Share News

Power of Listening: దివ్య తేజోశక్తి

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:36 AM

ఐరావతం కేవలం గజరూపం కాదు అది శ్రద్ధ వినయ శ్రవణశక్తుల ప్రతీకంగా తేజోమయ రూపంగా నిలుస్తుంది వేదాంతం నుంచి బౌద్ధ ధర్మం వరకు వినే శక్తికి ఇచ్చిన స్థానం మరియు దానికి సంబంధిత పురాణ కథలు దీన్ని మానవ విలువలతో ముడిపెడతాయి

Power of Listening: దివ్య తేజోశక్తి

తెలుసుకుందాం

వినయంగా మొర ఆలకించే గణేశుడు, చైతన్యంతో సంచరించే హనుమంతుడు. అంతఃశ్రద్ధతో పరితపించే బుద్ధుడు... ఈ పవిత్ర మూర్తులందరూ పెద్ద చెవులు కలిగిన శ్రవణ శక్తికి ప్రతీకలు. ఐరావతం మనలో దాగి ఉన్న వినికిడి శక్తికి చిహ్నం. అర్థవంతమైన శ్రవణమే జ్ఞానానికి మూలం. వేదాంతం ‘శ్రవణం... మననం... నిదిధ్యాసనం’ అనే త్రికరణ మార్గంలో నడుస్తుంది. జాతక కథల ప్రకారం, బుద్ధుడు తన గత జన్మలో ఐరావతంగా జన్మించాడు. బౌద్ధ ధర్మంలో క్షమ, సహనం అనే తత్త్వాలకు ప్రతిరూపంగా ఆ గజ రూపం తేజస్సుతో మెరిసింది. తూర్పు ఆసియాలో మూడు గజ ముఖాలతో పూజలు అందుకొనే ‘ఎరవాన్‌’ రూపం ఈ విశ్లేషణకు భౌతికమైన ఆధారం. పురాణాల్లో శత్రువును బలంతో జయించే ఐరావతం... బౌద్ధంలో సహనంతో సమరసత పొందే శాంతమూర్తిగా దర్శనమిస్తుంది.


ఐరావతం... ఒక తెల్లని గజరూపం మాత్రమే కాదు, ఒక తేజోమయమైన శ్రద్ధాశక్తి. వినిపించని ధ్వనుల్ని అందుకోగలిగే ఒక దివ్య శ్రవ్య శక్తి. ఆ శ్రవ్యశక్తికి మూలమైన కరుణ ఆ (అతని) స్వరూపంలో ఆవిష్కృతం అవుతుంది. ఆ శ్వేత (తెల్లని) కాంతికి మూలం ఏమిటి? చెవుల విశాలతలో మర్మం ఏమిటి? ఆ పెద్ద చెవులు కేవలం శరీరావయవాలు కావు. అవి శ్రవణశక్తికి రూపాలుగా, దైవత్వపు సంకేతాలుగా నిలుస్తాయి. ఆకాశాన్ని తాకే మేఘంలా మెరిసే ఐరావతుడు.. భూమికి వర్షప్రసాదాల వాహకుడుగా పురాణాల్లో కనిపిస్తాడు. ‘ఓంకారమే సృష్టికి ఆది’ అని ఆర్యోక్తి. అది శబ్దరూపంగా గ్రహించదగినదే కానీ, దృష్టికి అందని తత్త్వం. అందుకే శ్రవణమే జ్ఞానానికి తొలి ద్వారం. వినగల యోగ్యతకు ప్రాధాన్యం ఇవ్వడమే పురాణాల్లోని ఈ ప్రతీకాత్మకత తాలూకు సంకల్పం. వినే సామర్థ్యానికి ప్రాధాన్యాన్నిస్తూ... పురాణాల్లో ముందొచ్చిన చెవుల ప్రశస్తి కనిపిస్తుంది. వేదాలలో వర్షాధిదేవతగా ఇంద్రుణ్ణి కీర్తించారు. అతని వాహనం ఐరావతం. రైతుకు వర్షం యజ్ఞఫలం. అందుకే ఐరావతాన్ని రైతు పూజిస్తాడు. అది మేఘాల మార్మిక నాదాన్ని గ్రహించి, వర్షంగా మార్చి అందిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించగలగడం మనలోని శ్రద్ధను ప్రతిబింబిస్తుంది. భూమిపై పండే ఫలాలే యజ్ఞఫలమనే తత్త్వానికి ఇది ప్రతిపాదన.


విష్ణు వంశ వృత్తాంతం

ఐరావతుడు... విష్ణువు వంశంలో జన్మించినవాడు. విష్ణువు, బ్రహ్మ, కశ్యపుడు, ఇరావతి, ఐరావతుడు.. ఇదీ వంశక్రమం. దక్షప్రజాపతి కుమార్తె భద్రమతకు, కశ్యపునికి జన్మించిన ఇరావతి కుమారుడే ఐరావతుడు. రామాయణంలోని అరణ్యకాండ ప్రకారం... అతను మానవ రూపంలో కాకుండా మహా గజ రూపంలో జన్మించాడు. రావీ నదికి ‘ఇరావతి’ అనే మరో పేరు ఉండడం విశేషం. కాగా... దుర్వాసుడు ఇచ్చిన ఒక పుష్ప మాలికను ఐరావతుడి కాళ్ళకు ఇంద్రుడు అలంకరించాడు. ఆ పూలపై తేనెటీగలు వాలి, తనను భాధించడంతో... ఆ మాలను ఐరావతుడు విసిరేశాడు. దాన్ని ఇంద్రుని అహంకారంగా భావించిన దూర్వాసుడు... దేవతలందరూ ముసలివారై, సమస్త శక్తులు కోల్పోతారని శాపం ఇచ్చాడు. క్షీరసాగరాన్ని మథించి... అమృతం పొందితే తిరిగి శక్తిమంతులు కావచ్చంటూ శాపవిమోచన మార్గాన్ని కూడా చెప్పాడు. దేవతలు తమ శక్తిని నష్టపోవడానికి కారణమైన ఈ సంఘటనే క్షీరసాగర మథనానికి నాంది. శాపం పొందడానికి కారణం... శ్రద్ధను కోల్పోవడమే. దానికి ప్రేరణా సూత్రధారి ఐరావతం. స్కాంద పురాణం ప్రకారం, సురపద్ముడనే రాక్షసుడితో జరిగిన యుద్ధంలో... అతని రథాన్ని ధ్వంసం చేసిన ఐరావతుడు ‘వాహనశూరుడు’ అనే బిరుదు పొందాడు. ఈ యుద్ధంలో అతని దంతాలు విరిగితే... వాటిని శివుడు మళ్ళీ ప్రసాదించాడు. ఐరావతుణ్ణి మరింత శక్తిమంతుడిగా అనుగ్రహించాడు.


తూర్పు దిక్పాలకుడిగా...

అష్టదిక్పాలకుల వ్యవస్థలో తూర్పు దిక్కు పాలనా బాధ్యతను ఐరావతుడికి బ్రహ్మ అప్పగించాడు. ఇది కేవలం ఒక హోదా కాదు... ఆధార శక్తికి సంకేతం. తూర్పు అంటే అభ్యుదయ దిశ. ఐరావతం దానికి అధిష్ఠాన రూపం. అన్ని నాదాలు అందరికీ వినిపించవు. దాన్ని వినగల చెవి ‘ఐరావతం’గా మారుతుంది. ఐరావతం నడిచిన బాటలు మేఘాలను మోస్తాయి. దాని పదఘట్టనలతో యుద్ధ రంగాలు కంపిస్తాయి. కానీ వాటి వెనుక నిలిచి ఉన్న తెల్లని రంగులో ఉండే (శ్వేత) శక్తి... ధర్మాన్ని నిలబెడుతుంది. ఐరావతం, ఎరవాన్‌, ఏరావత... ఇలాపేర్లు మారినా రూపం ఒక్కటే. అది ధర్మాన్ని మోసుకువచ్చే తేజోమయమైన వినయ స్వరూపం. విశాలమైన ఐరావతం చెవులు... ‘వినడం’ అనే వినయపూర్వక అభ్యాసానికి నిరంతర హేతువులు.

ఐరావతుడు... విష్ణువు వంశంలో జన్మించినవాడు. విష్ణువు, బ్రహ్మ, కశ్యపుడు, ఇరావతి, ఐరావతుడు.. ఇదీ వంశక్రమం. దక్షప్రజాపతి కుమార్తె భద్రమతకు, కశ్యపునికి జన్మించిన ఇరావతి కుమారుడే ఐరావతుడు. రామాయణంలోని అరణ్యకాండ ప్రకారం... అతను మానవ రూపంలో కాకుండా మహా గజ రూపంలో జన్మించాడు.

-డాక్టర్‌ జి.వి. పూర్ణచంద్‌


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 12:36 AM