Deportation of Indians: 15 ఏళ్లల్లో అమెరికా ఎంత మంది భారతీయుల్ని బహిష్కరించిందో చెప్పిన మంత్రి జైశంకర్
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:16 PM
2009 నుంచి ఇప్పటివరకూ అమెరికాలోకి ప్రవేశించిన 15,756 మందిపై బహిష్కరణ వేటు పడిందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన భారతీయుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి మరీ భారత్‌కు తరలిస్తుండటంపై స్వదేశంలో ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాగా, గురువారం ఈ విషయమై పార్లమెంటు వేదికగా స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా ఉదంతంలో అమెరికా అధికారులు తీసుకుంటున్న చర్యలు కొత్తవేమీ కావని చెప్పిన ఆయన గత 15 ఏళ్లల్లో ఎందరు భారతీయుల్ని అమెరికా బహిష్కరించిందీ లెక్కలతో సహా వివరించారు. 2009 నుంచి ఇప్పటివరకూ అమెరికాలోకి ప్రవేశించిన 15,756 మందిపై బహిష్కరణ వేటు పడిందని అన్నారు (NRI).
DOGE: డోజ్ శాఖ ఉద్యోగి రాజీనామా! భారతీయులపై జాత్యాహంకారం ప్రదర్శించి..
‘‘అమెరికాలో బహిష్కరణ ప్రక్రియ కొత్తదేమీ కాదు. కొన్నేళ్లుగా ఉనికిలో ఉంది. ఇది ఏ ఒక్క దేశం కోసం ఉద్దేశించినది కూడా కాదు. అక్రమ వలసలను అరికట్టడంపై మనం దృష్టి సారించాలి. ఈ విషయమై అమెరికా అధికారులతో మేము మాట్లాడుతున్నాము. వారితో అమర్యాదగా వ్యవహరించకుండా చర్యలు తీసుకుంటున్నాము’’ అని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఇక బహిష్కరణలకు సంబంధించి మంత్రి పంచుకున్న డాటా ప్రకారం, 2019లో అమెరికా.. అక్రమంగా వలసొచ్చిన భారతీయులను (2042) అత్యధిక స్థాయిలో బహిష్కరించింది. ఇక 2020లో 1889 మందిని స్వదేశానికి పంపించింది.
Indians in Foreign Countries: విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల కోసం కొత్త చట్టం తేనున్న కేంద్రం!
2009లో 734 మందిని, 2010లో 799 మందిని, 2011లో 597, 2012లో 530, 2013లో 515, 2014లో 591, 2015లో 708, 2016లో 1,303, 2017లో 1,024, 2018లో 1,180. 2019లో 2,042, 2020లో 1,889, 2021లో 805, 2022లో 862, 2023లో 617, 2024లో 1,368, 2025 ఫిబ్రవరి 5 వరకూ 104 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది.
ఇక భారత్‌కు తిరిగొచ్చిన అనేక మంది తమ కష్టాలను ఏకరవు పెట్టారు. ప్రమాదకరమైన ప్రయాణం చేసి, కోట్లు ఖర్చు పెట్టి అమెరికాకు చేరుకుంటే చివరకు తమ కలలు ఇలా కల్లలైపోయాయని వాపోయారు.