Bindu Vinodans Silent Revolution: ఆమె మౌన ధ్వని
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:44 AM
బహుళజాతి కంపెనీలో గ్లోబల్‌హెడ్‌గా ఉద్యోగం... ఏడు అంకెల జీతం, ఆకర్షణీయమైన జీవితం. వీటన్నిటినీ వదిలేసి అణగారిన వర్గాలకు సాయం చేయడంలో ఆత్మసంతృప్తిని వెతుక్కున్నారు బిందు వినోదన్....
బహుళజాతి కంపెనీలో గ్లోబల్‌హెడ్‌గా ఉద్యోగం... ఏడు అంకెల జీతం, ఆకర్షణీయమైన జీవితం. వీటన్నిటినీ వదిలేసి అణగారిన వర్గాలకు సాయం చేయడంలో ఆత్మసంతృప్తిని వెతుక్కున్నారు బిందు వినోదన్. ఒడిశాలోని మారుమూల ప్రాంతాల్లో వందలాది మహిళలను సంపాదనపరులుగా మార్చడమే కాదు...దశాబ్దాల క్రితం ఆదరణ కోల్పోయిన కళకు కొత్త జీవం పోశారు.
‘‘తొమ్మిదేళ్ళ క్రితం జరిగిన ఆ వేడుక ఇంకా నా కళ్ళలో మెదులుతోంది. ఒక బహుళజాతి కంపెనీలో సంస్థాగతమైన అభివృద్ధికి నేను అందించిన సేవలకు గుర్తింపుగా.. ఒక అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నాను. ఇరవై రెండేళ్ళ వృత్తి జీవితంలో నా విజయాలకు చిహ్నంగా, గర్వకారణంగా దాన్ని పరిగణించాలి. కానీ నాకు అలా అనిపించలేదు. ‘ఒక సంస్థ లక్ష్యాలకోసం పని చేయడం, వాటిని నెరవేర్చినందుకు అభినందనలు అందుకోవడం... జీవితం అంటే ఇంతేనా? ఒక మనిషిగా నేను సాధించినదేమిటి?’ అనే ప్రశ్న నన్ను వెంటాడింది.
చంపుతానని బెదిరించారు...
నేను కేరళలో పుట్టాను. ముంబాయిలో పెరిగాను. విద్యార్థిగా ఉన్నప్పుడే... శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నాను. నాటకాలు వేసేదాన్ని. పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టం. చదువులోనూ ఎప్పుడూ ఫస్ట్‌క్లాసే. ఇంజనీరింగ్ చదువుతూ ఉండగానే... పెళ్ళయింది. నా భర్త ప్రోత్సాహంతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో... ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. ఆ తరువాత మన దేశంలో, విదేశాల్లో పలు కార్పొరేట్ కంపెనీల్లో పని చేశాను. గ్లోబల్ హెడ్ స్థాయికి ఎదిగాను. అయితే ఆ జీవితం నాకు సంతృప్తిని కలిగించలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేశాను. మన దేశానికి తిరిగి వచ్చేశాను. బెంగళూరులోని ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేయడం ప్రారంభించాను. గ్రామీణ మహిళల కోసం ఏదైనా చేయాలనేది నా కోరిక. అందుకే 2017లో ‘మౌన ధ్వని ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించాను. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఛౌలిపోషి గ్రామంలో కార్యకలాపాలు ప్రారంభించాను. దేశంలో అత్యంత పేద గ్రామాల్లో అదొకటి. అక్కడ పాఠశాలలు లేవు, వైద్య సదుపాయాలు, మంచి నీటి సౌకర్యం, రోడ్లు, విద్యుత్ లేవు. ఉపాధికోసం చాలామంది పురుషులు వలసలు వెళ్ళారు. మహిళలు భూస్వాముల పొలాల్లో కట్టుబానిసల్లా పని చేయాలి. నేను స్థానిక మహిళలతో మాట్లాడాలని ప్రయత్నిస్తే... గ్రామ పెద్దలు వారిని బెదిరించారు. ఈ సమయంలో గోవింద్ అనే యువ సామాజిక కార్యకర్త నాకు సాయపడ్డారు. కొందరు ఔత్సాహికులతో ఒక బృందం ఏర్పాటుకు సహకరించారు. మేము గ్రామ మహిళలతో సమావేశం నిర్వహించాం. వారి సమస్యలు తెలుసుకున్నాం. సాయం అందించడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. ఈ సంగతి తెలిసి పెత్తందారులు ఆగ్రహించారు. నా కారును ధ్వంసం చేశారు. చంపేస్తానని బెదిరించారు. మా బృందం సభ్యుల మీద భౌతికంగా దాడి చేశారు. పోలీసులకు నా మీద ఫిర్యాదు చేశారు. పోలీసులు నన్ను ఒక రోజంతా స్టేషన్‌లో కూర్చోబెట్టి రకరకాలుగా ప్రశ్నించారు. మావోయిస్టుగా ముద్రవేసే ప్రయత్నం చేశారు. చివరకు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలనుకున్నాను. అయితే గ్రామంలో మహిళలు నేను వెళ్ళడానికి వీల్లేదని పట్టుపట్టారు. నాకు రక్షణగా నిలుస్తామని చెప్పారు. అప్పుడు... ఇక వెనుకడుగు వేయకూడదని నిశ్చయించుకున్నాను.
సమస్యలు తీరుస్తూ...
ముందుగా... ఆ గ్రామంలోని ఎనిమిది మంది మహిళలకు ఉపాధి కల్పించి, ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేయాలనుకున్నాం. గొర్రెల పెంపకానికి సాయం అందించాం. అప్పటివరకూ గ్రామంలోని మహిళలు బహిర్భూమికోసం ఆరుబయలుకు వెళ్ళాల్సి వచ్చేది. మా బృందం వారికి తొలి టాయిలెట్‌ను నిర్మించి ఇచ్చింది. ఆ గ్రామం ఒకప్పుడు సంప్రదాయికమైన ‘మయూర్‌భంజ్ సంతాలీ చేనేత కళ’కు పెట్టింది పేరు. ఎనభయ్యేళ్ళ క్రితం నుంచి క్రమంగా ఆ వైభవం క్రమంగా క్షీణించిపోయింది. ఆ నైపుణ్యం ఉన్న వ్యక్తి ఒక్కరే మిగిలారు. అతని నేతృత్వంలో మహిళలకు శిక్షణ అందించడం కోసం ఒక కేంద్రం ఏర్పాటు చేశాం. అలాగే ఒడిశాలోని వివిధ ప్రాంతాల నుంచి నిష్ణాతులైన శిక్షకులను తీసుకువచ్చాం. చుట్టుపక్కల గ్రామాల మహిళలు కూడా ఈ కేంద్రానికి వచ్చి నేర్చుకోవడం ప్రారంభించారు. పొలాల్లో పనులు మాని... శిక్షణకు రావడం వాళ్ళకు ఇబ్బందేనని నాకు తెలుసు. అందుకే దాదాపు 600 మంది మహిళలకు, వారి కుటుంబాలకు పోషకాహారాన్ని అందించడానికి ‘నైవేద్య’ అనే కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించాను. అలాగే వారికి స్టైఫండ్ ఇవ్వడంతోపాటు... వారి పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేశాను. ‘మౌన ధ్వని’ ద్వారా శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ వారి పిల్లలను బడికి పంపడం తప్పనిసరి చేశాను. ఇది ఆ ప్రాంతంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. 800 మందికి పైగా మహిళలు సంతాలీ చేనేతలో నిష్ణాతులయ్యారు. దీనివల్ల వారి కుటుంబాలకు ఆదాయం వస్తోంది. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఏర్పడింది.

ఇప్పుడు సమాధానం ఉంది...
ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో వివిధ ప్రాంతాల్లో 21 ‘మౌనఽఽ ఽధ్వని’ కేంద్రాలను ఏర్పాటు చేశాను. ప్రతి కేంద్రం రెండు మూడు గ్రామాల మహిళలను అనుసంధానం చేస్తుంది. చేనేత వస్త్రాలతో పాటు పర్యావరణ అనుకూలమైన బ్యాగ్‌లు, డెయిరీలు, ఇతర వస్తువులను తయారు చేయించి విక్రయిస్తున్నాం. వాటికి కార్పొరేట్ సంస్థల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఢిల్లీలోని ‘కైరీ సమ్మర్ టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్’లో తొలిసారిగా ‘మయూర్‌భంజ్ సంతాలీ శారీ కలెక్షన్’ను ప్రదర్శించినప్పుడు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఇవేవీ అంత సులువుగా జరిగిపోలేదు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్న డబ్బును, ముంబాయిలో నా సొంత ఫ్లాట్‌ను, మా నాన్న నాకు ఇచ్చిన భూమిని అమ్మగా వచ్చిన మొతత్తాలను ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేశాను. మా బృందంలో పనిచేసేవారి జీతాల కోసం ఇప్పటికీ నెలకు రెండు వారాలు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాను. కానీ ఇంతటి సంతృప్తిని ఇంతకుముందెప్పుడూ అనుభవించలేదు. ‘మనిషిగా నేను సాధించినదేమిటి?’ అని నన్ను వెంటాడిన ప్రశ్నకు... ఇప్పుడు నా దగ్గర సమాధానం ఉంది.’’
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News