Vishal Dadlani: ‘వందేమాతరం’పై పార్లమెంటులో చర్చ.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విమర్శలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 08:48 PM
పార్లమెంటులో వందేమాతరంపై 10 గంటల పాటు చర్చ జరగడాన్ని విమర్శిస్తూ బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దద్లానీ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ చర్యతో భారత్‌లో పలు సమస్యలు పరిష్కారమయ్యాయంటూ ఆయన చురకలు అంటించారు.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంటులో 10 గంటల పాటు వందేమాతరం గేయంపై చర్చ జరగడంపై బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ విమర్శలు గుప్పించారు. విలువైన సమయం, ప్రజాధనం వృథా అయ్యిందని అన్నారు. ఈ మేరకు ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Vishal Dadlani).
వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంటులో ఇటీవల వాడివేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే (Vandemataram Debate in Parliament). బెంగాలీ కవి, రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గేయంతో ముడిపడిన చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతపై చర్చ జరిగింది. ఈ క్రమంలో విశాల్ దద్లానీ సెటైర్లు పేల్చారు.
‘హల్లో బ్రదర్స్, సిస్టర్స్.. మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. నిన్న వందేమాతరం దేశభక్తి గేయంపై పార్లమెంటులో 10 గంటల పాటు చర్చ జరిగింది. జనాలకు ఇది బాగా నచ్చింది. ఈ చర్చ కారణంగా దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమైపోయింది. ఇండిగో, వాయు కాలుష్య సమస్యలు కూడా తొలగిపోయాయి. దాదాపు 10 గంటల చర్చలో ఈ అంశాల ప్రస్తావన ఒక్కసారి కూడా లేకపోయినా అవన్నీ పరిష్కారమైపోయినట్టు కనిపిస్తోంది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పార్లమెంటు కార్యకలాపాల ఖర్చులపై కూడా విశాల్ పలు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు కార్యకలాపాల కోసం నిమిషానికి రూ.2.5 లక్షల చొప్పున ఖర్చవుతుందని అన్నారు. 600 నిమిషాల పాటు చర్చ జరిగిందంటే ఎంత ఖర్చయ్యిందో జనాలు లెక్కలు వేసుకోవాలని అన్నారు. దీంతో, ఆయన కామెంట్స్‌పై మరోసారి నెట్టింట చర్చ నడుస్తోంది. జనాలు తమ అభిప్రాయాలను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఇక ఈ అంశంపై పార్లమెంటులో చర్చ ప్రారంభించిన హోం మంత్రి అమిత్ షా.. వందేమాతర గేయం విశిష్టత సర్వకాలాలకూ వర్తిస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి
నైట్ క్లబ్స్‌లో బాణసంచాపై నిషేధం.. గోవా కీలక నిర్ణయం
మహారాష్ట్రలో చిరుత కలకలం.. భవనాల మధ్య దూకుతూ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి