Ambajipeta Temple: ఆలయదర్శనం జై బేతాళ
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:38 AM
మన దేశంలో బేతాళ ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. అయితే భేతాళుణ్ణి పూజించే సంప్రదాయం మయన్మార్‌లోని యాంగూన్ (రంగూన్) తదితర ప్రాంతాల్లో విస్తృతంగా...
మన దేశంలో బేతాళ ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. అయితే భేతాళుణ్ణి పూజించే సంప్రదాయం మయన్మార్‌లోని యాంగూన్ (రంగూన్) తదితర ప్రాంతాల్లో విస్తృతంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అంబాజీపేటలోనూ ఇటువంటి విలక్షణమైన ఆలయం ఉంది. అక్కడ దాదాపు యాభై ఎనిమిదేళ్ళ క్రితం కొలువుతీరిన బేతాళుడు... అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి దోహదం చేసే వేలుపుగా ప్రసిద్ధి చెందాడు.
వివిధ అభీష్టాలు తీరడం కోసం వేర్వేరు దేవతలను పూజించే సంప్రదాయం అన్ని ప్రాంతాలలోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ అంబాజీపేట, పేరూరులకు చెందిన ప్రజలు బేతాళుణ్ణి పూజిస్తారు. దీని వెనుక ఉన్న కథేమిటంటే... కొన్ని దశాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి చెందిన కొందరు ఉపాధి కోసం బర్మా (ప్రస్తుతం మయన్మార్)కు వెళ్ళారు. అక్కడ అనేక ప్రాంతాల్లో బేతాళుడి ఆరాధనను, ఉత్సవాలను వారు గమనించారు. అక్కడివారు బేతాళుణ్ణి తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పూజిస్తారని తెలుసుకొని, వారూ దాన్ని అనుసరించారు. తిరిగి స్వదేశం వచ్చిన తరువాత... ఇక్కడ కూడా బేతాళుడి ఆరాధన కొనసాగించారు. ఈ విధంగా 1967 నుంచి బేతాళ ఉత్సవాలను అంబాజీపేట, పేరూరుకు చెందిన ఒక వర్గం వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రుల సందర్భంగా... కలశ స్థాపనతో ప్రారంభించి, పది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనికోసం అంబాజీపేట శ్రీనివాసనగర్‌లో... 1982లో శ్రీ విజయ బేతాళ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. అక్కడవిజయ దశమి అనంతరం భారీ స్థాయిలో బేతాళ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో పదమూడు వాహనాలు ప్రదర్శిస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తారు.
సి.ఎన్.మూర్తి
ఇవి కూడా చదవండి..
చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి
ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి