Bhavani Para Athlete: పడి లేచిన కెరటంలా గెలిచి నిలిచి
ABN , Publish Date - Jul 21 , 2025 | 02:20 AM
పడి లేచిన కెరటంలా... గెలిచి నిలిచి మరణం అంచుల వరకు వెళ్లింది. విధిని ఎదిరించి ధైర్యంగా నిలబడింది. ప్రమాదంలో కుడి చేయి కోల్పోయినా.. ఆత్మవిశ్వాసంతో అపురూప విజయాలు...
విజేత
మరణం అంచుల వరకు వెళ్లింది. విధిని ఎదిరించి ధైర్యంగా నిలబడింది. ప్రమాదంలో కుడి చేయి కోల్పోయినా.. ఆత్మవిశ్వాసంతో అపురూప విజయాలు అందుకుంది. ‘ప్రపంచ పారా గ్రాండ్ ప్రీ’లో రెండు స్వర్ణాలు గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది వలసంగారి భవాని. మారుమూల పల్లె నుంచి వచ్చి.. పడి లేచిన కెరటంలా సంచలనాలు నమోదు చేస్తున్న ఈ పారా అథ్లెట్.. తన క్రీడా ప్రయాణం గురించి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చింది.
‘‘అది 2009... సెప్టెంబరు. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. ఇంటి బయట ఆగి ఉన్న లారీ పైకెక్కి ఆడుకుంటున్నా. సరదాగా గెంతుతుండగా నా కుడి చేయి విద్యుత్ తీగలకు తాకింది. షాక్ కొట్టి లారీలో పడిపోయా. గమనించిన మా నాన్న చంద్రయ్య నన్ను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన విద్యుదాఘాతానికి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అపస్మారక స్థితిలో ఉన్న నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. చేతికి వెంటనే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. రూ.1.75 లక్షలు అవుతుందన్నారు. ఎలాగో కట్టాం. నా కుడి చేతి నరాలకు సర్జరీ చేశారు కానీ, విజయవంతం కాలేదు. ఆరు రోజుల తర్వాత... భుజం వరకు చేతిని తొలగించకపోతే గుండెకు ప్రమాదమన్నారు. చెయ్యి తీసేశారు. ఎడమ తొడ, కాళ్ల వేళ్లు, అరికాళ్లకు కూడా చాలా గాయాలయ్యాయి. 25 రోజులు ఆస్పత్రిలోనే ఉన్నా. వైద్యానికి మొత్తంగా రూ.5 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. అన్నయ్య, అమ్మ కలిసి ఆ అప్పు తీర్చడానికి చాలా కష్టపడ్డారు. ఆస్పత్రిలో, ఇంటికి వచ్చాక మా పెద్దమ్మ లింగమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నాకు ధైర్యం చెప్పింది.
ఏడాది వరకు..
కోలుకున్నాక ‘నాన్న ఎక్కడ’ని అడిగితే... చేపల వేటకు చెన్నై వెళ్లారని, త్వరలోనే వచ్చేస్తారని ఇంట్లోవాళ్లు చెబుతూ వచ్చారు. దాదాపు ఏడాది తరువాత కానీ నాకు తెలియలేదు. నాన్న ఇక లేరని. నాన్నే లోకంగా బతికిన నేను ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఇప్పటికీ ఆయన నా వెంటే ఉంటారని నమ్ముతాను. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలోని ముత్తుకూరులో ఓ మత్య్సకార కుటుంబం మాది. నాన్న చంద్రయ్య, అమ్మ బుజ్జమ్మ వ్యవసాయ కూలీలు. వ్యవసాయ పనులు లేనప్పుడు నాన్న చేపల వేటకు వెళ్లేవారు. అన్నయ్య వెంకటేశ్వర్లు డ్రైవర్.

నాకు నేను ధైర్యం చెప్పుకొని...
చిన్నప్పటి నుంచీ క్రీడల్లో పాల్గొనేదాన్ని. ఖోఖో, కబడ్డీ, పరుగు పోటీల్లో ముందుండేదాన్ని. ప్రమాదానికి ముందు 4-100 రిలేలో పాల్గొని రజత పతకం సాధించా. నాన్నకు ఆ మెడల్ చూపిస్తే భుజాలపై ఎక్కించుకొని ఊరంత తిప్పి, అందరికీ చెప్పి సంబరపడ్డారు. ఆయన ఆనందం చూసి... ఎప్పటికైనా మంచి క్రీడాకారిణి కావాలని కలలు కన్నా. కానీ విద్యుద్ఘాతంతో ఆటలకు దూరమవ్వాల్సి వచ్చింది. పదో తరగతి వరకు పోయిన చెయ్యి తిరిగి వస్తుందని అనుకునేదాన్ని. ఆ తర్వాత కానీ తెలియలేదు బతికినంత కాలం ఒంటి చేత్తోనే నెట్టుకురావాల్సి వస్తుందని. పోలీసు అవ్వాలనేది నా చిన్ననాటి కోరిక. ఇక అది సాధ్యం కాదని తెలిసి ఎంతో బాధపడ్డాను. అలాగని కుంగిపోలేదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉండగా.. నెల్లూరు స్టేడియంలో జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ నిర్వహిస్తారని తెలిసింది. 2019లో జరిగిన ఆ పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు, లాంగ్‌జం్‌పలో పాల్గొని మూడు పసిడి పతకాలు గెలిచాను. రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాను.
బలంగా నిశ్చయించుకున్నా..
జిల్లా స్థాయి పోటీలంటే ఏదో నాకున్న ఆసక్తితో బరిలోకి దిగి పతకాలు నెగ్గా. కానీ రాష్ట్ర స్థాయి క్రీడలకు అర్హత సాధించడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. క్రీడలనే కెరీర్‌గా మలుచుకోవాలని ఆ క్షణమే బలంగా నిశ్చయించుకున్నా. రాష్ట్ర స్థాయిలో రాణించాలంటే కోచింగ్ అవసరం. దాంతో నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలోని శాప్ కోచ్ షేక్ జాసీంను కలిశాను. నా పట్టుదల, సామర్థ్యం చూసి సాధారణ అథ్లెట్లతో కలిపి సార్ నాకు శిక్షణ ఇచ్చారు. ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి 100, 200 మీటర్ల స్ర్పింట్, లాంగ్‌జంప్ ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించాను. ఈ విజయం జాతీయ స్థాయి పోటీలకు కావల్సినంత స్ఫూర్తినిచ్చింది. 2021లో బెంగళూరులో జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్ 100 మీటర్ల స్ర్పింట్, లాంగ్‌జం్‌పలో రజతాలు, 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలిచాను.
మలుపు తిప్పిన పోటీ...
జాతీయ స్థాయిలో నేను సాధించిన తొలి పతకాలు ఇవే కావడంతో వాటిని చూసి అమ్మ ఎంతో సంబరపడింది. అప్పటి నుంచి ఈ ఏడాది వరకు జరిగిన ఖేలో ఇండియా పారా అథ్లెటిక్స్, జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధిస్తూనే ఉన్నా. అయితే నా కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం రెండేళ్ల కిందట థాయ్‌లాండ్‌లో జరిగిన ‘వరల్డ్ ఎబిలిటీ పారా గేమ్స్’. టీ-46 కేటగిరీలో 100, 200 మీటర్ల పరుగులో కాంస్య పతకాలు గెలిచాను. నా కెరీర్‌లో ఇవే తొలి అంతర్జాతీయ మెడల్స్. తాజాగా ఈ నెలలో చెక్ రిపబ్లిక్‌లో నిర్వహించిన ‘ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ’ 100 మీటర్ల రేసును 13.70 సెకన్లలో, 200 మీటర్ల రేసును 29.07 సెకన్లలో పూర్తి చేసి రెండు స్వర్ణ పతకాలు సాధించాను. 34 దేశాలకు పైగా అథ్లెట్లు తలపడిన ఈ మెగా ఈవెంట్‌లో గట్టి పోటీ ఎదురైంది. అన్నిటినీ దాటి రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయురాలిని నేనే అంటే గర్వంగా ఉంది. కెరీర్‌లో ఇప్పటివరకు ఇరవైకి పైగా పతకాలు గెలిచాను.
ప్రస్తుత లక్ష్యం...
గత వారం బెంగళూరు వేదికగా జరిగిన ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ పోటీల్లో 100, 200 మీటర్ల స్ర్పింట్‌లో రెండు రజత పతకాలు సాధించా. ప్రస్తుతం నేను పోటీ పడే రెండు విభాగాల్లో 100 మీటర్లలో 11.97 సెకన్లు, 200 మీటర్లలో 27.92 సెకన్లు ప్రపంచ అత్యుత్తమ టైమింగ్‌గా ఉంది. నా వ్యక్తిగత టైమింగ్ 13.56 సెకన్లు, 29.05 సెకన్లు. మరింత అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ తీసుకొని దీన్ని మెరుగు పర్చుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది జపాన్‌లో జరిగే ఆసియా పారా క్రీడల్లో దేశానికి స్వర్ణ పతకం అందించాలనే పట్టుదలతో సాధన చేస్తున్నా.’’
ఫ ఎస్.ఎస్.బి. సంజయ్
అదొక్కటే ఆధారం..
అమ్మ కిడ్నీల వ్యాధితో బాధపడుతోంది. కూలీ పనులకు వెళ్ల లేకపోతోంది. నాకు వచ్చే రూ.6 వేల ఫించన్, అమ్మకు వచ్చే రూ.4 వేల వితంతు ఫించనే మేము బతకడానికి ఆధారం. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలంటే ఈవెంట్‌కు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. నా డైట్‌కు కూడా కష్టమవుతోంది. మా ఊరు నుంచి నెల్లూరు 30 కిలోమీటర్లు. ఉదయం ఐదున్నరకు బస్సు ఎక్కితే, గంట ప్రయాణం తర్వాత స్టేడియానికి చేరుకొంటా. రెండు గంటలు సాధన తరువాత మళ్లీ ఇంటికి చేరేసరికి గంట పడుతుంది. మళ్లీ మధ్యాహ్నం 3.30కు వెళ్లి 7.30కు వస్తాను. రోజు 4 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తోంది. దగ్గర్లో సింథటిక్ ట్రాక్ లేకపోవడంతో నెలలో రెండుసార్లు గుంటూరు వెళ్లి నాగార్జున యూనివర్సిటీలో సాధన చేస్తున్నా. ఎంసీఏ చదవాలని ఉంది. యూనివర్సిటీలో ఫ్రీ సీటు ఇస్తే అక్కడే చదువుకుంటూ సాధన చేస్తాను.
చేయూత కోసం..
ఇప్పటివరకు నేను సాధించిన పతకాలకు రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాలసీ, జీఓలు ప్రకారం సుమారు రూ.20 లక్షలు రావాల్సి ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక రూ.2 లక్షలు ఇచ్చారు. చెక్ రిపబ్లిక్ పోటీల్లో పాల్గొనేందుకు రూ.1.96 లక్షలు ఖర్చు కాగా శాప్ చైర్మన్ రవినాయుడు గారి చొరవతో ఎన్‌ఆర్‌ఐ సెల్ ద్వారా రూ.1 లక్ష సాయం అందించారు. పెండింగ్ బకాయిలు విడుదల చేస్తే నా కష్టాలు కొన్ని అయినా తీరుతాయి. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకయ్యే ఖర్చులను సర్కార్ భరిస్తే దేశానికి మరిన్ని పతకాలు అందిస్తా. ఇక, నాకు క్రీడల్లో ధోనీ, హీరోల్లో బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. జీవితంలో ఒకసారైనా వారిద్దరినీ కలవాలనేది నా ఆకాంక్ష.
ఇవీ చదవండి:
జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్
22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..