ChatGPT: ఐఐటీ జేఈఈ పరీక్ష.. చాట్ జీపీటీ ఎన్ని మార్కులు స్కోరు చేసిందో తెలిస్తే..
ABN , Publish Date - Jun 08 , 2025 | 07:13 PM
చాట్‌జీపీటీకి ఐఐటీ జేఈఈ పరీక్ష పెట్టిన ఓ మహిళ.. ఏఐ చాట్‌బాట్ సాధించిన స్కోరు చూసి అవాక్కయ్యింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐఐటీ జేఈఈ.. దేశంలోనే అత్యంత సంక్లిష్టమైన పరీక్ష. మరి చాట్‌జీపీటీ లాంటి ఏఐ చాట్‌బాట్ ఈ పరీక్ష రాస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఐఐటీ ఖరగ్‌పూర్ ఇంజినీర్ అనుష్క ఆశ్వికి సరిగ్గా ఇలాంటి సందేహం కలిగింది. చివరకు ఆమె చాట్‌జీపీటీకి ఓ3 మోడల్‌కు ఈ పరీక్ష పెట్టింది. ఫలితాలు చూసి ఆమె కూడా షాకైపోయింది.
ఐఐటీ జేఈఈ 2025 పరీక్షలోని ప్రశ్నలను చాట్‌జీపీటీ అద్భుతంగా సాల్వ్ చేసిందని ఆమె తెలిపింది. 360 మార్కులకు గాను ఏకంగా 327 మార్కులు సోర్ చేసిందని తెలిపింది. ఈ మార్కులకు చాట్‌జీపీటీకి ఆల్ ఇండియా 4వ ర్యాంకు ఇవ్వొచ్చని వెల్లడించింది.
ఈ పరీక్ష కోసం అనుష్క చాట్‌జీపీటీకి కచ్చితమైన మార్గదర్శకాలు ఇచ్చింది. జేఈఈ అభ్యర్ధిలాగా ఆలోచించి ప్రశ్నలకు సమాధానాలు రాయాలని తెలిపింది. నెట్టింట సెర్చ్‌లు, పైథాన్ టూల్స్ వంటి వాటిని వాడొద్దని పేర్కొంది. హింట్స్, సరిదిద్దటాలు కూడా ఉండవని పేర్కొంది. ఇందుకు తగ్గట్టుగా చాట్‌జీపీటీ ఆమె ఇచ్చిన ప్రశ్నలను సాల్వ్ చేసింది.
సంక్లిష్టమైన కాలిక్యులస్, బహుళ కాన్సెప్ట్‌లు ఆధారంగా తీర్చిదిద్దిన ప్రశ్నలకు కూడా చాట్‌జీపీటీ సులువుగా సమాధానాలు కనుగొంది. కెమికల్ స్ట్రక్చర్లను కూడా సులువుగా అర్థం చేసుకుని సమాధానాలు ఇచ్చింది. ఏళ్ల తరబడి ఈ పరీక్ష కోసం సన్నద్ధమైన విద్యార్థిలా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇచ్చింది.
అయితే, గ్రాఫ్‌లు, వెర్నియర్ కాలిపర్స్ వంటి వాటిపై ఇచ్చిన ప్రశ్నల విషయంలో కాస్త తడబడింది. గ్రాఫ్‌లను సరిగా అర్థం చేసుకోలేకపోయింది. ఓ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఏకంగా 10 నిమిషాలు తీసుకుంది. అయినా చివరకు తప్పుడు సమాధానమే ఇచ్చింది.
అయితే, చాట్‌జీపీటీ ఇంత మెరుగ్గా ప్రశ్నలకు సమాధానం చెప్పడం తనకు కాస్త ఆందోళన కలిగించిందని అనుష్క తన బ్లాగ్‌లో పేర్కొంది. ఏళ్ల తరబడి కష్టించి మనుషులు నేర్చుకునే నైపుణ్యాలను చాట్‌జీపీటీ క్షణాల్లో సొంతం చేసుకున్నట్టు అనిపించిందని పేర్కొంది. ఇక ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. భవిష్యత్తుకు ఇది సంకేతమని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆసుపత్రిలో ఉన్న ఉద్యోగిపై బాస్ శాడిజం.. చివరకు
మొదటి రోజే రిజైన్ చేసిన ఉద్యోగి.. భారీ షాకిచ్చిన కంపెనీ