Share News

Zoho Mail: భారత ప్రభుత్వ ఈ-మెయిల్స్ ఇక జోహో ద్వారానే..

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:20 PM

భారతీయులు చాలా కాలం నుంచి తమ మెయిల్స్ పంపించుకునేందుకు ముఖ్యంగా జీ మెయిల్, తదితర ఫ్లాట్ ఫామ్స్ వాడుతున్నారు. అయితే, ఇక నుంచి స్వదేశీ సంస్థ అయిన జోహో సేవల్ని ఉపయోగించుకోబోతున్నారు.

Zoho Mail: భారత ప్రభుత్వ ఈ-మెయిల్స్ ఇక జోహో ద్వారానే..
Zoho Mail

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో ఇప్పటివరకూ అధికార, అనధికార ఈ-మెయిల్ సేవల కోసం ముఖ్యంగా జీమెయిల్ పై ఆధారపడ్డాం. అయితే, ఆ స్థానంలో ఇప్పుడు స్వదేశీ సంస్థ అయిన జోహో వచ్చింది. ఇక మీదట భారత ప్రభుత్వ ఈ-మెయిల్ సేవలన్నీ జోహో మెయిల్ ద్వారానే జరుగబోతున్నాయి.

20 భద్రతా ఆడిట్ల తర్వాత భారత ప్రభుత్వం తమ జోహో మెయిల్ సేవల్ని అంగీకరించిందని జోహో కార్పొరేషన్ కంపెనీ సహ-వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) నిర్వహించిన అన్ని ఆడిట్లలో తమ జోహో మెయిల్ సేవలు విజయం సాధించాయని, ఇది చాలా సంతోషకరమైన విషయమని శ్రీధర్ ప్రకటించారు.


2023లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మీతీ) జారీ చేసిన టెండర్‌లో జోహో మెయిల్ విజేతగా నిలిచిందని శ్రీధర్ వెల్లడించారు. దీని వెనుక 15 నుంచి 20 వరకు భద్రతా ఆడిట్లు జరిగాయన్నారు. ఈ ఎంపిక ఆషామాషీగా జరుగలేదని, ' మా కోడ్, డేటా సెంటర్లు, భద్రతా పద్ధతులు అన్నీ పరిశీలించేందుకు విస్తృత ఆడిట్లు జరిగాయని' ఆయన చెప్పారు. ఎన్‌ఐసీ టీమ్ అన్ని భద్రతా పరీక్షలు నిర్వహించాకే తమ సంస్థని ఎంపిక చేసిందన్నారు.


ప్రస్తుతానికి 15 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు జోహో సిస్టమ్‌లో చేరారని శ్రీధర్ పేర్కొన్నారు. 2025 జులైలో జరిగిన గ్లోబల్ డేటా లీక్ ఘటన తర్వాత, భారత ప్రభుత్వం @mail .gov.in డొమైన్‌కు మారమని సిఫార్సు చేసిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జోహో ఎంపిక కేవలం స్వదేశీ సంస్థనే ఉద్దేశ్యంతో జరిగింది కాదని, ముమ్మాటికీ మెరిట్ ఆధారంగానే ఎంపికైందని శ్రీధర్ స్పష్టం చేశారు. అటు, ఇండియాలోని ప్రైవేట్ సెక్టార్‌లోనూ ఈ-మెయిల్స్ కోసం జోహోను ఎక్కువగా ఎంపిక చేస్తున్నారని శ్రీధర్ అన్నారు. దాదాపు 1.5 మిలియన్లకు పైగా వినియోగదారులు ఇప్పుడు జోహోని వాడుతున్నారని తెలిపారు.


దీనిపై మీతీ సెక్రటరీ ఎస్.కృష్ణన్ కూడా స్పందించారు. మెరిట్ ఆధారంగా భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ విజయం జోహోను భారతీయ సాఫ్ట్‌వేర్ రంగంలో 'నేషనల్ చాంపియన్'గా మార్చిందన్నారు. దేశంలోని 33 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు జోహో మెయిల్ భద్రతతో కూడిన మెయిల్ సేవలు అందించడంతో, డిజిటల్ ఇండియా లక్ష్యాలకు ఇది మరో బలమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.


కాగా, ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తాను జోహో మెయిల్ కు మారుతున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి అధికారిక మెయిల్స్ అన్నీ జోహో మెయిల్ ద్వారానే జరుగుతాయని తన కొత్త జోహో మెయిల్ ఐడీని వెల్లడి చేశారు.


ఇవి కూడా చదవండి..

జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే

సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 08:12 PM