చెట్టే చెరసాలగా...
ABN , Publish Date - May 18 , 2025 | 01:16 PM
చెట్టు నీడనిస్తుంది. కానీ ఆ చెట్టు కొన్నేళ్ల క్రితం ఖైదీలకు తాత్కాలిక చెరసాలలా ఉంది. అందుకే ఆ చెట్టును ‘ప్రిజన్ ట్రీ’ అని పిలుస్తారు. అదెలా అంటారా? అయితే ఆస్ట్రేలియాలో ఉన్న బాబ్ ట్రీ గురించి తెలుసుకోవాల్సిందే...
ఆస్ట్రేలియాలో శాస్త్రీయంగా అడాన్సోనియా గ్రెగోరి అని పిలిచే ఈ చెట్టును స్థానికంగా ‘బాబ్ ట్రీ’ అని పిలుస్తారు. పెద్ద కాండంతో చూడటానికి బాటిల్‌లా కనిపించడం వల్ల ‘బాటిల్ ట్రీ’ అని కూడా అంటారు. ఎక్కువ కాలం జీవించే చెట్లు ఇవి.
పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింగ్ రివర్ రోడ్డులో ఒక బాబ్ ట్రీ ఉంది. ఆ చెట్టు కాండం చుట్టుకొలత సుమారు 50 అడుగులు. చెట్టు కాండం లోపల బోలుగా, విశాలంగా ఉంటుంది. దాంతో కాండం ఒకవైపు కొద్దిగా కట్ చేసి లోపలకి వెళ్లేలా చేశారు. దాని లోపల ఎంత విశాలంగా ఉంటుందంటే... 30 మంది హాయిగా కూర్చోవచ్చు. అంటే ఒక పెద్ద గదిలా ఉంటుందన్నమాట.
‘ప్రిజన్ ట్రీ’గా ఎలా మారింది?
ఈ చెట్టు ప్రిజన్ ట్రీగా మారడం వెనక ఒక ఆసక్తికరమైన కథనం ప్రాచుర్యంలో ఉంది. 1910 ప్రాంతంలో పోలీసులు కొంతమంది ఆదివాసీ ఖైదీలను డెర్బీ పట్టణానికి తీసుకెళుతున్నారు. రాత్రి కావడంతో వింధమ్ ప్రాంతంలో ఆగారు. విశ్రాంతి తీసుకుందామంటే రాత్రిపూట కావడంతో చీకట్లో ఖైదీలు పారిపోయే అవకాశం ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో విశాలమైన కాండంతో ఉన్న బాబ్ చెట్టును చూశారు. కాండం లోపల బోలుగా ఉండటాన్ని గమనించారు. దాంతో కాండాన్ని కొద్దిగా తొలిచి, లోపలకు వెళ్లేలా దారి ఏర్పాటు చేసి, లోపల ఖైదీలను ఉంచారు. పోలీసులు వంతుల వారీగా చెట్టు దగ్గర గస్తీ కాస్తే మిగతా పోలీసులు విశ్రాంతి తీసుకున్నారు.

అందుకే ఆ చెట్టును ‘హిల్‌గ్రోవ్ లాకప్’ అనేవారు.
ఇలాంటి చెట్టే డెర్బీ పట్టణానికి దక్షిణంగా మరొకటి ఉంది. ఆ చెట్టు లోపల అరవైనాలుగు చదరపు అడుగుల స్థలం ఉంది. లోపలకు వెలుతురు వచ్చేలా కాండానికి రంధ్రాలున్నాయి. అయితే ‘కాండం లోపల ఖైదీలను దాయడం అనేది నిజం కాద’ని చరిత్రకారులు అంటారు. జైలు మాదిరిగా ఉపయోగించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. అయితే అప్పట్లో కొన్ని పత్రికల్లో ఖైదీలను చెట్టు కాండంలో ఉంచినట్టుగా వార్తలు ప్రచురితమయ్యాయి. పర్యాటకులను ఆకర్షించడానికే ఖైదీల కథ సృష్టించారని అనేవాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం పర్యాటకుల తాకిడి పెరగడంతో చెట్టును సంరక్షించేందుకు అధికారులు దాని చుట్టూ ఫెన్సింగ్ వేశారు. పర్యాటకులు ‘ప్రిజన్ ట్రీ’ని కాస్త దూరం నుంచే చూడాల్సి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి.
Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి
Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య
తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం
MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు
Read Latest Telangana News and National News