Share News

CP Radhakrishnan: రాధాకృష్ణన్ ఎంపిక వెనుక ఎన్డీయే వ్యూహం ఇదే

ABN , Publish Date - Aug 18 , 2025 | 03:57 PM

తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మెరుగుపరచుకునే వ్యూహాన్ని బీజేపీ అనుసరించిందనే చెప్పాలి.

 CP Radhakrishnan: రాధాకృష్ణన్ ఎంపిక వెనుక ఎన్డీయే వ్యూహం ఇదే
CP Radhakrishnan

న్యూఢిల్లీ: కేంద్రంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) సుదీర్ఘ కసరత్తు చేసి మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan)ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. ఏకాభిప్రాయ సాధనతో రాధాకృష్ణన్‌ను పోటీ లేకుండా ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టేందుకు విపక్షాలు కలిసిరావాలంటూ పిలుపునిచ్చింది. అందుకు పావులు కూడా కదుపుతోంది. తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన రాధాకృష్ణన్‌ను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మెరుగుపరచుకునే వ్యూహాన్ని బీజేపీ అనుసరించిందనే చెప్పాలి. ముఖ్యంగా రాధాకృష్ణన్ ఎంపిక ద్వారా తమిళనాట అధికార డీఎంకే సపోర్ట్ పొందాలని ఆశిస్తోంది. అలా కాని పక్షంలో రాజకీయంగా దీనిని ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు.


ఆరోగ్య కారణాలతో రాజీనామా చేసిన జగ్దీప్ ధన్‌ఖడ్ దక్షిణాది నేత కాగా, ఉప రాష్ట్రపతిగా ఎన్డీయే ఎంపిక చేసిన రాధాకృష్ణన్ సైతం దక్షిణాదికి చెందిన వారే కావడం ఒక సామీప్యం. అందర్నీ కలుపుకొని వెళ్లే 'సాఫ్ట్ స్పోకెన్ లీడర్'గా రాధాకృష్ణన్‌కు పేరుంది. అదీకాక ఆయన పార్లమెంటుకు కొత్త కూడా కాదు. కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా ఐదుసార్లు పోటీ చేశారు. మొదటి రెండు సార్లు 1998, 1999లో గెలిచారు కూడా. అయితే ఆ తర్వాత 2004, 2014, 2019లో ఓటమి చవిచూశారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా నిర్ణయాలు చాలామటుకు అనూహ్యంగానే ఉంటాయని చెప్పొచ్చు. ఎన్డీయే నామినాగా రాధాకృష్ణన్ ఎంపిక కూడా అలాంటిదే. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికను మహారాష్ట్ర రాజ్‌భవన్ నుంచే ఎంచుకోవాల్సి వచ్చిందనడానికి కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు.


మొదటిది జగ్దీప్ ధన్‌ఖడ్ తరహా వ్యక్తి రాధాకృష్ణన్ కాదు. జాట్ నేత అయిన ధన్‌ఖడ్ గతంలో కాంగ్రెస్, జనతాదళ్‌తో పనిచేశారు. రాధాకృష్ణన్ మొదట్నించి సంఘ్, బీజేపీతో కలిసి అడుగులు వేసిన వ్యక్తి. 2023లో జార్ఖాండ్ గవర్నర్‌ కాకముందు లోక్‌సభ ఎంపీగా, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడుగా పనిచేశారు. ఇప్పుడు ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎలివేట్ చేయడం వెనుక ఆర్ఎస్ఎస్ సిఫారసు ఉండే అవకాశాలను కూడా కొట్టివేయలేం. రెండవది..హిందీ బెల్ట్ పార్టీగా బీజేపీకి పేరుంది. దక్షణాది వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా తమపై ఆ ముద్ర సరికాదని చెప్పుకునే అవకాశం బీజేపీ దక్కించుకుంది. ధన్‌ఖడ్‌కు ముందు ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఆయనకు తెలుగుతో పాటు హిందీలో కూడా పూర్తి పట్టు ఉంది. త్రిభాషా విధానానికి బీజేపీ పట్టుపడుతుండటం, తమిళనాడుపై బలవంతంగా హిందీ రుద్దుతున్నారనే విమర్శల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్‌ను బీజేపీ తెరపైకి తీసుకురావడం ఆసక్తికర పరిణామం.


రాధాకృష్ణన్ ఓబీసీ గౌండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం మూడో అంశం. ఎడప్పాడి పళనిస్వామి, కె.అన్నామలై కూడా ఇదే కమ్యూనిటీకి చెందిన వారు కావడంతో ఆ వర్గంలోనే కాకుండా పశ్చిమ తమిళనాడులో పార్టీ అవకాశాలు మరింత మెరుగుచేసుకునే ఆలోచనలో బీజేపీ ఉంది. రాధాకృష్ణన్ ఎన్నికల్లో ఓడిపోయినా కోయంబత్తూరులో ఆయన పొత్తులతో నిమిత్తం లేకుండా 30 శాతానికి పైగా ఓట్లు సాధిస్తూ వచ్చారు.


రాధాకృష్ణన్‌ను ఎన్డీయే అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా డీఎంకేను కార్నర్ చేసే అవకాశం బీజేపీ చిక్కించుకుంది. తమిళ నేత కావడంతో ఇండియా కూటమి అభ్యర్థికి స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సపోర్ట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. డీఎంకే సపోర్ట్ ఇవ్వకుంటే ఎన్నికల్లో బీజేపీ దీన్ని ఒక అస్త్రంగా తీసుకునే అవకాశాలుంటాయి. రాధాకృష్ణన్‌కు 'వాజ్‌పేయి ఆప్ కోయంబత్తూరు'గా ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. వీటికి తోడు ధన్‌ఖడ్‌తో పోల్చుకుంటే.. ధన్‌ఖడ్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో అనేకసార్లు విభేదిస్తూ వచ్చారు. రాధాకృష్ణన్‌ గవర్నర్‌గా జార్ఖాండ్, మహారాష్ట్ర, తెలంగాణలో (అదనపు బాధ్యతలు) పనిచేసినప్పటికీ ఎలాంటి విభేదాలకు తావులేకుండా బాధ్యతలు నిర్వహించారు.


ఇవి కూడా చదవండి..

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచ్చి శివకు ఛాన్స్

ప్రజలకు ప్రయోజనకరంగా ప్రవర్తించండి.. ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 04:00 PM