Share News

Ram Gopal Varma Serious: రాము 2.0

ABN , Publish Date - Sep 28 , 2025 | 04:49 AM

‘‘సత్య’ సినిమా రీరిలీజ్‌ తర్వాత నాలో పరివర్తన వచ్చింది. నన్ను నేను సీరియ్‌సగా తీసుకుంటున్నా’’... రామ్‌గోపాల వర్మ నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తే చాలామందికి...

Ram Gopal Varma Serious: రాము 2.0

సండే సెలబ్రిటీ

‘‘సత్య’ సినిమా రీరిలీజ్‌ తర్వాత నాలో పరివర్తన వచ్చింది. నన్ను నేను సీరియ్‌సగా తీసుకుంటున్నా’’... రామ్‌గోపాల వర్మ నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తే చాలామందికి షాక్‌ అనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా అనేక రకాల వివాదాల్లో చిక్కుకున్న వర్మ తాజాగా బాలీవుడ్‌లో భారీ సినిమాల ద్వారా పునఃప్రవేశం చేయటానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ‘నవ్య’ పలకరించింది.

రాము 2.0 ఎలా ఉండబోతున్నాడు?

కొన్ని నెలల క్రితం ‘సత్య’ రీరిలీజ్‌ అయింది. అది చూసిన తర్వాత నాలో ఒక పరివర్తన వచ్చింది. దాని ఫలితం ఎలా ఉంటుందనేది అందరికీ భవిష్యత్తులో తెలుస్తుంది. నా జీవితంలో మొదటిసారి నన్ను నేను సీరియ్‌సగా తీసుకోవాలనుకున్నా! వాస్తవానికి ఇలా చెబుతుంటే... వినటానికి నాకే ఇబ్బందిగా అనిపిస్తోంది. బహుశా అందరికీ ఇలా అనిపిస్తుందేమో కూడా! సినీ రంగంలో ఇప్పటిదాకా ఎవరూ చేయని... ఊహించని సినిమాలను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నా. అవి ఎలా ఉంటాయో త్వరలో మీకే తెలుస్తుంది. చాలా పెద్ద ప్రాజెక్టులు వస్తాయి.


ఈ మధ్య మీలో వచ్చిన మార్పేమిటి?

నాకు ఇప్పటిదాకా ఒక లక్ష్యం లేదు. ఏ మూడ్‌ వస్తే.. ఎప్పుడెలా అనిపిస్తే అలా చేసేవాడిని. ఒక ప్లాన్‌ ఉండేది కాదు. ఒక గోల్‌ను పెట్టుకొని గాలికి తిరిగినట్లు తిరిగాను. కొన్ని మంచి ఉండచ్చు. కొంత చెడు జరిగి ఉండవచ్చు. నేను ప్రముఖ రచయిత్రి ఐయాన్‌ రాండ్‌ ఫ్యాన్‌ని. గత 30 ఏళ్లుగా ఆమె ప్రవచించిన తత్వాన్ని చెబుతూనే ఉన్నాను. కానీ నేను ఎప్పుడూ ఫాలో కాలేదు. మనం చేసే ప్రతి పనికి ఒక లక్ష్యం ఉండాలి. ప్రతి ఆలోచన, పని ఆ లక్ష్యం వైపే ఉండాలి. దానివైపే ప్రయాణం ఉండాలి. ఇప్పుడు నేను మంచి సినిమాలు తీయాలని అనుకుంటున్నాను. అన్నీ సూపర్‌హిట్‌ అవుతాయని అనుకోవటం లేదు. నా జీవితంలో అనేక సంవత్సరాలు వృథా చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఆ దిశలోనే ప్రయాణించటం మొదలుపెట్టా. నా జీవితంలో మిగిలిన కొన్నేళ్లు ఈ ప్రయాణం కొనసాగిస్తా. ఈ మధ్యనే సినీ పరిశ్రమకు చెందిన ఒకరు వచ్చి... ‘‘చేతకాని వారు చెత్త సినిమాలు తీస్తారు. తీయడం వచ్చి కూడా అలాంటి సినిమాలు ఎందుకు తీస్తారు’’ అని అడిగారు.

‘శివ’ను రీరిలీజ్‌ చేస్తున్నారు కదా..

చాలామంది నమ్మకపోవచ్చు... కానీ 35 ఏళ్ల క్రితం ‘శివ’ రిలీజ్‌ తర్వాత మళ్లీ దానిని ఎప్పుడూ చూడలేదు. అక్కడక్కడ సీన్స్‌ చూశానేమో! ఈ మధ్య ఆ సినిమా పూర్తిగా చూసినప్పుడు కొత్తగా అనిపించింది. సాధారణంగా సినిమా తీస్తున్నప్పుడు మనం ఆ జర్నీలో నిమగ్నం అయిపోతాం. సినిమా పూర్తయిన తర్వాత దానిపై ఇతరులు ఎలాంటి కామెంట్స్‌ చేస్తున్నారనే విషయంపైనే శ్రద్ధ పెడతాం. అంతే తప్ప నిస్పాక్షికంగా చూడం. ఆ సినిమాను చూసినప్పుడు ఒక ఫిల్మ్‌మేకర్‌గా ఇప్పుడు చాలా పరిణితి వచ్చిందనిపించింది.


మీ ఉద్దేశంలో ‘శివ’ పాత్ర గొప్పతనమేమిటి?

శివ పాత్రలోని ఆర్థ్రత.. అది నేను డిజైన్‌ చేసి తీసింది కాదు. 1970, 80లలో వచ్చిన అమితాబ్‌ సినిమాలలో ఉండే మధ్యతరగతి కోపాన్ని.. ‘గాడ్‌ఫాదర్‌’ వంటి సినిమాలో ఉండే కొన్ని లక్షణాలను తీసుకొని ఆ పాత్రను రూపొందించా. నా ఉద్దేశంలో అలాంటి హీరో పాత్ర గత 35 ఏళ్లలో ఏ సినిమాలోనూ రాలేదు.

88-navya.jpg

‘రంగీల’కు 30 ఏళ్లు .. ఎలా అనిపిస్తోంది?

రహమాన్‌, ఊర్మిళ... నేను ఆ సినిమా తీయటానికి ప్రధానమైన కారణాలు. సాధారణంగా నాకు లవ్‌ స్టోరీలంటే ఎక్కువ ఇష్టం ఉండదు. కానీ ఆ సమయంలో సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ వంటి సినిమాల ప్రభావం నాపై బాగా ఉండేది. ఈ సినిమా తీయటానికి ఇది కూడా ఒక కారణం.

దర్శకులలో మీకు స్ఫూర్తి ఎవరు?

కె.బాలచందర్‌ గారు అంటే నాకు చాలా ఇష్టం. చిన్న డైలాగ్స్‌, ఎడిటింగ్‌ కట్స్‌ నాపై చాలా ప్రభావం చూపాయని ఈ మధ్యనే అర్థమయింది. ఆయన తీసిన ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా చూస్తుంటే ఆయన నాపై చూపిన ప్రభావం ఏంటో తెలిసింది. ఇక దాసరి గారి సినిమాల్లో పాత్రల రూపకల్పన చాలా బాగుంటుంది. ‘చిల్లరకొట్టు చిట్టమ్మ, శివరంజని’ వంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయి. ఇక హీరోల విషయానికి వస్తే నాపై తీవ్రమైన ప్రభావం చూపించిన నటుల్లో అమితాబ్‌ ఒకరు. ఆయన నటించిన ‘జంజీర్‌, దివార్‌’ వంటివి ఒక తరం ప్రేక్షకులపై ప్రభావం చూపించాయి.


మీ సినిమాల్లో పాత్రలు ఎలా పుడతాయి?

ఆ పాత్రలన్నీ మన మధ్యలోనే ఉంటాయి. విజయవాడలో ఉన్నప్పుడు స్టూడెంట్‌ పాలిటిక్స్‌ చూశా. ఆ తర్వాత మా సినిమా ఆఫీసుల్లో పాటిలిక్స్‌ చూశా. ఒక అసిస్టెంట్‌ డైరక్టర్‌ నా వెనకే నా గురించి మాట్లాడేవాడు. మళ్లీ దానిని వచ్చి కొందరు చెప్పేవారు. వాటి నుంచి కొన్ని పాత్రలు పుట్టాయి. ఇక ‘కంపెనీ’ లాంటి సినిమాలు అండర్‌ వరల్డ్‌లో ఏం జరుగుతోందో తెలుసుకొని తీసినవి. నా ఉద్దేశంలో అండర్‌ వరల్డ్‌లోనైనా.. ఆఫీసుల్లోనైనా పాలిటిక్స్‌ ఒకటే! ఆఫీసుల్లో ఉద్యోగం తీసేస్తారు. అక్కడ కాల్చేస్తారు.

సినీ పరిశ్రమలో హిపోక్రసీ ఎక్కువ కదా!

హిపోక్రసీ భయంవల్ల వస్తుంది. లోపల నమ్మింది బయట అనలేకపోవటానికి కారణం అదే. అయితే దీనిని నెగిటివ్‌గా తీసుకోకూడదనేది నా ఉద్దేశం. ఒక వ్యక్తి అలా మాట్లాడటం వెనక అనేక కారణాలుంటాయి. నాకు ఫ్యామిలీ లేకపోవటం వల్ల నేను హిపోక్రటిక్‌గా మాట్లాడకపోవచ్చు. ఇక ఇండస్ట్రీ అంటారా... ఇంకొకళ్ల సినిమా ప్లాప్‌ అయితే ఆనందపతారు. ఇంకోళ్ల ప్లాప్‌ మన హిట్‌లా ఉంటుంది. చాలా మంది ఎక్కువ ఎంజాయ్‌ చేసేది అదే! అయితే ఇది ఇండస్ట్రీలోనే కాదు... చాలా చోట్ల ఉంటుంది.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

గతంలో కన్నా ఇప్పుడు వ్యక్తులను భరించగలుగుతున్నా. ఇద్దరు భిన్నమైన వ్యక్తులు ఒక విషయంపై ఒకే విధమైన అవగాహన, అభిప్రాయాలు కలిగి ఉంటారనుకోవటం తప్పు. ప్రతి వ్యక్తీ ప్రత్యకమే! ఇతరుల అభిప్రాయాలను గౌరవించటమనేది మానవత్వంలో ఒక పార్శమని నేను నమ్ముతాను.

‘‘నన్ను ఎవరైనా పొగిడితే ఇష్టపడను. ఎందుకంటే నేనేమిటో నాకు తెలుసు. ఎవరైనా ఎక్కువ పొడిగితే- అతనిని వెధవ అనుకుంటాను. అవసరమైన దానికన్నా ఎక్కువ తిట్టినా వెధనుకుంటాను’’

తప్పొప్పులు ఉండవు...

నా ఉద్దేశంలో తప్పొప్పులు అనేవి ఉండవు. ఒక తప్పువల్ల ఇంకో ఒప్పు జరగవచ్చు. ఒక సంఘటన చెబుతాను. నేను సంజయ్‌దత్‌తో ‘నాయక్‌’ మొదలుపెట్టా. ఆయన జైలుకు వెళ్లటంతో ఆ సినిమా ఆగిపోయింది. దీంతో నేను తెలుగులో... ‘అనగనగా ఒక రోజు’ తీశా. అది సూపర్‌హిట్‌ అయింది. సంజయ్‌దత్‌ బయటకు వచ్చాక... ‘‘నాయక్‌’ వద్దు.. అనగనగా ఒక రోజులాంటి సినిమా తీద్దాం’’ అన్నాడు. దాంతో ‘దౌడ్‌’ తీశా. కానీ అది ఫ్లాప్‌ అయింది. ఇలా ఒక సంఘటన మరొక దానికి కారణమవుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి

ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 04:51 AM