Share News

Emotional love story: అబ్బాయికి క్యాన్సర్.. అమ్మాయికి కిడ్నీ వైఫల్యం.. పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Oct 29 , 2025 | 05:36 PM

ప్రేమకథ ఎప్పుడు, ఎలా మొదలవుతుందో అంచనా వేయలేం. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు పెళ్లి తర్వాత ప్రేమించుకుంటారు. చైనాకు చెందిన ఓ జంట ప్రేమకథ మాత్రం భిన్నమైనదని ఒప్పుకుని తీరాల్సిందే.

Emotional love story: అబ్బాయికి క్యాన్సర్.. అమ్మాయికి కిడ్నీ వైఫల్యం.. పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే..
emotional love story

ప్రేమకథ ఎప్పుడు, ఎలా మొదలవుతుందో అంచనా వేయలేం. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు పెళ్లి తర్వాత ప్రేమించుకుంటారు. చైనాకు చెందిన ఓ జంట ప్రేమకథ మాత్రం భిన్నమైనదని ఒప్పుకుని తీరాల్సిందే. యురేమియా అనే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ క్యాన్సర్ రోగిని వివాహం చేసుకుంది. అతడి మరణానంతరం అతడి నుంచి కిడ్నీ తీసుకోవాలనేది ఆమె ఆలోచన. ఇద్దరూ ఆ ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి వారి జీవితాల్లో నిజమైన ప్రేమను నింపింది (Viral Chinese Love Story).


షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన 24 ఏళ్ల వాంగ్ జియావో అనే యువతి కిడ్నీ ఫెయిల్యూర్‌కి కారణమయ్యే యురేమియా అనే వ్యాధికి గురైంది. ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాలని, లేదంటే ఒక సంవత్సరానికి మించి బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. ఎంత ప్రయ్నతించినా ఆమెకు సరిపోయే కిడ్నీ దాత ఎక్కడా దొరకలేదు. దీంతో ఓ స్నేహితుడి సలహాతో క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్‌లో వివాహ ప్రకటనను పోస్ట్ చేసింది. ప్రాణాంతక క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని, అతడి మరణానంతరం అతడి నుంచి కిడ్నీ తీసుకుంటానని ముందుగానే చెప్పింది (touching couple story).


దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తనకు బ్రతకాలనే కోరిక బలంగా ఉందని, వివాహం తర్వాత భర్తకు, అతడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపింది. వాంగ్ ప్రకటనకు బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 27 ఏళ్ల యు జియాన్‌పింగ్ నుంచి స్పందన వచ్చింది. 2013లో వీరు నిరాడంబరంగా ఒప్పందం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు ఆర్థికంగా అండగా నిలబడ్డారు. కాలక్రమంలో వారి కష్టాలు, ఒకరికొకరి తోడు ఇద్దరినీ దగ్గర చేశాయి. ఒకరికొకరు సపర్యలు చేసుకోవడం, కలిసి చికిత్సకు వెళ్లడం వంటివి చేసేవారు (kidney transplant love).


ఇద్దరూ కలిసి రోడ్డు పక్కన పూల బొకేలు అమ్మే దుకాణాన్ని తెరిచారు (viral love story). తమ షాప్‌నకు వచ్చిన కస్టమర్లకు పూల బొకేతో పాటు తమ కథ గురించి రాసిన లెటర్‌ను కూడా ఇచ్చేవారు. వారి కథ ఎంతో మందిని కదిలించింది. ఎంతో మంది వాంగ్‌కు మద్దతుగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. దీంతో వాంగ్ 5,00,000 యువాన్లను సేకరించింది. ఆ డబ్బుతో యుకి ఎముక మజ్జ మార్పిడి చేయించింది. ఆశ్చర్యకరంగా ఆ క్రమంలో వాంగ్ కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడింది. డయాలిసిస్ చేయించుకునే అవసరం కూడా తగ్గిపోయింది. ఈ జంట ప్రస్తుతం షాంగ్జీ ప్రావిన్స్‌లోని జియాన్‌లో పూల దుకాణం నడుపుతూ మెరుగైన ఆరోగ్యంతో ఉంది.


ఇవి కూడా చదవండి..

రెస్టారెంట్‌లో చోరీకి వచ్చిన జంట.. దొంగతనానికి ముందు వారేం చేశారంటే..


మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 40 సెకెన్లలో కనిపెట్టండి


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 29 , 2025 | 05:36 PM