు పడవని.. ఎవరూ మాట్లాడేవారు కాదు. కానీ నేను సంస్కరణల గురించి గట్టిగా మాట్లాడాను. పెట్టుబడుల కోసం రెగ్యులర్‌గా దావోస్ వెళ్లడం మొదలుపెట్టాను. సీఐఐతో కలిసి పెట్టుబడుల సదస్సులు నిర్వహించాను. దేశంలో ఇప్పటివరకు 30 సీఐఐ సదస్సులు జరిగితే అందులో ఏడు ఏపీనే నిర్వహించింది. అప్పటి ప్రధాని వాజపేయిని ఒప్పించి టెలికమ్యూనికేషన్ రంగాన్ని డీ రెగ్యులేట్ చేయడం వల్ల ఐటీ బూమ్ వచ్చింది. అనుకూల పరిస్థితులు కల్పిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. వైసీపీ చెత్తపాలన కారణంగా ఏపీ ఎకానమీ వెంటిలేటర్‌పై ఉండడంతో కేంద్రం అండగా నిలుస్తోంది. అమరావతి కోసం ఒక దారి చూపించారు. పోలవరానికి సాయం చేశారు. వైజాగ్ స్టీల్ పునరుద్ధరించారు. రూ.12,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. ఇవన్నీ కొంత ఉపశమనం కలిగించాయి. బిహార్లో జరిగిన ఎన్నికల్లో నేనిప్పుడు ప్రసంగిస్తున్న సమయానికి ఎన్‌డీఏకి 181 సీట్లు వచ్చాయి. మొత్తం 200 సీట్లు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధానిగా నరేంద్రమోదీయే గెలుస్తారు. భారతదేశం పెట్టుబడులకు అనువైన ప్రాంతం. గతంలో ఆర్థికంగా 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడు నాలుగో స్థానానికి వచ్చింది. వచ్చే ఏడాది మూడో స్థానంలోకి వెళ్తుంది. 2047 నాటికి ప్రపంచంలో నంబర్‌వన్ స్థానంలో నిలుస్తుంది.
ఎన్నింటికో ఏపీ హబ్
ఐటీ, ఉత్పాదక రంగం, గ్రీన్ హైడ్రోజన్, క్వాంటమ్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీస్, డేటా కేంద్రాలు, ఏఐ, వ్యవసాయం, ఉద్యానరంగాలు, అరుదైన ఖనిజాలు, పర్యాటకం తదితర రంగాలకు ఆంధ్రప్రదేశ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. రియల్ టైమ్‌లో అనుమతులు, ప్రోత్సాహకాలతో ఇన్వెస్టర్లకు భరోసా ఇస్తున్నాం. రాష్ట్ర విభజనతో సేవా రంగం, అర్బన్ జనాభా ఎక్కువగా తెలంగాణకు వెళ్లిపోయి, వ్యవసాయం మాత్రమే ఏపీకి రావడంతో ఆదాయం తగ్గింది. వైసీపీ హయాంలో ఐదేళ్లు ఆర్థిక రంగం కుదేలైంది. కానీ, రాష్ట్రానికి సారవంతమైన భూములు, నైపుణ్యాలు కలిగిన ప్రజలు, 1000 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. వీటిని వాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి విజన్-2047 రూపొందించాం. 2047 నాటికి 2.4 ట్రిలియన్ యూఎస్ డాలర్ ఎకానమీని, 42,000 డాలర్ల తలసరి ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక తలసరి ఆదాయం భారతీయులే సంపాదిస్తున్నారు. అందులో 33ు మంది తెలుగు వారే. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి నలుగురు నిపుణుల్లో ఒకరు ఏపీ నుంచే ఉన్నారు.
స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి..
డేటా సెంటర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. రాబోయే 2-3 రోజుల్లో మరో 5 గిగావాట్ల డేటా సెంటర్లకు ఎంవోయూలు జరుగుతాయి. స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. మెడ్‌టెక్, ఈవీ టెక్, డీప్ టెక్‌లలో అవకాశాలు ఉన్నాయి. పర్యాటక రంగంలోను పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలి. విశాఖలో అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం ఐడీపీవోతో జాయింట్ వెంచర్ చేయబోతున్నాం. దీనికి సముద్రానికి ఎదురుగా కొండను కేటాయిస్తాం. అరకు కాఫీ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్‌గా మారింది.
పది సూత్రాలే ముఖ్యం
రాష్ట్ర ప్రభుత్వం పది సూత్రాలను లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాల పెంపు, నీటి భద్రత, సాంకేతికతతో వ్యవసాయం, రైలు, రోడ్డు, విమానాలతో గ్లోబల్ లాజిస్టిక్స్, ఇంధన వనరులు, డీప్ టెక్నాలజీ, నైపుణ్య శిక్షణ, స్వచ్ఛాంధ్ర ఉత్పత్తి పెంపులపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో భూమికి కొదవ లేదు. పారిశ్రామిక అవసరాలకు 50 వేల ఎకరాలు కేటాయించాం. ఇప్పటికే 25 పాలసీలు తీసుకొచ్చాం. అవసరమైతే మరిన్ని అమల్లోకి తెస్తాం.