Self Defense For Women: మహిళలకు స్వీయరక్షణే ఆయుధం
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:36 AM
‘బాలికపై అత్యాచారం’.. ‘మహిళకు లైంగిక వేధింపులు’ వంటి వార్తలను మనం ప్రతి రోజూ వార్తల్లో చూస్తూ ఉంటాం. మహిళలు తమను తాము రక్షించుకోగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయి...
‘బాలికపై అత్యాచారం’.. ‘మహిళకు లైంగిక వేధింపులు’ వంటి వార్తలను మనం ప్రతి రోజూ వార్తల్లో చూస్తూ ఉంటాం. మహిళలు తమను తాము రక్షించుకోగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ స్వీయ రక్షణకు సంబంధించిన మెళుకువలను మహిళలకు చీరాలకు చెందిన బూదాటి బాలశంకర్ బోధిస్తున్నారు. ఇప్పటి దాకా ఆయన దగ్గర వందల మంది మహిళలు శిక్షణ పొందారు.
తోటవారి పాలెంకు చెందిన బూదాటి బాలశంకర్ ఒక సామాన్యమైన చేనేత కార్మికుడు. కానీ చిన్నప్పటి నుంచి ఆయనకు యుద్ధ విద్యలంటే ఆసక్తి. చిన్నప్పుడే కర్రసాము, కత్తిసాము వంటివి నేర్చుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటంతో ఆయన చేనేత వృత్తిలోనే కొనసాగాల్సి వచ్చింది. ప్రతి రోజూ మన చుట్టూ ఉన్న సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఆయనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. వారికి ఆత్మసైర్థ్యం కల్పిస్తే- తమను అత్యవసర పరిస్థితుల్లో తమను తాము కాపాడుకోగలరని భావించాడు. ఒక వైపు తన వృత్తి ద్వారా జీవితాన్ని గడుపుతూనే మరో వైపు అనేక మంది మహిళలకు ఈ యుద్ధ విద్యలలో శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టారు. ఆయన దగ్గరకు ప్రతి రోజు అన్ని వర్గాలకు చెందిన అనేక మంది మహిళలు యుద్ధ విద్య నేర్చుకుంటూ ఉంటారు.
వయస్సుతో సంబంధం లేదు..
ఆత్మ రక్షణ విద్యలు నేర్చుకోవటానికి వయస్సుతో పని లేదని.. ఎవరైనా నేర్చుకోవచ్చంటారు శంకర్. ఆత్మరక్షణ కోసం అనేక విద్యలు అందుబాటులో ఉన్నా- కర్రసాము, కత్తిసాము, గరిడిలను నేర్చుకుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందంటారాయన. అందుకే తన దగ్గరకు వచ్చే వారికి కర్రసాము, కత్తిసాము నేర్పిస్తారు. ఈ రెండింటిలోను మౌలికమైన పద్ధతులు తెలుసుకోవటానికి సుమారు మూడు నెలలు పడుతుంది. పై మూడు విద్యల్లో సంపూర్ణ నైపుణ్యం సంపాదించటానికి కనీసం ఐదేళ్లు పడుతుంది. ‘‘సుమారు 30 ఏళ్లుగా శిక్షణ అందిస్తున్నాను. నేను విద్యను నేర్పటం వల్ల రెండు రకాల ప్రయోజనాలున్నాయి. మొదటిది మహిళలు తమను తాము రక్షించుకోగలుగుతారు. రెండోది ఈ విద్యలు అంతరించిపోకుండా ఒక తరం నుంచి మరొక తరానికి అందుతాయి’’ అంటారు శంకర్. స్వీయ రక్షణ విద్యలు నేర్చుకోవటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రకరకాల వృత్తులకు చెందిన మహిళలు వస్తూ ఉంటారు. ‘‘రోజు భయపడుతూ బతకలేం. అయినా మనపై ఎవరైనా దాడి చేసినప్పుడు ఎదురుతిరగకపోవటం చేతకానితనమవుతుంది. అవతల వ్యక్తికి బుద్ధి చెప్పాలంటే- మనకు ఈ తరహా విద్యలు రావాలి. అప్పుడే మనను మనం రక్షించుకోగలం’’ అంటారు లెక్చరర్‌గా పనిచేస్తున్న ఉదయభాను. ఈ స్వీయరక్షణ శిక్షణ కాలే జీలో చదువుతున్న వారికి చాలా ముఖ్యం. అమ్మాయిలు కాలేజీలకు వెళ్లే సమయంలో అనేక రకాల వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో వారిలో అభద్రత భావం ఏర్పడితే కాలేజీకి వెళ్లటానికి కూడా భయపడుతారు. వారి భవిష్యత్తుకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి ఈ స్వీయరక్షణ విద్యలు ఎంతో ఉపకరిస్తాయి.
‘‘ఒకప్పుడు కాలేజీకి వెళ్లాలంటే ఎవరైనా ఏదైనా అంటారేమోనని భయమేసేది. కుటుంబసభ్యులు ఎంత ధైర్యం చెప్పినా మనసు మూలల్లో ఎక్కడో చిన్న భయం ఉండేది. స్వీయరక్షణ పద్ధతులు తెలుసుకున్న తర్వాత ఽధైర్యం పెరిగింది. ఏడాది నుంచి నేను ఈ విద్యలలో శిక్షణ పొందుతున్నాను. ఇప్పుడు ఎవరైనా నాపై దాడి చేసిన తిప్పికొట్టగలను’’ అంటారు డిగ్రీ చదువుతున్న చంద్రకళ. కొందరు మహిళలైతే వారు శిక్షణ పొందటంతో పాటుగా తమ పిల్లలను కూడా వెంట తీసుకువస్తున్నారు. ‘‘ ప్రస్తుతం నేను కర్రసాము నేర్చుకుంటున్నాను. చాలా మంది మహిళలు కర్రసాము నేర్చుకోవటమేమిటనే ఆలోచనలో ఉంటారు. కానీ కర్రసాము నేర్చుకోవటానికి ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చాలా ధైర్యంగా అనిపిస్తుంది’’ అంటారు శివకుమారి అనే ప్రైవేట్ ఉద్యోగిని. ప్రతి గ్రామంలో మహిళలకు ఈ తరహా శిక్షణ ఇచ్చేవారు ఉండాలని ఆశిద్దాం.
తాళ్లూరి ప్రదీప్, చీరాల
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News