Fusion Sweets Indian Desserts: ఫ్యూజన్ స్వీట్స్‌దే భవిష్యత్
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:35 AM
పాలతో బర్ఫీ చేస్తారు. ఆ బర్ఫీకి మామిడిపండు రసం కలిపి.. పైపొరగా వైట్ చాకెలెట్‌ను పూస్తే? మ్యాంగో చాక్‌లెట్ బర్ఫీ అవుతుంది. ఇలా ఇప్పటి దాకా సంప్రదాయబద్ధంగా....
పాలతో బర్ఫీ చేస్తారు. ఆ బర్ఫీకి మామిడిపండు రసం కలిపి.. పైపొరగా వైట్ చాకెలెట్‌ను పూస్తే? మ్యాంగో చాక్‌లెట్ బర్ఫీ అవుతుంది. ఇలా ఇప్పటి దాకా సంప్రదాయబద్ధంగా తయారవుతున్న రకరకాల స్వీట్స్ కొత్తరూపం సంతరించుకుంటున్నాయి. ప్యూజన్ స్వీట్స్ గా విస్తృతప్రచారం పొందుతున్న వీటి తయారీలో స్వీట్స్ స్టోరీస్ అనే సంస్థ ముందుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్‌కు ఫుడ్ పార్టనర్‌గా కూడా వ్యవహరించింది. తెలుగువారి రుచులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లటమే తమ లక్ష్యమనే స్వీట్ స్టోరీస్ యజమాని
క్రాంతి కుమార్ కసపను 'నవ్య' పలకరించింది.
‘తెలుగు ప్రజలు అన్ని రకాల పండగలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాటి కోసం చాలా మంది ఇళ్లలోనే స్వీట్స్‌ను తయారుచేసుకుంటారు. అయితే ఈ పండగలే కాకుండా పుట్టిన రోజులు.. పెళ్లి రోజులు వంటి ముఖ్యమైన రోజులు కూడా అనేకం ఉంటాయి. సాధారణంగా ఇలాంటి రోజుల్లో కూడా ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారికి ఏం పెట్టాలనే విషయంపై చాలా మందికి సందిగ్దత ఉంటుంది. సమోసాలు, కేక్ వంటివి పెడుతూ ఉంటారు. అలాంటి రోజుల్లో కూడా అందరూ ఇష్టపడే స్వీట్స్‌ను అందించాలనేది మా ఉద్దేశం. దాని కోసమే ‘‘ఫ్యూజన్ స్వీట్స్’’ అనే కాన్స్‌ప్టను తీసుకువచ్చాం. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను. ‘కాజూ కతిలి’ అందరూ ఎక్కువగా తినే స్వీట్. కానీ పుట్టిన రోజుల వంటి సమయాల్లో దీనిని తినాలంటే పిల్లలు, యువత ఎక్కువగా ఇష్టపడరు. అందుకోసం మేము ‘స్ట్రాబెర్రీ కాజు కతిలి విత్ వైట్ చాక్‌లెట్’ను తయారుచేశాం.

కాజు కతిలీలోనే స్ట్రాబెర్రీ పల్ప్ వేసి తయారుచేసి.. దానిపై మళ్లీ ఇంకో పొర వైట్ చాక్‌లెట్ వేస్తాం. దీని వల్ల దానికి ఒక కొత్త రూపు వచ్చింది. అంతే కాకుండా స్ట్రాబెర్రీ ఇష్టం ఉన్నవారు.. చాక్‌లెట్ ఇష్టం ఉన్నవారు కూడా వీటిని బాగా ఆదరించటం మొదలుపెట్టారు. దీని ఆదరణ చూసి పైనాపిల్, హార్లిక్స్, మామిడిపండులతో తయారుచేశాం. ఇదే విధంగా బెల్లంతో కూడా వీటిని తయారుచేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు తరం వారు ఎక్కువ స్వీట్స్‌ను తినటం లేదు. ఎక్కువగా చాట్‌లను ఇష్టపడుతూ ఉంటారు. వారు ఆదరించకపోతే ఏ బిజినెస్ అయినా నడవటం కష్టం. ఈ మధ్యకాలంలో బ్లూబెర్రీస్, కెన్‌బెర్రీ్‌స వంటివి కూడా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. డ్రైఫ్రూట్స్‌ను తప్పనిసరిగా తినమని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము బ్లూబెర్రీ డిలైట్ వంటి ఫ్యూజన్ స్వీట్స్‌ను తయారుచేశాం. దీనిలో కేవలం బ్లూబెర్రీలు, డ్రైప్రూట్స్ మాత్రమే ఉంటాయి. మా దగ్గర ఉన్నవాటిలో అత్యంత ఆరోగ్యకరమైన స్వీట్స్‌లో ఇది కూడా ఒకటి. దీనిలో చక్కెర ఉండదు. ఇతర పదార్థాలు ఏమి ఉండవు. తినటానికి కూడా చాలా బావుంటుంది. ఈ తరహా కొత్త కొత్త ఆలోచనలతోనే యువతను ఆకట్టుకోగలుగుతాం.
మనం తినేవన్నీ నేతి స్వీట్స్ కావు..
భారతీయ ఆహారంలో నెయ్యి అనేది చాలా ముఖ్యమైనది. నెయ్యి వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. పూర్వకాలం స్వీట్స్‌ను కేవలం నేతితోనే చేసేవారు. నూనెలు మన జీవితంలో ప్రవేశించిన తర్వాత నూనెలతో కూడా స్వీట్స్‌ను తయారుచేయటం మొదలుపెట్టారు. కానీ స్వచ్ఛమైన నేతితో స్వీట్స్‌ను తయారుచేయాలంటే ఎక్కువ ఖరీదు అవుతుంది. అందువల్ల మనకు మార్కెట్లో దొరికే నేతి స్వీట్స్‌లో ఎక్కువ శాతం నూనెతో తయారుచేసినవే! స్వీట్‌ను నేతితో తయారుచేసిన తర్వాత పైన నేతితో పూత పూస్తారు. అందువల్ల తినగానే నేతి వాసన వస్తుంది. పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఇలాగే తయారుచేస్తుంటాయి. మేము మా సంస్థను ప్రారంభించే ముందు కొన్ని ట్రైల్స్ వేశాం. దీని కోసం పెద్ద సంస్థలకు చెందిన చెఫ్‌లు వచ్చారు. వాళ్లకు కావాల్సిన పదార్థాలు ఇచ్చినప్పుడు వాళ్లు షాక్ అయ్యారు. ‘‘ఇంత నెయ్యి వాడితే మనకు కిట్టుబాటు అవదు’’ అన్నారు. కానీ సరైన నెయ్యిని వాడకపోతే స్వీట్స్‌కు నిజమైన రుచి రాదు.

ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. నేయ్యిల్లో కూడా అనేక రకాలున్నాయి. అన్నింటినీ వేయించటానికి వాడకూడదు. శుద్ధమైన దేశీ నెయ్యిని వేయించటానికి వాడాలి. పూసలు పూసలుగా ఉండే నేతిపై పైన పూతగా రాయటానికి మాత్రమే వాడాలి. ఒకో రకమైన స్వీట్‌కు ఒకో రకమైన నెయ్యిని వాడాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇక్కడ పంచుకుంటా. ఐపీఎల్ జరిగేటప్పుడు ఆటగాళ్లు మాత్రమే కాకుండా చాలా పెద్ద టీం వస్తుంది. వాళ్లు ముందే వస్తారు. ఆహారపదార్థాల తయారిలో వారువాడే ముడిసరుకుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక రోజు మేము వాళ్లకు అల్పాహారంలో నేతితో చేసిన బెల్లం జిలేబీని పెట్టాం. ఆ టీమ్‌కు చెందిన ఒక పెద్ద అధికారి దానిని తిన్నారు. ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి - ‘‘ఇలాంటి జిలేబీ నేను ఎప్పుడూ తినలేదు. సాధారణంగా ఉత్తరభారతదేశంలో మంచి జిలేబీ దొరుకుతుందంటారు.. అక్కడ కూడా ఇంత రుచి లేదు.. కారణమేమిటి’’ అని అడిగాడు. ‘‘కల్తి లేని శుద్ధ దేశీనేతితో తయారుచేశాం’’ అని ఆయనకు సమాధానమిచ్చాను. నా ఉద్దేశంలో ప్రజల్లో తాము తినే ఆహారం పట్ల అవగాహన పెరుగుతోంది. కొత్త కొత్త రుచులను తినటానికి ఇష్టపడుతున్నారు. వాటిని మనం తప్పనిసరిగా అందించాలి. అలాంటప్పుడు ఫ్యూజన్ స్వీట్స్‌దే భవిష్యత్తు అనిపిస్తుంది. అంతే కాకుండా.. మన తెలుగువారికి అద్భుతమైన ఆహార సంస్కృతి ఉంది. దీనిని అంతర్జాతీయ వేదికలపై తీసుకువెళ్లాలనేది మా లక్ష్యం.
నువ్వులు, బెల్లం, నేతితో చేసి లడ్డులు ప్రతి రోజు తింటే మనకు ఒక రోజుకు సరిపడిన ఐరన్ కంటెంట్ దొరుకుతుంది. ఇదే విధంగా శనగపిండిలో చాలా ప్రొటీన్ ఉంటుంది. కానీ దీనిని బాగా డీప్ ఫ్రై చేయటం వల్ల దానిలో ఉన్న పౌష్టికవిలువలు పోతాయి. అలా కాకుండా శనగపిండి, బెల్లం, నేయ్యిలతో లడ్డులు తయారుచేస్తే చాలా ఆరోగ్యకరమనే చెప్పాలి. నువ్వుల అరిసెలు కూడా ఆరోగ్యమైనవే!
ఇవి కూడా చదవండి..
చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి
ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి