Singer KS Chitra: చిత్ర గానాలహరి.. ఓలలాడిన అభిమానులు
ABN , Publish Date - Oct 21 , 2025 | 09:15 AM
ప్రముఖ గాయని చిత్రకు రాజేశ్వరి ఉదయగిరి ఇప్రెస్ ఆఫ్ మెలోడి (Empress of Melody) బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిత్రకు గోపాల్ పోణంగి ప్రత్యేక ప్రశంసా పత్రంతోపాటు గౌరవ పత్రాన్ని అందజేశారు.
వాషింగ్టన్: డాలస్‌లోని ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ వేదికగా నిర్వహించిన సంగీత విభావరిలో ప్రముఖ గాయని కె.ఎస్. చిత్ర గానామృతంలో వేలాది మంది అభిమానులు తడిసి ముద్దయ్యారు. రేడియో సురభి, ఏజీ ఫిన్ టాక్స్ సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ టైమ్ లెస్ తెలుగు సంగీత విభావరిలో చిత్రతోపాటు ప్రముఖ గాయకులు శ్రీకృష్ణ, సింధుజ, అనామిక, సుధాంశ్ తదితరులు ఆలపించిన గీతాలు ఆహుతుల మనస్సును కట్టి పడేశాయి. కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతికిరణం సినిమాలోని ‘శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతీ.. పాటతో ఈ సంగీత విభావరి ప్రారంభమైంది. శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం సినిమాలోని ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా.. పాటతో ఈ కార్యక్రమం పూర్తయింది.

ఈ కార్యక్రమంలో సంగీత విభావరి అనంతరం.. అమెరికాలో తొలి 24x7 తెలుగు రేడియో జట్టు తరపున గాయని చిత్రకు రాజేశ్వరి ఉదయగిరి ఇప్రెస్ ఆఫ్ మెలోడి (Empress of Melody) బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిత్రకు గోపాల్ పోణంగి ప్రత్యేక ప్రశంసా పత్రంతోపాటు గౌరవ పత్రాన్ని అందజేశారు. ఈ సంగీత విభావరి కార్యక్రమానికి ప్రిస్కో మేయర్, మెకినీ నగర మేయర్‌లతోపాటు టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షహీన్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ తరహా సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమం ఈ నగరంలో నిర్వహించడం తమకెంతో గర్వకారణమని ప్రిస్కో మేయర్ తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమ నిర్వాహాకులు, రేడియో సురభి అధినేత శ్రీమతి రాజేశ్వరి ఉదయగిరి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

రేడియో సురభి బృంద సభ్యులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఏజీ ఫిన్ టాక్స్ అధినేత అనిల్ గ్రంధితోపాటు పలువురు స్పాన్సర్లను సమకూర్చడంతోపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంగీత సంగీత విభావరికి ఒక రోజు ముందు జరిగిన ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్‌లో చిత్రమ్మతోపాటు వారి బృందాన్ని వందలాది మంది అభిమానులు కలసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హాంబర్గ్‌లో ఘనంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం
ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికలలో అనూహ్య తీర్పు..