Share News

Putul Das Mitra Rice Grains To Jewellery: ధాన్యంతో నగ ధగలు

ABN , Publish Date - Sep 17 , 2025 | 02:02 AM

నగలు అనగానే బంగారం, వెండి లాంటి లోహాలతో, పూసల్లాంటి వాటితో చేసినవి కళ్ల ముందు మెదులుతాయి. కానీ పుతుల్‌దాస్‌ మిత్రా ‘కాదేదీ సృజనాత్మక సృష్టికి అనర్హం’ అంటారు.కోల్‌కతాకు చెందిన ఆమె...

Putul Das Mitra Rice Grains To Jewellery: ధాన్యంతో నగ ధగలు

నగలు అనగానే బంగారం, వెండి లాంటి లోహాలతో, పూసల్లాంటి వాటితో చేసినవి కళ్ల ముందు మెదులుతాయి. కానీ పుతుల్‌దాస్‌ మిత్రా ‘కాదేదీ సృజనాత్మక సృష్టికి అనర్హం’ అంటారు.కోల్‌కతాకు చెందిన ఆమె ధాన్యంతో రూపొందించిన వివిధ ఆభరణాలు విదేశాల్లో కూడా ఆదరణ పొందుతున్నాయి. ఎందరికో శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గం చూపుతున్న 46 ఏళ్ళ పుతుల్‌దాస్‌ పలు పురస్కారాలు సైతం అందుకున్నారు.

‘‘గోవిందభోగ్‌ అనే రకం వరి ధాన్యాన్ని మా రాష్ట్రం పశ్చిమబెంగాల్‌లో ఎక్కువగా సాగు చేస్తారు. ఆశ్వయుజ పూర్ణిమను ‘కోజాగరి పూర్ణిమ’గా, లక్ష్మీదేవి పుట్టినరోజుగా మేము జరుపుకొంటాం. ఆ సందర్భంలో... గోవిందభోగ్‌ ధాన్యంతో దండలు తయారు చేసి ఇళ్ళలో అలంకరించడం ఆచారం. పూల దండలతో పోలిస్తే ఈ దండలు ఎక్కువకాలం ఉంటాయి. కోల్‌కతా నగరంలో పుట్టి పెరిగిన నాకు ఈ దండలు తయారు చేయడం చిన్న వయసునుంచీ అలవాటే. దాంతోపాటే కుట్లు, అల్లికలు నేర్చుకున్నాను. కాలేజీలో చదువుతున్నప్పుడు ధాన్యంతో రాఖీలు చేశాను. చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. ఆ తరువాత నా దృష్టి నగల మీదకు మళ్ళింది.


2-navya.jpg

ప్రణబ్‌ అభినందించారు...

చిన్న చిన్న దండలతో నా ప్రయోగాలు మొదలయ్యాయి. ఆ తరువాత చెవి దుద్దుల్లాంటి చిన్న చిన్న వస్తువులు. క్రమంగా జూకాలు, గాజులు, నెక్లె్‌సలు... ఇలా రకరకాల ఆభరణాలు రూపొందించాను. 2000 సంవత్సరంలో... కోల్‌కతాలో నిర్వహించిన ఒక ఎగ్జిబిషన్‌లో వాటిని ప్రదర్శించే అవకాశం వచ్చింది. సందర్శకులకు అవి ఎంతో నచ్చాయి. వాటిని ఉత్సాహంగా కొన్నారు. దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కోల్‌కతా, ఆ చుట్టుపక్కల ఎక్కడ ఎగ్జిబిషన్లు, ఉత్సవాలు జరిగినా... నా స్టాల్‌ ఏర్పాటు చేసేదాన్ని. మీడియాలో నా గురించి ప్రచారం అయింది. నేను చేసేవి విశిష్ట కళారూపాలుగా గుర్తిస్తూ... 2002లో రాష్ట్రప్రభుత్వం నాకు అవార్డును అందజేసింది. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో నేను తయారు చేసిన నగలను విక్రయించడం మొదలుపెట్టాను. కానీ ఒక ప్రదర్శనకోసం డిమాండ్‌కు తగినన్ని ఆభరణాలు చేయడం అంత సులువు కాదు. ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. అప్పుడే మరికొందరు మహిళలకు శిక్షణ ఇచ్చాను. మేమందరం కలిసి ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చినప్పుడు... నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వచ్చారు. మా ఆభరణాలను తిలకించి, అభినందించారు. 2015లో ఆయన చేతుల మీదుగానే ‘నేషనల్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌ అవార్డు’ను స్వీకరించాను. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గురు శిష్య పరంపర పథకం’ కింద వివిధ రాష్ట్రాల్లో వేలాదిమందికి ధాన్యం ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చాను.


జూకాల నుంచి

పెళ్ళి నగల వరకూ...

‘‘ధాన్యం ఆహారానికి ఉపయోగించేది కదా! దీంతో నగలేమిటి? ఇవి ఎన్నాళ్ళుంటాయి గనుక!’’ అని కొందరు సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇవి పర్యావరణానికి మంచివి, చర్మానికి, మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చెయ్యవు. నగల తయారీకి ముందు వాటిని ప్రత్యేక పద్ధతిలో శుద్ధి చేస్తాం. కాబట్టి అవి పాడవకుండా ఉంటాయి. ఏడు నుంచి ఎనిమిదేళ్ళ వరకూ మన్నుతాయి. ఇప్పుడు చిన్న జూకాల నుంచి పెళ్ళిళ్ళకు బ్రైడల్‌ సెట్ల వరకూ ప్రతిదీ మేం రూపొందిస్తున్నాం. మరోవైపు గృహాలంకరణ వస్తువులను కూడా ధాన్యంతో తయారు చేస్తున్నాం. మన దేశంలోనే కాదు, చైనా, ఫ్రాన్స్‌, ఇటలీ, స్విట్జర్లాండ్‌ లాంటి అనేక దేశాల్లో కూడా వీటిని ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నాం. మొదట మా నాన్నగారు, తరువాత నా భర్త, ఇప్పుడు మా పిల్లల ప్రోత్సాహం లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. పాతికేళ్ళ క్రితం సరదాగా ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం నాకు ఇంత పేరు తెచ్చిపెట్టిందంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇదేదీ నేను ఒక ప్రణాళిక వేసుకొని చేసినది ఏమాత్రం కాదు. మనం నిమిత్తమాత్రులం అని, విధి మనల్ని నడిపిస్తుందనీ గట్టిగా నమ్ముతాను. నా వద్ద ముప్ఫై మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. నా దగ్గర శిక్షణ పొందినవారిలో చాలామంది ధాన్యంతో కళాకృతులు, నగల తయారీని ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఇంతకన్నా సంతృప్తి ఏముంటుంది?’’

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 02:02 AM