Share News

Girl Blocks Road: స్కూల్ వ్యాన్ రాలేదని.. రోడ్డుపైనే 3 గంటల పాటు చిన్నారి...

ABN , Publish Date - Dec 21 , 2025 | 08:37 AM

ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రుల ద్వారా పరిష్కరించుకునే పిల్లలను చూసుంటాం. కానీ ఈ చిన్నారి అందుకు భిన్నం. పదేళ్ల వయసులోనే ఏకంగా స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిందో బాలిక. ఇంతకీ ఏం జరిగింది.. అంత పసి వయసులో ఆమెకు ఆ అవసరం ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే...

Girl Blocks Road: స్కూల్ వ్యాన్ రాలేదని.. రోడ్డుపైనే 3 గంటల పాటు చిన్నారి...
Girl Protests on Road

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌‌(Madhya Pradesh)లో ఓ పదేళ్ల బాలిక తన సమస్యా పరిష్కారం కోసం రోడ్డెక్కింది. స్కూల్ వ్యాన్ తననలా వదిలేసిందని నిరసన చేపట్టింది. ఏకంగా మూడు గంటల పాటు రహదారిపై బైఠాయించింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. అసలేం జరిగిందంటే...


బేతుల్(Bethul) జిల్లాకు చెందిన సురభి యాదవ్(Surabhi Yadav) అనే పదేళ్ల బాలిక 5వ తరగతి చదువుతోంది. విద్యా హక్కు చట్టం(RTE Act) కింద పాఠశాలలో చేరి.. రోజూ 18 కి.మీ. పాటు ప్రయాణించి విద్యనభ్యసిస్తోంది. అయితే.. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వారి కుటుంబం.. ఆ విద్యార్థినికి స్కూల్ వ్యాన్(School Van) ఫీజు చెల్లించలేకపోయింది. దీంతో పాఠశాల యాజమాన్యం ఆమెకు వ్యాన్‌లో అనుమతి నిరాకరించింది. దీంతో ఆ చిన్నారి రోడ్డెక్కింది. తనకు స్కూల్ బస్ ప్రయాణాన్ని నిరాకరించిన స్కూల్ యాజమాన్యంపై నిరసన చేపట్టింది. రోడ్డుపై వాహనాలు క్యూ కట్టినా ఆమె తొణకకుండా ధైర్యంగా కూర్చుంది. ఎవరొచ్చి బుజ్జగించినా వినిపించుకోలేదు.


ఆ బాలిక కుటుంబం రెండేళ్లుగా ట్రాన్స్‌పోర్ట్ ఫీజు చెల్లించలేదని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. పదే పదే చెప్పినా వారు పట్టించుకోలేదని వాదించింది. అందుకే స్కూల్ బస్‌కు అనుమతి నిరాకరించినట్టు తెలిపింది. ఈ విషయమై సురభి తల్లి ఆశా యాదవ్(Asha Yadav) స్పందిస్తూ.. 'నా కూతురికి ఆర్టీఈ యాక్ట్ కింద అడ్మిషన్ ఇచ్చారు. కానీ రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కానివ్వడం లేదు. గత నవంబర్‌లోనూ కొన్ని రోజులే పర్మిషన్ ఇచ్చి ఆపేశారు. ఇవ్వాళ ఇలా రోడ్డుపై వదిలేశారు. ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఏడుస్తోంది' అని తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు.


ఈ పరిస్థతిలో ప్రయాణికుల రాకపోకలు ఆగిపోయి ట్రాఫిక్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చిచోలి పోలీసులు సహా విద్యాశాఖ అధికారులు దిగొచ్చారు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడతామని ఆమెకు హామీ ఇచ్చారు. సుమారు 3 గంటల నిరసన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిందా చిన్నారి. అయితే.. తల్లిదండ్రులే ఆ అమ్మాయిని స్కూలుకు పంపడం మానేశారని, బస్ డ్రైవర్‌తోనూ ఇటీవల దురుసుగా ప్రవర్తించారని స్కూల్ యాజమాన్యం ఆరోపించింది.


ఇవీ చదవండి:

వెరీ'గుడ్డు'.. అపోహలకు నో ఛాన్స్: ఎఫ్ఎస్ఎస్ఏఐ

కొత్త బిల్లులో గాంధీ పేరు తొలగింపుపై దుమారం

Updated Date - Dec 21 , 2025 | 08:40 AM