Boat: ఒకటి కాదు రెండు కాదు.. బీచ్ వెంట పదుల సంఖ్యలో..
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:16 PM
దూరం నుంచి చూస్తే బోట్లన్నీ తిరగబడి కనిపిస్తుంటాయి. ఆ ఊరంతా అలా తిరగబడిన బోట్లే కనిపిస్తాయి. ఈక్విహెన్ ప్లేజ్ గ్రామస్తులు వెరైటీగా పడవలను తిరగేసి ఇల్లుగా మార్చుకుంటారు. ఆ గ్రామంలో ఏ ఇంటిని చూసినా తిరగబడిన పడవే పైకప్పుగా కనిపిస్తుంది.
- పడవ ఇల్లెక్కింది!
యూరప్ ఖండం సాంస్కృతిక అద్భుతాలకు నిలయం. పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేసే అనేక నిర్మాణాలు అక్కడ అడుగడుగునా కనిపిస్తాయి. ఆ కోవకు చెందినదే ‘ఈక్విహెన్ ప్లేజ్’ గ్రామం కూడా. ఫ్రాన్స్‌లో సముద్రతీరాన ఉన్న ఈ అందమైన గ్రామంలోకి అడుగుపెడితే తిరగబడిన బోట్లు ఇల్లెక్కినట్టుగా దర్శనమిస్తాయి. ఒకటి కాదు రెండు కాదు... బీచ్ వెంట పదుల సంఖ్యలో అలాంటి బోట్లు కనిపిస్తాయి. ఇంటి లోపల సకల సదుపాయాలతో ఏర్పాట్లుంటాయి. ఇంతకీ విచిత్రంగా పడవలను తిరగేసి ఇల్లు నిర్మించుకోవడానికి
కారణమేమిటంటే...
దూరం నుంచి చూస్తే బోట్లన్నీ తిరగబడి కనిపిస్తుంటాయి. ఆ ఊరంతా అలా తిరగబడిన బోట్లే కనిపిస్తాయి. ఈక్విహెన్ ప్లేజ్ గ్రామస్తులు వెరైటీగా పడవలను తిరగేసి ఇల్లుగా మార్చుకుంటారు. ఆ గ్రామంలో ఏ ఇంటిని చూసినా తిరగబడిన పడవే పైకప్పుగా కనిపిస్తుంది. కాంక్రీటు స్లాబు గానీ, రేకుల నిర్మాణం గానీ కనిపించదు. ఇంటి గోడల నిర్మాణం పూర్తయ్యాక బోటును తిరగేసి గోడలపై పెడతారు. దాంతో ఇంటి నిర్మాణం పూర్తయినట్టే. సాధారణ ఇళ్లలో ఉన్నట్టే ఈ ఇళ్లలో సకల సదుపాయాలుంటాయి. ఈ గ్రామంలో ఆధునిక ఇంటి నిర్మాణాల కన్నా... పడవలతో ఏర్పాటు చేసుకున్న ఇళ్లే అధికంగా కనిపిస్తాయి. ‘సంస్కృతి, సంప్రదాయాలను సంరక్షించేందుకు ఈ నిర్మాణాలను కొనసాగిస్తున్నామ’ని అంటారు స్థానికులు.

వారసత్వాన్ని కొనసాగిస్తూ...
ఈ విధమైన విచిత్ర నిర్మాణాలు చేసుకోవడం వెనక ఒక ఆసక్తికరమైన కథనం ప్రాచుర్యంలో ఉంది. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈక్విహెన్ ప్లేజ్ గ్రామం చేపలు పట్టడానికి అనువైన ప్రదేశంగా ఉండేది. కొన్ని వందల మంది జాలర్లు ఇక్కడ చేపలు పట్టేవారు. పాడైపోయిన పడవలను షెల్టర్స్‌పైన రూఫ్‌గా వేసుకుని నివసించేవారు. అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గ్రామంలో ఒక్క బోట్‌హౌజ్ లేకుండా నేలమట్టం అయింది. చాలా ఏళ్ల తరువాత ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు స్థానికులు కొన్ని పాత బోట్‌హౌజ్‌లను బాగు చేశారు. మరికొందరు కొత్తవి నిర్మించారు. బోటు మొత్తం ఒకే గదిగా ఉంటుంది. వంట చేసుకోవడానికి కొంత స్థలం, బెడ్ కోసం కొంత స్థలం కేటాయిస్తారు. ప్రస్తుతం 3 వేల మంది బోట్‌హౌజ్‌లలో నివసిస్తున్నారు. కొందరు పర్యాటకుల కోసం అద్దెకు కూడా ఇస్తున్నారు. అతిథులు ముచ్చటైన ఇంట్లో బసచేస్తూ మురిసిపోతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా గృహ రుణం రావటం లేదా
Read Latest Telangana News and National News
