Share News

Modern Coffee Drinks: రుచులు మారుతున్నాయి

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:29 AM

ఒకప్పుడు వేడి వేడి ఫిల్టర్‌ కాఫీ తాగితే ఆ మజానే వేరు అనుకొనేవారు. ఇప్పుడు ఆ ఫిల్టర్‌ కాఫీ మాత్రమే కాదు.. రకరకాల చల్లటి కాఫీలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఈ కాఫీలను తయారుచేయటానికి అనువైన కాఫీ గింజలు కూడా...

Modern Coffee Drinks: రుచులు మారుతున్నాయి

ఒకప్పుడు వేడి వేడి ఫిల్టర్‌ కాఫీ తాగితే ఆ మజానే వేరు అనుకొనేవారు. ఇప్పుడు ఆ ఫిల్టర్‌ కాఫీ మాత్రమే కాదు.. రకరకాల చల్లటి కాఫీలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఈ కాఫీలను తయారుచేయటానికి అనువైన కాఫీ గింజలు కూడా మన దేశంలో లభిస్తున్నాయి. కాఫీ ప్రేమికుల కోసం ప్రపంచంలో ఉన్న రకరకాల కాఫీలను అందించటానికి దక్షిణభారత దేశంలో తొలిసారి స్టార్‌బక్స్‌ హైదరాబాద్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ప్రారంభించింది. ఇక్కడ దొరికే కొన్ని రకాల కాఫీల తయారీ ప్రక్రియలో చెఫ్‌ నిఖిత కూడా పాలుపంచుకున్నారు. తాను తయారుచేసిన కాఫీల వెనకున్న కథను ఆమె ‘నవ్య’తో పంచుకున్నారు.

కాఫీ అంటే చాలా మందికి ఫిల్టర్‌ కాఫీనే కదా...

ఇలా రకరకాల కాఫీల ఆలోచన ఎలా వచ్చింది?

తరాలు మారుతున్న కొలది రుచులు మారతాయి. ఒక పదార్ధాన్ని మనం వండేటప్పుడు అనుసరించే ప్రక్రియలు మారతాయి. కాఫీనే ఒక ఉదాహరణగా తీసుకుందాం. మొదట్లో కాఫీ గింజలను గుండగా చేసి.. దానిని వేడి నీళ్లలో ఉడికించి తాగేవారు. ఆ తర్వాతి కాలంలో పాలు, పంచదార కలిపి తాగటం మొదలుపెట్టారు. ఇప్పుడు రకరకాల పాలను కలుపుతున్నారు. అంటే కాఫీని తయారుచేసే ప్రక్రియలోను.. దానిని తాగే తీరులో మార్పు వచ్చినట్లే కదా! ఒకప్పుడు కాఫీని వేడిగా మాత్రమే తాగేవారు. ఇప్పుడు కోల్డ్‌ కాఫీ కూడా తాగుతున్నారు. ఇలాంటి మార్పులు జరుగుతున్న సమయంలో ఈ కాఫీకి అదనపు రుచులు చేరిస్తే బావుంటుందనే ఆలోచనతో కొత్త తరహా కాఫీలు తయారుచేశాం. ఇప్పటి దాకా మేము చేసిన ప్రయత్నాలకు మంచి ఆదరణ లభించింది. కొత్త కాఫీలకు ఆదరణ లభిస్తుందనే నమ్మకం కూడా ఉంది.


బెల్లం, జామకాయ, మిరపకాయ, షికెన్‌జీ...

ఈ రుచుల్లో కాఫీ బావుంటుందా?

మీరు చెప్పినవన్నీ మన చిన్ననాటి జ్ఞాపకాలు. జామకాయను కారం, ఉప్పు వేసుకొని తినని పిల్లలు ఉండరు. ఉత్తరభారత దేశంలో షికన్‌జీని ఇంటికి వచ్చిన వారందరికీ షర్బత్‌ రూపంలో ఇస్తారు. కర్ణాటకలో పానకం చాలా ఫేమస్‌. వీటికి కాఫీ టేస్ట్‌ చేరిస్తే ఎలా ఉంటుందనేదే ఆలోచన. వీటిని కొత్త తరం వారు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది. కాలంతో పాటుగా రుచులు మారుతున్నాయి. మన వాళ్లు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి రుచులను ఆదరిస్తున్నారు. ఉదాహరణకు కోల్డ్‌ కాఫీనే తీసుకుందాం. గతంలో మన దగ్గర కోల్డ్‌ కాఫీ తాగే వారు తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి ఒక కారణం- చాలా మంది విదేశాలకు వెళ్లి అక్కడ కోల్డ్‌ కాఫీని తాగటం. అయితే ఇప్పటికీ ఫిల్టర్‌ కాఫీని ఆస్వాదించేవారు ఎంతో మంది ఉన్నారు. వారికి కాఫీ ఒక జ్ఞాపకం. ఎవరిదాకానో ఎందుకు.. మా అమ్మ వేడి ఫిల్టర్‌ కాఫీనే తాగుతుంది. చల్లారితే తాగదు. నేను శీతాకాలంలో వేడి కాఫీ తాగుతా! వేసవిలో చల్లటి కాఫీ తాగుతా. పైగా కొంత తాగి కొంత దాచుకుంటా! వేడి కాఫీ తాగేవారికి ఈ సౌలభ్యం ఉండదు.

చెఫ్‌గా మీ అనుభవాలేమిటి?

చెఫ్‌ జీవితం అంత సులభం కాదు. ప్రతి రోజు కొత్తదనం కోసం ఆలోచించాలి. అదే సమయంలో కస్టమర్ల రుచి కూడా మనకు చాలా ముఖ్యం. చాలా సందర్భాలలో మనకు నచ్చింది..కస్టమర్లకు నచ్చాల్సిన అవసరం లేదు. అందువల్ల కస్టమర్లకు ఎలా ఇష్టమో అలాగే వండాలి. నేను పేస్ట్రీ చెఫ్‌ను. అంటే కేక్‌లు, డిజర్ట్స్‌ తయారుచేస్తారు. మనకు పాశ్చాత్యులే కేకుల తయారీని నేర్పారు. రకరకాల మిఠాయిల తయారీ మనకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ మధ్యకాలంలో ఈ మిఠాయిలను కూడా సృజనాత్మకంగా తయారుచేస్తున్నారు. ఈ విధంగానే కేక్‌ల విషయంలో మేము సృజనాత్మకంగా ఉండాలి.

ఇవీ చదవండి:

జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్

22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Jul 20 , 2025 | 03:29 AM