7 Foot Python Found: బీజేపీ నేత కారులో భారీ కొండ చిలువ..
ABN , Publish Date - Sep 23 , 2025 | 08:07 AM
డ్రైవర్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత వారు అక్కడికి చేరుకున్నారు. కొండ చిలువను పట్టుకున్నారు. అది 7 అడుగుల పొడవు ఉన్నట్లు తెలిపారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద పెరిగిపోతుంది. చలి వాతావరణంలో ఉండలేక వెచ్చదనం కోసం ఇళ్లలోకి చొరబడుతూ ఉంటాయి. ఎక్కడ వెచ్చగా ఉంటే అక్కడ దాక్కుంటూ ఉంటాయి. షూలు, హెల్మెట్లు, టాయిలెట్ కమోడ్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ దాక్కుని మనుషుల మీద దాడి చేస్తూ ఉంటాయి. తాజాగా, పెద్ద కొండ చిలువ ఒకటి బీజేపీ నాయకుడికి షాక్ ఇచ్చింది. కారు బోనెట్‌లో చేరి అందర్నీ బెంబేలెత్తించింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... బరబంకీలోని సత్నమ్ పుర్వా గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేత నాగేంద్ర ప్రతాప్ తన కారులో సోమవారం ఉదయం ఓ కార్యక్రమానికి బయలు దేరాడు. డ్రైవర్ కారు నడుపుతూ ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత కారు బోనెట్‌లో కదలిక మొదలైంది. దీంతో డ్రైవర్ కారు ఆపాడు. బోనెట్ ఓపెన్ చూసి షాక్ అయ్యాడు. అందులో ఓ పెద్ద కొండ చిలువ పడుకుని ఉంది. కొండ చిలువను చూడగానే నాగేంద్ర ప్రతాప్, డ్రైవర్ కారుకు దూరంగా పరుగులు పెట్టారు. ఈ విషయం తెలిసి పెద్ద ఎత్తున జనం కారు దగ్గరకు చేరారు.
కొంతమంది వీడియోలు తీయటం మొదలెట్టారు. డ్రైవర్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత వారు అక్కడికి చేరుకున్నారు. కొండ చిలువను పట్టుకున్నారు. అది 7 అడుగుల పొడవు ఉన్నట్లు తెలిపారు. కొండచిలువను అడవిలో వదిలేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వర్షాకాలంలో ఇవన్నీ మామూలే.. మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి’..‘ఏంటి ఆ పాము అంత పెద్దగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
విగ్రహాల కోసం ప్రజల డబ్బు వాడొద్దు.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..