Club: అక్కడ.. క్లబ్‌లో భజనలు చేస్తారు!
ABN , Publish Date - Dec 14 , 2025 | 09:35 AM
కీర్తనలు, భజనలు దేవాలయాల్లో ఉంటాయి. నైట్ క్లబ్బుల్లో డిమ్‌లైట్లు, డిస్కో ట్రాక్‌లు, గ్లాసుల గలగలలుంటాయి. ‘జెన్ జెడ్’ ఈ రెండింటిని మిక్స్ చేస్తోంది. ఒత్తిడిని, ఆందోళనను అధిగమించేందుకు భజనలను అలవాటు చేసుకుంటున్న కుర్రతరం... వాటిని గుళ్లలో కాకుండా, నైట్ క్లబ్‌లలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆస్వాదిస్తున్నారు. ‘భజన్ క్లబ్బింగ్’ అంటున్న ఈ సరికొత్త ట్రెండ్ నగరాల్లో నడుస్తోంది.
దిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, పుణే వంటి నగరాల్లో తరచూ జరుగుతున్న ‘భజన్ క్లబ్బింగ్’లకు తొలుత 50 నుంచి 100 మంది దాకా హాజరయ్యేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2 వేల నుంచి 3 వేలకు చేరుకుంది. అంటే యువతరం ఈ సరికొత్త భజన్‌ల వైపు ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతోంది.
పాటలు ఆధునిక వాద్య పరికరాలతో సరికొత్తగా వినిపిస్తున్నట్టే... భజనలు, కీర్తనలు కూడా కొత్తరాగాలతో భక్తిభావాన్ని తట్టిలేపుతున్నాయి. అంటే గిటార్, బ్యాండ్... ఇతరత్రా ఆధునిక వాద్య పరికరాలతో ఆధ్యాత్మిక జోష్‌ను నింపుతున్నాయి.
క్లబ్‌లకు సాంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకెళ్లాలి. డ్రింక్స్ ఉండవు. శాకాహారమే అంది స్తారు. క్రమశిక్షణ ముఖ్యం. చూడ టానికే అది క్లబ్ కానీ అంతా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంది.
కుర్రకారు 80 నుంచి 100 మంది ఒకచోట చేరి ‘రామ్ రామ్ జై సీతారామ్...’, ‘శ్రీకృష్ణ గోవింద్ హరే మురారి...’ అంటూ భజన గీతాలకు పరవశించిపోతున్నారు. రిథమిక్‌గా ఒక ఆధ్మాతిక లోకంలో సేదదీరుతున్నారు. భక్తి పాటలకు కదం కదుపుతూ సరికొత్త లోకాల్లో విహరిస్తున్నారు.
ఇది ఒకరకంగా పోస్ట్‌మోడర్న్ తీర్థయాత్ర లాంటిది. గతంలో భక్తి అంటే గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడం, మొక్కుకోవడం వంటివి ఉండేవి. కొత్తతరం దానిని ఆధ్యాత్మిక అనుభవంగా మార్చుకుంటోంది. మనసును, భావోద్వేగాలను రీసెట్ చేసుకునే సాధనంగా చూస్తోంది. ‘భజన్ క్లబ్బింగ్’ ద్వారా అందరితో కలిసి సాధన చేయడం వల్ల సరికొత్త శక్తిని పొందుతున్నారు.

‘భజన్ క్లబ్బింగ్’ అంటే నైట్ క్లబ్‌లో డిస్కో పాటల మిక్సింగ్ కాకుండా... ప్రత్యేకంగా ఆధ్యాత్మిక భజన్‌లను ఈ తరానికి తగ్గట్టుగా అందిస్తారు. ఆ భజన్‌లో యువతరం సేదతీరుతోంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడేందుకు ఈ ఆధునిక భజనలు తోడ్పడుతున్నాయి.
ఇది కేవలం ఆధ్యాత్మికంగా, మానసికంగా రిలాక్స్ కావడానికి మాత్రమే ఉద్దేశించబడినది. కుల, మతాలతో సంబంధం ఉండదు. క్లబ్‌కు అందరూ వెళ్లినట్టే... వీటికీ వెళ్తున్నారు. కొందరు తమ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఈ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. యోగ, ధ్యానంలాగే... మానసిక ఆనందం కోసం యువతరం ‘భజన్ క్లబ్బింగ్’ల వైపు అడుగులు వేస్తోంది.
వీటికి ఆదరణ పెరుగు తుండటంతో ప్రత్యేకంగా భజనలను అందించే కళాకారుల సంఖ్య కూడా పెరుగుతోంది. మన నగరాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. దాంతో ఈ సరికొత్త ఆధ్యాత్మిక భజన్ కళాకారులు దుబాయ్, సింగపూర్ లాంటి నగరాలకు కూడా వెళ్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా గృహ రుణం రావటం లేదా
Read Latest Telangana News and National News