Share News

PM Modi Projects Benefit: ఇక ఇంటింటా పొదుపు పండుగ

ABN , Publish Date - Sep 23 , 2025 | 07:03 AM

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రతి ఇంటా పొదుపు పెరిగి, వ్యాపారాలకు ఊతం లభించనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతి రాష్ట్రం ప్రగతిలో పరుగులు పెడుతుందని తెలిపారు...

PM Modi Projects Benefit: ఇక ఇంటింటా పొదుపు పండుగ

ఈసారి దసరాకు జీఎస్టీ సంస్కరణల జోష్‌.. దేశ ప్రజలకు 2.5 లక్షల కోట్ల ప్రయోజనం

  • జీఎస్టీ 2.0 దేశమంతా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ‘జీఎస్టీ బచత్‌ ఉత్సవ్‌’ పేరిట ప్రధాని బహిరంగ లేఖ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 : జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రతి ఇంటా పొదుపు పెరిగి, వ్యాపారాలకు ఊతం లభించనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతి రాష్ట్రం ప్రగతిలో పరుగులు పెడుతుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి దేశమంతా అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘జీఎస్టీ బచత్‌ ఉత్సవ్‌’ పేరిట దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. నవరాత్రుల తొలిరోజు బచత్‌ ఉత్సవ్‌లో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లోని ఇందిరాగాంధీ పార్కు ప్రాంతంలో తాను వ్యాపారులతో జరిపిన సంభాషణ ఫొటోలను ‘ఎక్స్‌’లో ఆయన పంచుకున్నరు. ‘‘నవరాత్రులు మొదలయ్యాయి. ప్రతి కుటుంబానికీ ఈ సందర్భంగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. దసరా ఈసారి మీ ఇంటికి రెట్టింపు ఆనందాలను తీసుకురానుంది. జీఎస్టీ 2.0 అమలులోకి రావడమే ఇందుకు కారణం. ప్రతి కుటుంబంలో పొదుపు పండుగ మొదలైంది. రైతులు, మహిళలు, యువత, పేదల నుంచి మధ్యతరగతి, వ్యాపారులు, చిన్న వర్తకుల (ఎమ్‌ఎ్‌సఎమ్‌ఈ)ల వరకు.. సమాజంలోని ప్రతి వర్గమూ ఈ సంస్కరణలతో ప్రత్యక్షంగాను, పరోక్షంగా లబ్ధి పొందనుంది. ప్రతి ఒక్కరికీ వికాసం.. మదుపులో గొప్ప వృద్ధి....ప్రతి రాష్ట్రమూ, ప్రాంత అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను రెండు శ్లాబులకు కుదించడం వల్ల సామాన్యులు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయి’’ అని మోదీ తెలిపారు. ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, సబ్బులు, టూత్‌పే్‌స్టలు, బీమా ఇంకా మరికొన్ని వస్తువులు, సేవలపై జీరో జీఎస్టీ లేదా ఐదుశాతం నామమాత్రం పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. వంటింటి ఖర్చులు తగ్గడం మహిళలకు ఊరటని ఇస్తోందన్నారు. గత ఐదేళ్లలో 25 కోట్లమంది దారిద్య్రరేఖ నుంచి బయటకు వచ్చారని ప్రధాని తెలిపారు.


ఆదాయ పన్నుల్లో మినహాయింపుల వల్ల 12 లక్షల వార్షికాదాయంపై పన్ను చెల్లించాల్సిన పనిలేదని, దీనివల్ల మధ్యతరగతి బలోపేతమైందని తెలిపారు. ‘‘ఆదాయ పన్నుల్లో మినహాయింపులు, జీఎస్టీ సంస్కరణల లబ్ధిని కూడా కలుపుకొంటే దేశప్రజలకు 2.5 లక్షల కోట్ల లబ్ధి చేకూరనుంది. ఇంటి ఖర్చుల తగ్గి, పొదుపు పెరగడం వల్ల సొంతిల్లు ఏర్పాటుచేసుకోవచ్చు. కొత్త వాహనాలు, వివిధ రకాల ఉపకరణాలు కొనుగోలు చేయవచ్చు. సరదాగా కుటుంబంతో బయటకు వెళ్లి ఇష్టమైన ఆహారం తీసుకోవచ్చు. విహారయాత్రలకు ప్రణాళికలు రచించవచ్చు’’ అని ప్రధాని తెలిపారు. జీఎస్టీ ప్రయాణం 2017లో మొదలయిందన్న ఆయన, సాలెగూడులా తయారైన బహు పన్నుల చెల్లింపు చిక్కుల నుంచి వ్యాపారాలకు, పౌరులకు దీనివల్ల ఊరట అందించిందన్నారు. ‘‘ఒక దేశం - ఒకే పన్ను’.. అనేది పన్నుల విధానాన్ని సరళతరం చేయడంతోపాటు ప్రజలకు గొప్ప ఊరట అందించింది. ఈ విధానం దేశాన్ని ఆర్థికంగా సమైక్యపరిచింది. కేంద్ర, రాష్ట్రాల సహకారంతో జీఎస్టీ మండలి ప్రజానుకూల విధానాలనెన్నింటినో రూపొందించింది. పొదుపును ప్రజల చేతుల్లో ఉంచింది’’ అని శ్లాఘించారు. ఇదంతా ‘వికసిత్‌ భారత్‌-2047’ లక్ష్యసాధనలో భాగంగా ఆత్మనిర్భర్‌ భారత్‌కు బాటలు వేస్తూ స్థానిక ఉత్పత్తి రంగానికి జీఎస్టీ ఊతం ఇవ్వనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడిన్‌ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రజలను ఆయన కోరారు. ‘‘మేడిన్‌ ఇండియా ఉత్పత్తులనే విక్రయించాలని దుకాణదారులను, వ్యాపారులను కోరుతున్నాను. కొనేదీ, అమ్మేదీ స్వదేశీయే కావాలి. స్థానిక ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహిస్తూ, పెట్టుబడుల వాతావరణం ఏర్పడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’’ అని ప్రధాని మోదీ కోరారు.


ఇండీ కూటమి అసంతృప్తి: అశ్వినీ వైష్ణవ్‌

ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు, పన్నుల తగ్గింపు పట్ల ఇండీ కూటమి సంతోషంగా లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. యూపీఏ పదేళ్ల పాలనలో పన్నులు తగ్గించలేదని, సంస్కరణలు చేపట్టలేదని విమర్శించారు. యూపీఏ హయాంలో సిమెంట్‌పై 30ు పన్ను వసూలు చేస్తే, ఇప్పుడు 18ు ఉందని చెప్పారు. శానిటరీ ప్యాడ్లపై యూపీఏ ప్రభుత్వం 13 శాతం ట్యాక్స్‌ వేయగా, తమ ప్రభుత్వం పన్ను వసూలు చేయట్లేదని తెలిపారు. కాఫీపై పన్ను 30 నుంచి 5 శాతానికి తగ్గిందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 07:03 AM