Bengaluru Sunroof Accident: సొంత కారు ఉందా.. ఇలా చేస్తే మీ పిల్లల ప్రాణాలకు రిస్క్
ABN , Publish Date - Sep 07 , 2025 | 07:28 PM
వేగంగా వెళుతున్న కారు రూఫ్‌టాప్‌లోంచి తల బయటపెట్టిన ఓ బాలుడికి ఓవర్‌హెడ్ బ్యారియర్ తగిలిన ఘటన తాలూకు వీడియో వైరల్ అవుతోంది. బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి తరంలో కొందరు తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై కనీస అవగాహన ఉండటంలేదు. పిల్లలను మురిపెంగా పెంచుకుంటున్నామన్న భ్రమలో పడి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ వీడియో నెట్టింట కలకలం రేపుతోంది. బెంగళూరులో ఈ ఘటన జరిగింది (bengaluru boy sunroof accident).
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, కదులుతున్న కారు సన్‌రూఫ్‌లోనుంచి ఓ బాలుడు తల బయటపెట్టి ఎంజాయ్ చేయసాగాడు. ఇంతలో ఎదురుగా ఓవర్‌హెడ్ బారియర్ అడ్డుగా వచ్చింది. లారీల వంటి వాహనాలను అడ్డుకునేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు (Parenting Mistakes). అయితే, కారు ఎప్పటిలాగే ముందుకు సాగడంతో బాలుడి తలకు బారియర్ తగిలింది. ఆ వెంటనే కారులోపలి వ్యక్తి వాహనాన్ని ఆపేశారు. బాలుడేమో లోపలకు దిగిపోయాడు. ఈ ఘటనలో చిన్నారికి ఏదైనా ప్రమాదం జరిగిందా లేదా అన్నది మాత్రం తెలియరాలేదు.
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు బాలుడి తల్లిదండ్రులను తలంటేస్తున్నారు. చిన్నారికి ఏమైనా అయ్యి ఉంటే దాని పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే అని తిట్టిపోస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్నారులతో ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయించే వారు ఎక్కువయ్యారని కొందరు విమర్శించారు. గారాబం పేరిట ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
పిల్లలకు విచక్షణ నేర్పించాల్సిన తల్లిదండ్రులకే అవగాహన లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని విమర్శించారు. భారత్‌లో విక్రయించే కార్లకు ఇలాంటి రూఫ్‌టాప్‌లు అవసరం లేదని కూడా కొందరు సూచించారు. విదేశాల్లో ఇలాంటి పనులు చేస్తే తల్లిదండ్రులకు చట్టప్రకారం శిక్షలు కూడా ఉంటాయని మరికొందరు పేర్కొన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. మరి ఈ షాకింగ్ ఉదంతంపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి:
బిలియనీర్‌ల సక్సెస్‌కు కారణం ఇదీ.. సీక్రెట్ చెప్పిన న్యూరాలజిస్టు
డొనాల్డ్ ట్రంప్‌పై సల్మాన్ ఖాన్ సెటైర్లు.. అసలేం జరుగుతోందో తెలియట్లేదని కామెంట్