Share News

Onion Farming: ఆనియన్‌ క్వీన్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 02:15 AM

ఉల్లి పంట... దాని ధర అమాంతంగా పెరిగి జనం కంట నీరు తెప్పిస్తుంది. హఠాత్తుగా పతనమైపోయి రైతులకు ఆవేదన మిగుల్చుతుంది. దీనికి కారణాలను శాస్త్రీయంగా...

Onion Farming: ఆనియన్‌ క్వీన్‌

ఉల్లి పంట... దాని ధర అమాంతంగా పెరిగి జనం కంట నీరు తెప్పిస్తుంది. హఠాత్తుగా పతనమైపోయి రైతులకు ఆవేదన మిగుల్చుతుంది. దీనికి కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన 23 ఏళ్ళ కల్యాణి రాజేంద్ర షిండే సరికొత్త పరిష్కారంతో ముందుకొచ్చారు. ఆమె తీసుకున్న చొరవ రైతుల నష్టాలను భారీగా తగ్గించి... నికరమైన ఆదాయానికి భరోసా ఇస్తోంది.

‘‘మా నాన్నంటే నాకు ప్రాణం. ఎప్పుడూ సరదాగా, నవ్విస్తూ ఉండే ఆయన దిగాలుగా ఉంటే ఎంతో బాధగా ఉండేది. అలాంటి సందర్భాలు రాకూడదని దేవుణ్ణి కోరుకొనేదాన్ని. కానీ ‘‘ఈ ఏడాది కూడా నష్టమేనమ్మా!’’ అని ఆయన కన్నీళ్ళు ఆపుకొంటూ చెబుతుంటే మా ఇంటిల్లిపాదికీ ఏడుపొచ్చేది. ఇది మా ఒక్కరి కథ కాదు... లక్షలమంది ఉల్లి రైతుల వ్యధ. మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌... ఆసియాలోనే అతి పెద్దదైన ఉల్లిపాయల హోల్‌సేల్‌ మార్కెట్‌. నేను ఆ ఊర్లోనే పుట్టాను. మా ప్రాంతంలో దాదాపు రైతులందరూ ఉల్లి సాగుచేస్తారు. వారిలో మా నాన్న కూడా ఒకరు. ఉల్లి పంట వేసినప్పటి నుంచి కోతకు వచ్చేసరికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుంది. ఆ తరువాత వాటిని ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు నిల్వ ఉంచుతారు. సరుకు దెబ్బతింటే... ధరల్లో ఎనిమిది వందల శాతం హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం నేను గమనించాను. మార్కెట్‌లో హఠాత్తుగా చోటుచేసుకొనే ఒడుదొడుకుల కారణంగాను, సరుకు దెబ్బతినడం వల్లా రైతులు తీవ్రమైన నష్టాలకు గురవడం సాధారణమైపోయింది. ఇవన్నీ చూస్తూ పెరిగాను. ‘రైతుల కష్టాలు తీరే మార్గం లేదా?’ అని ఎప్పుడూ ఆలోచించేదాన్ని.

  • ఆ నష్టం దేశానిది కూడా...

నాసిక్‌లో 2018లో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నప్పుడు... టీసీఎస్‌ ఫౌండేషన్‌ నిర్వహణలోని ఓపెన్‌ సోషల్‌ ఇనీషియేటివ్‌ సెంటర్‌... ‘డిజిటల్‌ ఇంపాక్ట్‌ స్క్వేర్‌’కు ఎంపికయ్యాను. సామాజికమైన వివిధ సవాళ్ళను పరిష్కరించడానికి డిజిటల్‌ సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన సంస్థ ఇది. దాని ద్వారా రైతుల సమస్యలను క్షేత్ర స్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసే అవకాశం దొరికింది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఉల్లి పంటలో 40 నుంచి 50 శాతం వరకూ వినియోగదారులకు చేరేలోగానే పాడవుతోంది. అది ప్రతీ ఏడాది అయిదు కోట్ల మంది వినియోగించే పంటతో సమానం. దేశ ప్రజల అవసరాలకు మించిన ఉత్పత్తిని మన రైతులు చేస్తున్నారు. కానీ పంట కోత తరువాత తలెత్తే పరిస్థితులు వారు నష్టపోవడానికి దారి తీస్తున్నాయి. సంప్రదాయమైన గిడ్డంగుల్లో నిల్వ చేయడం, ఆధునికమైన పర్యవేక్షణ పద్ధతులు అనుసరించకపోవడం లాంటి కారణాల వల్ల... పంట లోలోపలే కుళ్ళిపోతోంది. మరింత వివరంగా చెప్పాలంటే... పంట కుళ్ళిపోయిందా? లేదా? అని నిర్ధారించడానికి రైతులు తమ వాసన శక్తి మీద తరచుగా ఆధారపడుతున్నారు. కానీ కుళ్ళిన వాసన వచ్చేసమయానికి సగం పంట పనికిరాకుండా పోతోంది. ఈ నష్టం విలువ ప్రతి సంవత్సరం సుమారు రూ.40 వేల కోట్లు. ఈ నష్టం కేవలం రైతు కుటుంబాలదే కాదు, దేశానిది కూడా. ఆధునిక సాంకేతికతలను వినియోగించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నాను. దానికోసం తీవ్రంగా పరిశోధన చేశాను.


33-navya.jpg

  • ముందే హెచ్చరిస్తుంది...

అయిదేళ్ళ క్రితం నాసిక్‌ నుంచి లాసల్‌గావ్‌కు తిరిగి వచ్చి ‘గోదామ్‌ ఇన్నోవేషన్స్‌’ అనే అనే అగ్రిటెక్‌ స్టార్ట్‌పను ఏర్పాటు చేశాను. కేవలం రూ. మూడు లక్షల నిధులతో ఇది మొదలైంది. ఉల్లిపాయలు దెబ్బతినడాన్ని ముందుగానే గుర్తించేందుకు... ఒక ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సాంకేతికతతో... ఒక చిన్న పరికరానికి రూపకల్పన చేశాను. దానికి ‘గోదామ్‌ సెన్స్‌’ అనే పేరు పెట్టాను. ఈ తరహా పరికరం తయారీ దేశంలోనే తొలిసారి. ఉల్లిపాయలు నిల్వచేసే గోదాముల్లో దీన్ని అమర్చితే... నిశ్శబ్ద సంరక్షకుడిలా గమనిస్తూ ఉంటుంది. ఉష్ణోగ్రతలను, తేమను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఉల్లిపాయలు పాడవడం ప్రారంభమైన తొలి దశలో... వాటి నుంచి కొన్ని వాయువులు వెలువడతాయి. మొత్తం సరుకులో ఒక శాతం పాడవడం మొదలైనా సరే... ఆ పరికరం హెచ్చరికలు పంపుతుంది. సరుకు బాగా దెబ్బతిన్న తరువాత మేలుకొనేకన్నా... ముందుగా గుర్తించడం వల్ల రైతులకు మేలు కలుగుతుంది. ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ఈ పరికరాన్ని అమర్చి చూశాం. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో... ఆ వివరాలను ప్రభుత్వ సంస్థల దృష్టికి తీసుకువెళ్ళాం. వాటి నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇప్పుడు ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆనియన్‌ అండ్‌ గార్లిక్‌ రీసెర్చ్‌’ (డిఓజిఆర్‌), భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్‌), జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) తదితర సంస్థలు మాకు భాగస్వాములుగా ఉన్నాయి. భారీ, మధ్యతరహా, చిన్న తరహా రైతుల అవసరాల మేరకు... నెలవారీ ఛార్జీలతో గోదాముల్లో ‘గోదామ్‌ సెన్స్‌’ పరికరాలను అమరుస్తున్నాం. వాటి ద్వారా కనీసం 30 నుంచి 40 శాతం నష్టాన్ని రైతులు నివారించుకోగలుగుతున్నారు. దానికోసం పాత గోదాములనే కొత్తగా తీర్చి దిద్దుతున్నాం. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో... ఉల్లి నిల్వచేసే చాలా గోదాముల్లో ఈ పరికరాన్ని వినియోగిస్తున్నారు. తద్వారా వారికి నష్టం తగ్గి... నికరమైన ఆదాయం లభిస్తోంది.’’


సాంకేతికతపై అవగాహనతో....

రైతు సంఘాలు, మీడియా నన్ను ‘ఆనియన్‌ క్వీన్‌’ అని పిలుస్తున్నాయి. దానికన్నా... మా నాన్నలాంటి ఎందరో రైతులను నష్టాల ఊబి నుంచి కాపాడగలగడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. రైతులకు కొత్త సాంకేతికతలను పరిచయం చేసి, వాటిపై అవగాహన కలిగిస్తే... ఎన్నో అద్భుతాలు జరుగుతాయని నా నమ్మకం. అది నిజమని నా ప్రయత్నం రుజువు చేస్తోంది.

ఇవీ చదవండి:

జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్

22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Jul 21 , 2025 | 02:16 AM