Pottery Passion With Purpose: సంపాదనలో సగం మూగజీవాలకే
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:50 AM
కళ మీదున్న మక్కువతో ఇంజనీర్ వృత్తి నుంచి పక్కకు తప్పుకుని, ఆకట్టుకునే పింగాణీ వస్తువుల తయారీకి పూనుకుంది హైదరాబాద్‌కు చెందిన గాదిరాజు హరిప్రియ. ‘ప్రాణి’ స్టూడియో ద్వారా తన ఆదాయంలో సగ భాగాన్ని....
వినూత్నం
కళ మీదున్న మక్కువతో ఇంజనీర్ వృత్తి నుంచి పక్కకు తప్పుకుని, ఆకట్టుకునే పింగాణీ వస్తువుల తయారీకి పూనుకుంది హైదరాబాద్‌కు చెందిన గాదిరాజు హరిప్రియ. ‘ప్రాణి’ స్టూడియో ద్వారా తన ఆదాయంలో సగ భాగాన్ని మూగజీవాల సేవల కోసం ఖర్చు చేస్తూ, సేవా ధృక్పథాన్ని కూడా చాటుకుంటోంది. పలు రకాల పింగాణీ కళాకృతులతో వినూత్నమైన గుర్తింపును పొందుతున్న హరిప్రియ ‘నవ్య’తో పంచుకున్న కబుర్లివి.
ఇంజనీరింగ్ తర్వాత ఆ రంగంలో ముందుకు వెళ్లాలని అనిపించలేదు. దాంతో మైసూర్‌లో ఎమ్‌బిఎ చేశాను. ఆ తర్వాత హెచ్‌ఆర్‌గా ఉద్యోగం చేశాను. అయినా మనసులో ఏదో వెలితి. చిన్నప్పటి నుంచి కళలంటే ఇష్టం. బొమ్మలు గీయడమంటే ఇష్టం. ఒక సందర్భంలో మట్టితో బొమ్మలు తయారుచేసే పాటరీ కళ నన్ను ఆకర్షించింది. అలా మూడేళ్ల క్రితం పాటరీ క్లాసులకు హాజరైనప్పుడు నాకు తగిన రంగం అదేనని అనిపించింది. ఆ కళలో ఎదగాలనే కోరికతో మహారాష్ట్రలో ఎంతో ప్రసిద్ధి పొందిన అన్వి పాటరీ లెర్నింగ్ సెంటర్‌లో చేరిపోయి, పాటరీలో పట్టు సాధించాను. ఆ తర్వాత ముంబయిలో సెరామిక్స్‌కు సంబంధించిన ఇంటర్న్‌షిప్ కూడా చేశాను. ఇంటికి చేరుకున్న తర్వాత చిన్న చిన్న సెరామిక్ కప్పులు, బొమ్మలు లాంటివి తయారుచేయడం మొదలుపెట్టాను. మొదట్లో స్నేహితులు, బంధువులు వాటినెంతో ఆదరించి, ప్రోత్సహించారు. మగ్స్, టేబుల్ మీద అమర్చుకునే అలంకరణ వస్తువులు, గోడకు వేలాడదీసే అలంకరణ వస్తువులు లాంటి వాటిని తయారుచేసేదాన్ని. అలా రెండేళ్ల పాటు సాధన చేసి, గత ఏడాదిగా సామాజిక మాధ్యమాల ద్వారా పూర్తి స్థాయిలో సెరామిక్ వేర్‌ను విక్రయించడం మొదలుపెట్టాను.
గిరాకీ ఎక్కువే!
పాటరీ క్లిష్టమైన కళ. ఎంతో మక్కువ ఉంటే తప్ప ఈ కళలో, రంగంలో రాణించడం సాధ్యపడదు. మరీ ముఖ్యంగా ముడిసరుకు, రంగులు, బట్టీలను సమకూర్చుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ప్రారంభంలో స్వయంగా ఉత్పత్తులను తయారుచేసినా, వాటిని కాల్చడం కోసం పాటరీ స్డూడియోల్లో ఉండే బట్టీలను అద్దెకు తీసుకునేదాన్ని. కొంత డబ్బు చెల్లించి వాళ్ల దగ్గరుండే బట్టీలో మన ఉత్పత్తులను కాల్చుకోవచ్చు. ఆ తర్వాత కొంత కాలానికి సొంత బట్టీ కొనుక్కోగలిగాను. అప్పటి నుంచి ఆర్డర్లు కూడా పెరిగాయి. ఇంటీరియర్ డిజైనర్లు లోగో మగ్స్, కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం నా చేత ఆయా ఉత్పత్తులను తయారుచేయించుకుంటూ ఉంటారు. ఇంకొందరు పెంపుడు జంతువుల బొమ్మలు, అలంకరణ వస్తువులు తయారుచేయించుకుంటూ ఉంటారు. అలాగే కెఫేలు, రెస్టారెంట్లు టేబుల్ వేర్ పట్ల ఆసక్తిని కనబరుస్తూ ఉంటాయి. పాటరీ వర్క్‌షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. నాకు ప్రకృతి అంటే ఇష్టం. కాబట్టి నేను తయారుచేసే ఉత్పత్తులు ప్రకృతిని ప్రతింబింబించేలా ఉంటాయి.
సవాళ్లూ లేకపోలేదు
ఆర్డర్లు అందుకోవడం ఒక ఎత్తైతే, వాటికి రూపాన్నిచ్చి, అంతిమ ఉత్పత్తిని రూపొందించడం మరో ఎత్తు. ఒక్కోసారి మనం అనుకున్న రూపం వచ్చిందనుకుంటాం. కానీ బట్టీలో కాల్చిన తర్వాత దాని రూపం మారిపోవచ్చు. సంతృప్తిని కలిగించకపోవచ్చు. ఒక్కో సందర్భంలో ఉత్పత్తే పగిలిపోయి, శ్రమంతా వృథా కావచ్చు. అలా ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ప్రస్తుతం సెరామిక్ వేర్‌కు ఆదరణ పెరిగింది. ఇంటీరియర్ డిజైనర్లు, ఆధునిక మహిళలు, పింగాణీ పాత్రలు, వస్తువులు, బహుమతుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. హోటల్ రంగం కూడా వినూత్నమైన డిజైనర్ వేర్‌ను కోరుకుంటోంది. ఆహార పరిశ్రమ, ఇంటీరియర్ డెకరేషన్, డెకర్‌వేర్‌తో దగ్గరి సంబంధం ఉన్న రంగం కాబట్టి పాటరీ రంగంలో మంచి అవకాశాలున్నాయి. ఈ రంగాలు మనుగడ సాగించినంత కాలం పాటరీకి కూడా మనుగడ ఉంటుంది. ఆసక్తి, సృజనాత్మకత కలిగిన వారు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. ఉత్పత్తులు ఎంత వినూత్నంగా ఉంటే, వాటికి ఆదరణ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. మన ఉత్పత్తులు మార్కెట్‌లో గుర్తింపు పొందేవరకూ కష్టపడగలిగితే, ఈ రంగానికి కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.
గోగుమళ్ల కవిత

మాది భీమవరం దగ్గరున్న జల్లి కాకినాడ. వ్యాపారరీత్యా చిన్నప్పుడే కుటుంబంతో పాటు హైదరాబాద్ వచ్చేశాను. నా చదువంతా ఇక్కడే సాగింది. నాన్న గాదిరాజు ప్రసాదరాజు పౌలీ్ట్ర వ్యాపారం చేస్తారు. అమ్మ కుమారి, గృహిణి. మూగజీవాల పట్ల ప్రేమ ప్రతిబింబించేలా నా పాటరీ స్టూడియోకు ‘ప్రాణి’ అనే పేరు పెట్టుకున్నాను. ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి జబ్బుపడిన, గాయపడిన వీధి కుక్కలకు చికిత్సలు చేయడం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం లాంటివి చేస్తున్నాను. నిధులు సేకరించి వాటికి ఆహారం అందిస్తూ ఉంటాను. వేసవిలో కుక్కల కోసం నీటి పాత్రలు అందుబాటులో ఉంచుతూ ఉంటాను. కొవిడ్ సమయంలో ఇస్కాన్, కుక్కల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నాను. అలాగే నిష్కామకర్మ సంస్థ తరఫున నిధులు సేకరించడంతో పాటు, పాటరీ ద్వారా ప్రతి నెలా నాకొచ్చే సంపాదనలో సగ భాగాన్ని మూగ జీవాల సేవలకే వినియోగిస్తూ ఉంటాను.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి