Mangli: శ్రీకాకుళం జిల్లాలో అలరించిన మంగ్లీ పాటలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 08:54 AM
శ్రీకాకుళం జిల్లాలో సాంస్కృతిక సంబరం ముగిసింది. ఈ కార్యక్రమంలో గాయని మంగ్లీ పాటలు పాడుతూ ఉర్రూతలూగించారు. అలాగే నృత్య ప్రదర్శనలు కూడా అలరించాయి. ప్రజలు భారీగా పాల్గొని సందడి చేశారు.

రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్బంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి.

ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమం ఆద్యంతం ఆహుతులకు కనువిందు చేసింది.

సినీ గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరగా క్రాకర్స్‌షోతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. వివిధ భక్తి పాటలకు మంగ్లీ పాడగా ఆహుతులను ఆకట్టుకున్నాయి.

ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా, తర్వాత వరుసగా, సీతంపేట ఐటీడీఏ జానపద బుర్రకథలు , మావూడూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి .

మంగ్లీ గానలహరి మనోరంజకంగా సాగింది. ‘మా ఊరు శ్రీకాకుళం...మేమంతా శ్రామికులం’ అంటూ ఆమె పలు గీతాలను పాడి అందర్నీ అలరించారు.
Updated at - Feb 04 , 2025 | 08:54 AM