వరుణ దేవుడి కరుణ కోసం.. ఇక్కడ రక్తం చిందిస్తారు..
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:49 PM
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ చాలాచోట్ల ఉత్సవాలు చేయడం, వేడుకలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. కొన్నిచోట్ల కప్పలకు పెళ్లిళ్లు చేశారనే వార్తలూ వింటుంటాం. అయితే మెక్సికోలోని రెండు గ్రామాల ప్రజలు మాత్రం వాన కోసం రక్తం చిందిస్తారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ చాలాచోట్ల ఉత్సవాలు చేయడం, వేడుకలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. కొన్నిచోట్ల కప్పలకు పెళ్లిళ్లు చేశారనే వార్తలూ వింటుంటాం. అయితే మెక్సికోలోని రెండు గ్రామాల ప్రజలు మాత్రం వాన కోసం రక్తం చిందిస్తారు. అందులోనూ ఈ వేడుకలో మహిళలు పాల్గొంటే... పురుషులు, చిన్నారులు వారిని ఉత్సాహపరుస్తుంటారు. ఇదో వింత ఆచారం...
ఓ రోజు రాత్రి ఆ ఊరి ప్రజలందరూ సమావేశమై పొరుగు గ్రామంపై పడి... దొరికిన మహిళలను దొరికినట్టుగా కొట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ విషయం ఆ గ్రామ ప్రజలకు తెలిసిపోయింది. వాళ్లు కూడా వెనక్కి తగ్గేదేలే అని సిద్ధమైపోయారు. అంతే... మరుసటి రోజు ఆ ఊరి పొలిమేర రణరంగంగా మారింది.

కొందరి తలలు పగిలాయి. మరికొందరి ముఖాలు పచ్చడయ్యాయి. మధ్యాహ్నం రణరంగంగా కనిపించిన పొలిమేర చీకటిపడే సమయానికి ప్రశాంతంగా మారింది. అప్పటిదాకా వీరలెవల్లో కొట్టుకున్నవారు ఒకరికొకరు హగ్ చేసుకుని వీడ్కోలు చెప్పుకుంటూ ఇంటి దారి పట్టారు. వింతగా ఉన్నా మెక్సికోలోని ‘లా ఎస్పరెంజా’ అనే గ్రామంలో ప్రతీ ఏడాది కనిపించే దృశ్యమిది. వరుణ దేవుడి కరుణ కోసం ఆ గ్రామ ప్రజలు రక్తం చిందిస్తారు. ఆ రక్తాన్ని బకెట్లలో సేకరించి పొలాల్లో చల్లి, దుక్కి దున్నడం, నీరు పెట్టడం వంటి పనులు ప్రారంభిస్తారు.
ఇష్టంగానే...
ఈ వేడుకలో పాల్గొనే మహిళలు ఇష్టంగానే రక్తం చిందిస్తారు. తమ రక్తం చిందించడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండతాయని అక్కడి వాళ్ల నమ్మకం. ఈ గ్రామంలో నహువా తెగకు చెందిన ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. వీరికి సమీప గ్రామమైన ‘రాంచో లాస్ లొ మాస్’తో శత్రుత్వం ఉంది. ఏటా ఆ ఊరి మహిళలతో కలియబడతారు. రక్తం వచ్చేలా కొట్టుకుంటారు. పురుషులు, పిల్లలు, వయసు పైబడిన వాళ్లు అందరూ ఈ వేడుకను ఆసక్తిగా గమనిస్తారు. ఇంకా కొట్టమని ఉత్సాహపరుస్తుంటారు.

వేడుక నిర్వహించే రోజు మహిళలందరూ ఉదయాన్నే లేచి పిండి వంటలు, రకరకాల ఆహార పదార్థాలు వండుతారు. పూలతో అలంకరించిన ప్రత్యేక స్థలంలో ఆహార పదార్థాలను ఉంచి, వరుణ దేవుడికి పూజలు చేస్తారు. అది ముగిశాక అసలైన కార్యక్రమం ప్రారంభమ వుతుంది. కొట్టుకున్నా, గాయాలైనా ఆ రోజంతా సంతోషంగా గడుపుతారు. ఆనందంతో చిందులు వేస్తారు. ఇరుగ్రామాల వారు గెలుపోటముల గురించి అస్సలు ఆలోచించరు. రక్తం చిందడమే వారి లక్ష్యం. సాయంత్రం కాగానే అప్పటిదాకా కొట్టుకున్న వారంతా ఆప్యాయంగా కౌగిలించుకుని వీడ్కోలు చెప్పుకుంటారు. ఇలా రక్తం చిందించే మరోరకం వేడుక పెరూలోనూ కనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అందుకే స్వీటీ (అనుష్క) అంటే గౌరవం..
ఆ రాశి వారికి ఈ వారం అంతా డబ్బే డబ్బు..
Read Latest Telangana News and National News