ChatGPT: చాట్‌జీపీటీతో 30 రోజుల్లో రూ.10 లక్షల అప్పు తీర్చేసిన మహిళా రియల్టర్
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:41 PM
చాట్‌జీపీటీ సాయంతో ఓ మహిళ అప్పుల ఊబి నుంచి నెల రోజుల్లోనే బయటపడింది. రియల్టర్ అయిన ఆమె ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ చాట్‌బాట్‌లను తమ అవసరాలకు వినియోగించుకుంటూ ప్రజలు ఇక్కట్ల నుంచి బయటపడుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళా రియల్టర్ 30 రోజుల్లోనే ఏకంగా రూ.10లక్షల అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. జీవితాన్ని గాడిన పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
డెలావేర్‌కు చెందిన 35 ఏళ్ల జెన్నిఫర్ ఆలెన్ ఓ రియల్టర్. ఆమె కంటెంట్ క్రియేటర్‌గా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే, సదరు మహిళకు మొదటి నుంచి ఆర్థిక క్రమశిక్షణ తక్కువ. ఇటీవలే తల్లైన ఆమెకు తన క్రమశిక్షణ రాహిత్యం కారణంగా చిక్కులు ఎదురయ్యాయి. ఏకంగా రూ.20 లక్షల అప్పుల్లో కూరుకుపోయింది. ‘నా సంపాదన సరిగానే ఉన్నా ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఎవరూ నేర్పించలేదని’ ఆమె తెలిపారు.
జెన్నిఫర్‌కు బిడ్డ పుట్టిన తర్వాత ఖర్చులు అమాంతంగా పెరిగిపోయాయి. బిడ్డ వైద్యంతోపాటు ఇతర ఖర్చులూ పెరగడంతో క్రెడిట్ కార్డుపై ఆధారపడటం మెదలుపెట్టింది. ‘మేమేమీ దుబారా ఖర్చులు చేయలేదు. ఆ డబ్బుతో అలా రోజులు గడిపే వాళ్లమంతే. కానీ అప్పులు మాత్రం చూస్తుండగానే కొండలా పెరిగిపోయాయి. నాకు తెలీకుండానే ఇదంతా జరిగిందని’ ఆమె చెప్పారు.
చేయి దాటుతున్న పరిస్థితులను ఎలాగైనా అదుపులోకి తెచ్చుకోవాలనుకున్న జెన్నిఫర్ ఆలస్యం చేయకుండా చాట్‌జీపీటీని సలహా కోరారు. తన రాబడి, ఖర్చులు, ఆస్తులు, అప్పులు.. ఇలా అన్నీ చాట్‌జీపీటీ ముందుంచారు. ఈ వివరాలను జాగ్రత్తగా పరిశీలించిన చాట్‌బాట్ డబ్బు ఆదా కోసం 30 రోజుల ప్రణాళికను డిజైన్ చేసి ఇచ్చింది. జెన్నీఫర్ దీన్ని తూచా తప్పకుండా అమలు చేశారు. రోజూ పొదుపు కోసం చాట్‌జీపీటీ సూచనలను ఫాలో అయ్యారు.
చాట్‌జీపీటీ సలహా మేరకు అవసరమైన చోట్ల జెన్నిఫర్ ఖర్చు పెడుతూనే వృథాను అరికట్టారు. తను మర్చిపోయిన అకౌంట్‌లను తవ్వి వాటిలోని డబ్బులను వెనక్కు తెచ్చుకున్నారు. అవసరంలేని సబ్‌స్క్రిప్షన్‌లను రద్దు చేసుకున్నారు. ఇలా చాట్‌జీపీటీ చెప్పిందంతా యథాతథంగా పాటించడంతో కేవలం 30 రోజుల్లోనే డబ్బు పొదుపు చేయగలిగారు. తనకున్న రూ.20లక్షల అప్పులో దాదాపు సగం మేరకు తీర్చేశారు.
మిగతా అప్పు తీర్చేందుకు చాట్‌జీపీటీ సాయంతో మరో 30 రోజుల ప్రణాళిక అమలుకు రెడీ అయ్యారు. ‘కొత్తగా ఏమీ చేయలేదు. రోజువారీ చేసే ఖర్చులను పక్కాగా ట్రాక్ చేశా. అనవసరమైన చోట్ల ఖర్చులు తగ్గించుకున్నా. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది’ అని జెన్నిఫర్ చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి:
మీటింగుల్లో మాట్లాడొద్దంటూ ముఖం మీద చెప్పిన అమెరికన్ సహోద్యోగి.. ఎన్నారైకి షాక్
అప్పు కావాలంటూ మేనేజర్ వేధింపులు.. లబోదిబోమంటున్న ఉద్యోగి