Jagapathi Babu Interview: నటులను నడిచే డబ్బుగా చూస్తారు
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:58 AM
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు జగపతిబాబు. ‘అల్లరి ప్రేమికుడు, శుభలగ్నం, గాయం’ వంటి అనేక సూపర్‌హిట్ చిత్రాలలో హీరోగా నటించిన ఆయన... ప్రస్తుతం తన టాక్ షో ద్వారా...
సండే సెలబ్రిటీ
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు జగపతిబాబు. ‘అల్లరి ప్రేమికుడు, శుభలగ్నం, గాయం’ వంటి అనేక సూపర్‌హిట్ చిత్రాలలో హీరోగా నటించిన ఆయన... ప్రస్తుతం తన టాక్ షో ద్వారా అందరినీ ఆకట్టుకుంటున్నారు. హీరో... క్యారెక్టర్ ఆర్టిస్టు... విలన్... విభిన్నపాత్రలెన్నో పోషించిన జగపతిబాబును ‘నవ్య’ పలకరించింది.
మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ అని చాలాసార్లు చెప్పారు. మరి సినిమా ఇండస్ట్రీలో ఎలా కొనసాగుతున్నారు?
నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలా మంది... ‘‘నువ్వు సెన్సిటివ్. ఇంట్రావర్ట్. సినిమాల్లో ఎలా నటిస్తావు’’ అని అడిగారు. మొదట్లో నాకు నటనపై ఆసక్తి ఉండేది కాదు. నేను బాగుంటానని కూడా నాకు తెలియదు. సుబ్బిరామిరెడ్డిగారు, రవికిషోర్ నన్ను హీరోగా చేయమని అడిగారు. రవికిషోర్ అయితే... ‘మహర్షి’ సినిమాలో ఆఫర్ కూడా ఇచ్చాడు. ‘‘రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయిని కాబట్టి ఆఫర్స్ వస్తున్నాయి’’ అనుకొనేవాడిని. ఒక్కసారి నటుడిని అయిన తర్వాత అంతా మారిపోయింది. నిజ జీవితంలో నేను ఇంట్రావర్ట్. సెన్సిటివ్. కానీ కెమెరా ముందు వేరేగా మారిపోతాను. కెమెరా నా ఫ్రెండ్. దానితో నేను కనెక్ట్ అవుతా! రెచ్చిపోతా. ఇక్కడ మీకో రహస్యం చెబుతా. సినీ కెమెరా ముందు ఎమోషనల్‌గా ఎంతైనా నటిస్తా. కానీ స్టిల్ కెమెరాకు పోజులు ఇవ్వలేను.
మీ నాన్న రాజేంద్రప్రసాద్ గారు పెద్ద నిర్మాత. ఆ వారసత్వం బాధ్యతగా అనిపించదా?
అనిపించదు. జీవితం పట్ల నాకున్న దృక్పథం వేరు. ఈ మధ్యకాలంలో చాలామంది నిపోకిడ్స్ (వారసులు) గురించి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశంలో వారసత్వం ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే! ఆ తర్వాత మనని మనమే నిరూపించుకోవాలి. నా రెండో సినిమాకే... మా బ్యానర్ కానీ, నాన్నగారు కానీ నాకు సాయం చేయలేరని అర్థమయిపోయింది. ఆ తర్వాత నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఇది నా ఒక్కడికే కాదు... చాలామందికి జరుగుతోంది. ఇక్కడ మనుగడ సాగించాలంటే పరిశ్రమ తీరు తెలుసుకొని మసలాలి.
సినీ పరిశ్రమను మీరు ఎలా చూస్తారు?
మా అందరికీ అన్నం పెడుతోంది. అయితే ఇక్కడ నటులను ‘నడిచే డబ్బు’గా చూస్తారు. డబ్బులు కనిపిస్తేనే మాట్లాడతారు. లేకపోతే లేదు. ఎందుకంటే ఇది ఒక బిజినెస్. ఒక వ్యక్తి మంచివాడా? చెడ్డవాడా అనే విషయం కన్నా... మార్కెట్ ఉందా? లేదా? డబ్బు వస్తుందా? లేదా? మనకు ఉపయోగం ఉందా? లేదా? అనే విషయాలనే ఆలోచిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే... ‘నాకేంటి?’ అనే సూత్రం ద్వారానే అన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే దీనిని నేను తప్పుపట్టను. ఎందుకంటే ఈ పరిశ్రమ టర్నోవర్ వేల కోట్లకు చేరిపోయింది. అందువల్ల మంచి, చెడు కన్నా లాభం... నష్టాలకే ఎక్కువ విలువ ఉంటుంది.
స్ర్కిప్ట్‌లు మీరే ఎంపిక చేసుకుంటారా?
నేనే విని, ఎంపిక చేసుకుంటా. నేను ఎంపికచేసుకొనే పాత్రలు విభన్నంగా ఉంటాయి. స్ర్కిప్ట్ బలం, డైరక్టర్ బలం, బ్యానర్ బలం... కొన్నిసార్లు రెమ్యూనిరేషన్ బలం... ఇలా రకరకాల కోణాల నుంచి వీటిని ఎంపిక చేసుకుంటా! స్ర్కిప్ట్ నచ్చితే డబ్బులు లేకుండా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. డబ్బుల కోసం స్ర్కిప్ట్ నచ్చకపోయినా చేసిన సినిమాలున్నాయి.
మీరు, మీ కుటుంబం చాలా ప్రైవేట్ మనుషులు. మీరు చాలా స్ట్రిక్ట్ ఫాదరా?
లేదండి. మా పిల్లలకు నేను చాలా స్వేచ్ఛ ఇచ్చాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను స్వేచ్ఛా జీవిని. స్కూలు అంటే ఇష్టం ఉండేది కాదు. మా పిల్లలకు కూడా... ‘‘మీకు రెక్కలు ఇచ్చాను. స్వేచ్ఛగా ఎగరండి’’ అని చెప్పేవాడిని. అడిగితే తప్ప వాళ్లకు ఎప్పుడూ సలహాలు కూడా ఇచ్చేవాడినికాదు. నా అభిప్రాయాలు కూడా చెప్పేవాడిని కాదు. వాళ్లు చాలా బాగా పెరిగారు. అప్పుడప్పుడు మా పెద్దమ్మాయి... ‘‘నువ్వు మమ్మల్ని స్ట్రిక్ట్‌గా పెంచలేదు’’ అంటూ ఉంటుంది. ‘‘నేను వదిలేశాను. మీరు బాగా పెరిగారు. బాగుపడ్డారు’’ అని చెబుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా పిల్లలను నేను ఫ్రెండ్స్‌గానే చూశాను.
మీరు హీరోగా ప్రవేశించిన నాటికి... ఇప్పటికీ పరిశ్రమలో ఏవైనా మార్పులు వచ్చాయా?
ఎన్టీఆర్.. ఏన్నాఆర్‌ల సమయం నుంచి మా దాకా అందరం ఫాలో అయిన రూల్ ఒకటుంది. హీరోతో పాటుగా సినిమాలోని అన్ని పాత్రలూ బాగా ఉండాలనుకొనేవాళ్లం. అందరికీ ప్రాధాన్యం ఉండేది. ఈ విషయం మాట్లాడుతుంటే... ‘శుభలగ్నం’ జ్ఞాపకం వస్తోంది. షూటింగ్ సమయంలో డైరక్టర్ కృష్ణారెడ్డిగారు వచ్చి... ‘‘పాత్రపరంగా సినిమాలో ఆమని డామినేట్ చేసేస్తోందండి’ అన్నారు. ‘‘వైనాట్? నేను హీరోనే. కానీ ఈ సినిమా ఆ అమ్మాయిదే’’ అన్నా. ఆ రోజుల్లో అలా ఉండేది. అందరూ కథ బరువు మోసేవారు. ఇప్పుడు ‘వన్‌మ్యాన్ షో’ అయిపోయింది. హీరో మీదే ఫోకస్ అంతా ఉంటోంది. ఒకప్పుడు హీరోలంటే గౌరవం ఉండేది. ఇప్పుడు హీరోలంటే భయం కనిపిస్తోంది. ‘అమ్మో! హీరోనా’ అనుకుంటున్నారు. కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో... ఎందుకు పోతున్నాయో కూడా తెలియటంలేదు. అందరూ అలా ఉన్నారని అనటంలేదు. కొందరు సెన్సిబుల్ డైరక్టర్స్ కూడా ఉన్నారు.
నిర్మాతలు ఏటీఎంలు అయిపోయేరనే విమర్శ వినిపిస్తూ ఉంటుంది..!
నిర్మాతకు గౌరవం తగ్గిందనే విషయంలో సందేహంలేదు. నిర్మాతలే సినీ పరిశ్రమకు మూల స్తంభాలు. కానీ వారికి గౌరవం తగ్గింది. చాలామంది నిర్మాతలు షూటింగ్‌లకు కూడా రావటంలేదు. ఆన్‌లైన్ ప్రొడ్యూసర్ హవా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇలా ఉండేదికాదు. నిర్మాతలు సినీ నిర్మాణాన్ని ఎంజాయ్ చేసేవారు. రోజూ షూటింగ్‌కు వచ్చేవారు. ఏవైనా మార్పులు ఉంటే కూడా చెప్పేవారు. ఇప్పుడు అలాంటివారు తక్కువగా ఉన్నారనే చెప్పాలి.
సముద్రం... నా ఆత్మకథ...
చిన్నప్పుడు మా స్కూలు... బీచ్ పక్కనే ఉండేది. అక్కడ కూర్చుని ఫిలాసఫికల్‌గా రాసుకుంటూ ఉండేవాడిని. అందుకే నేను రాస్తున్న ఆత్మకథ పేరు ‘సముద్రం’ అని పెట్టుకున్నా! నా ఆలోచనలు, అనుభవాలతో పన్నెండున్నర గంటల వీడియో చేశా. ఎడిటింగ్ బాగా రాలేదు. అందువల్ల విడుదల చేయలేదు. నా ఆత్మకథలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని పూరించిన తర్వాత దానిని విడుదల చేస్తా!
అందుకే కేసినోకు...
నాకు ప్రస్తుతం ఎలాంటి హాబీలు లేవు. ఒకప్పుడు విపరీతంగా పార్టీలు చేసేకొనేవాడిని. అప్పుడు నా రేంజే వేరు. షూటింగ్‌ల మధ్యలో ఫ్లయిట్ ఎక్కి విదేశాలకు వెళ్లి పార్టీ చేసుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ హఠాత్తుగా నాకు పార్టీలు చాలు అనిపించింది. పార్టీలకు కూడా ఎజెండాలు ఉంటున్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి... నాకు నా చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను గమనించటమంటే చాలా ఇష్టం. నేను కేసినోకి వెళ్లటానికి ఇదే ప్రధాన కారణం. మిలియన్స్ పోతుంటే ఎలా ఉంటుంది? వస్తుంటే వాళ్ల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేవి చూసేవాడిని. నా ఉద్దేశంలో మనిషి బుద్ధి పేకాటలో తెలుస్తుంది. ఒక మనిషి గురించి తెలియాలంటే అతనిని పేకాట ఆడించాలి.
రమ్యకృష్ణ నాకు గాడ్‌మదర్...
ఇండస్ట్రీలో నాకు రమ్యకృష్ణ మంచి స్నేహితురాలు. గాడ్‌మదర్ కూడా. ఈ మాట అనడానికి వెనకొక కారణం ఉంది. ‘శుభలగ్నం’ సినిమా నాకు రావటానికి తనే కారణం. ‘అల్లరి ప్రేమికుడు’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దత్తు గారి దగ్గర నుంచి ‘శుభలగ్నం’కు డేట్స్ కావాలని ఫోన్ వచ్చింది. ‘డేట్స్ లేవు.. వద్దని చెప్పేయి’’ అని మా మేనేజర్‌కు చెప్పా. అతను చెప్పటానికి వెళ్తున్న సమయంలో మా మాటలు రమ్యకృష్ణ విన్నది. ‘‘నీకు పిచ్చా! ఆ సినిమా ఒప్పుకో! డేట్స్ మనం ఎడ్జెస్ట్ చేసుకుందాం’’ అని చెప్పి ఒప్పించింది. తను లేకపోతే ‘శుభలగ్నం’ లేదు. ఇప్పటికీ తను మా ఫ్యామిలీ ఫ్రెండ్. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది. ‘‘ఎలా ఉన్నావు.. డబ్బులు జాగ్రత్త పెట్టుకో! అవసరంగా ఖర్చు చేయకు’’ అని చెబుతుంది.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
ఫొటోలు: అశోకుడు
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News