Share News

Ayurvedic Hair Remedies: వర్షాకాలంలో జుట్టుకు రక్షణ

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:54 AM

వర్షాకాలంలో రకరకాల శిరోజాల సమస్యలు తలెత్తుతుంటాయి. చుండ్రు, దురద, మాడుమీద కురుపులు, శిరోజాలు రాలడం లాంటివి చికాకు కల్గిస్తుంటాయి. వాతావరణంలో ఉండే తేమ వల్ల తలలో చెమట, జిడ్డు చేరి...

Ayurvedic Hair Remedies: వర్షాకాలంలో జుట్టుకు రక్షణ

వర్షాకాలంలో రకరకాల శిరోజాల సమస్యలు తలెత్తుతుంటాయి. చుండ్రు, దురద, మాడుమీద కురుపులు, శిరోజాలు రాలడం లాంటివి చికాకు కల్గిస్తుంటాయి. వాతావరణంలో ఉండే తేమ వల్ల తలలో చెమట, జిడ్డు చేరి ఈ సమస్యలను జటిలం చేస్తాయి. ఇలా వర్షాకాలంలో ఎదురయ్యే శిరోజాల సమస్యలకు ఆయుర్వేదం చక్కని పరిష్కారాలను చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం...

ఆయుర్వేద పరిష్కారాలు

  • బృంగరాజ్‌: జుట్టు బాగా రాలుతుంటే బృంగరాజ్‌ నూనెను తలంతా పట్టించి ముని వేళ్లతో మెల్లగా మర్ధన చేయాలి. రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. బృంగరాజ్‌ పొడిలో కొబ్బరి నూనె కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలంతా పట్టించి అరగంట తరవాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాలు పాటిస్తూ ఉంటే శరీరంలో వాత దోషం తగ్గి శిరోజాలకు పోషణ లభిస్తుంది. జుట్టు తెల్లబడడం ఆగుతుంది. మాడుకు రక్తప్రసరణ పెరిగి శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి.

  • ఉసిరి: శిరోజాలు నెరుస్తుంటే ఉసిరి నూనెను కొద్దిగా వేడిచేసి తలంతా పట్టించాలి. వేళ్లతో గుండ్రంగా రుద్దుతూ పావుగంటసేపు తల మీద మర్ధన చేయాలి. రాత్రంతా అలాగే ఉంచుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఉసిరి పొడిలో తగినంత పెరుగు కలిపి పేస్టులా చేసి తలకు పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఈ చిట్కాలు పాటించడం వల్ల శరీరంలో పిత్త దోషం తగ్గుతుంది. ఉసిరిలోని సి విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్లను గట్టిపరుస్తాయి. తలలో రక్తప్రసరణ సజావుగా జరిగి శిరోజాలు ఒత్తుగా పెరిగి మెరుపును సంతరించుకుంటాయి.

  • బ్రాహ్మి: దీనితో తయారుచేసిన నూనెను కొద్దిగా వేడిచేసి రాత్రిపూట తలకు పట్టిస్తే మాడు చల్లబడుతుంది. ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉదయాన్నే తలస్నానం చేయగానే శిరోజాలు నల్లగా మెరుస్తుంటాయి.

  • వారానికి రెండుసార్లు హెర్బల్‌ నూనెలతో తలకు మర్ధన చేయడం వల్ల జుట్టురాలే సమస్యను నివారించవచ్చు. వాతావరణం తేమగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా నూనె రాయడం మంచిది కాదు.

  • తలస్నానానికి కీటోకోనజోల్‌ లాంటి మెడికేటెడ్‌ షాంపూలు ఉపయోగించడం మంచిది. ఇవి మాడుమీద ఏర్పడే ఫంగస్‌, చుండ్రు, కురుపులను నివారిస్తాయి.

  • పెప్టెడ్‌లు, విటమిన్లు, బొటానికల్స్‌తో కూడిన సీరమ్‌లను వాడడం కూడా మంచిదే. ఇవి జుట్టు కుదుళ్లను బలపరచి మాడును ఆరోగ్యంగా మారుస్తాయి.

  • ఆయుర్వేద ఉత్పత్తులు సురక్షితమే అయినప్పటికీ వాటిని ఉపయోగించే ముందు ప్యాచ్‌టెస్ట్‌ చేసుకోవడం మంచిది.


ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

  • తలంతా జిడ్డుగా ఉందంటూ వేడివేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు. అలా చేస్తే మాడుమీద సహజ నూనెల ఉత్పత్తి తగ్గి శిరోజాలు పొడిబారుతాయి. కాబట్టి గోరువెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయాలి.

  • తలస్నానం చేసిన ప్రతిసారీ కండిషనర్‌ను వాడితే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండిషనర్‌ వల్ల వెంట్రుకల్లో తేమ నిలుస్తుంది. కుదుళ్లు బలపడతాయి.

  • శిరోజాలను గట్టిగా బిగించి జడ వేసుకోవడం లేదా ముడి పెట్టుకోవడం వల్ల కుదుళ్లు బలహీనమవుతాయి. దీంతో శిరోజాలు అధికంగా రాలిపోతుంటాయి. కాబట్టి జడను తేలికగా అల్లుకోవడం మంచిది.

  • శిరోజాలకు అధికంగా నూనె పట్టించి సరిగా తలస్నానం చేయకపోతే కుదుళ్లకు ఆక్సిజన్‌ అందదు. దీంతో కుదుళ్లు వదులుగా మారి వెంట్రుకలు రాలిపోతాయి. అలాకాకుండా జిడ్డు, మురికి పూర్తిగా వదిలేలా తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. సల్ఫేట్‌ అధికంగా ఉన్న షాంపూలను వాడకూడదు.

  • తడిజుట్టును తువాలుతో ఎలాపడితే అలా రుద్దుతూ తుడవకూడదు. మెత్తటి తువాలుతో మెల్లగా అద్దుతూ తుడుచుకోవాలి. తడి జుట్టును దువ్వకూడదు. శిరోజాలు పూర్తిగా ఆరిన తరవాతనే వెడల్పాటి పళ్ల దువ్వెనతో మెల్లగా దువ్వుకోవాలి. శిరోజాలను గాలికి ఆరనివ్వాలి. హెయిర్‌ డ్రైయర్‌ను వాడకూడదు.

  • శిరోజాలను అధిక వేడితో స్ట్రైటెనింగ్‌, ఐరనింగ్‌, కర్లింగ్‌ చేయించుకోవడం తగ్గించాలి.

ఇవి కూడా చదవండి..

Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్

Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా

For More National News and Telugu News

Updated Date - Sep 14 , 2025 | 05:54 AM